తాగునీటి సమస్య రావొద్దు | Sakshi
Sakshi News home page

తాగునీటి సమస్య రావొద్దు

Published Sat, Apr 20 2024 1:55 AM

సూచనలు ఇస్తున్న కలెక్టర్‌ భవేష్‌మిశ్రా  - Sakshi

భూపాలపల్లి: తాగునీటి సమస్య తలెత్తకుండా పక్కా ప్రణాళికతో చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ భవేష్‌మిశ్రా అన్నారు. జిల్లాలో తాగునీటి సమస్య నివారణ, అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పురోగతిపై శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, ఏపీఓలు, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. రాబోయే మూడు నెలల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు. ఫలితంగా నీటి నిల్వలు అడుగంటిపోయే అవకాశం ఉందని చెప్పారు. ప్రత్యామ్నాయంగా వ్యవసాయ బోర్ల నుంచి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. మిషన్‌ భగీరథ పైపులైన్‌ ద్వారా నీరు సరఫరా చేసే క్రమంలో ఎక్కడైనా సాంకేతిక లోపం తలెత్తినా, పైపులు పగిలిపోవడం, గేట్‌ వాల్వ్‌ లీకేజీలు జరగడం లాంటివి జరిగినా వెంటనే గుర్తించి మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ పరిస్థితి జఠిలం కాకముందే జాగ్రత్తలు చేపట్టాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అన్నారు. హరితహారం మొక్కలు, గ్రామ పంచాయతీల్లో చేపట్టిన పనులపై అన్ని విషయాలు తెలిసి ఉండాలన్నారు. పాఠశాలల్లో జరుగుతున్న మౌలిక సదుపాయాల పనులను జాప్యం చేయకుండా పాఠశాలల పునః ప్రారంభం వరకు పూర్తి చేయాలన్నారు. 271 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పనులు చేపట్టాల్సి ఉండగా.. 209 పాఠశాలలకు ఇంజినీరింగ్‌ అధికారులు అందచేసిన ప్రతిపాదనల మేరకు పరిపాలనా అనుమతులు జారీ చేశామని చెప్పారు. మిగిలిన 62 పాఠశాలల ప్రతిపాదనలు శనివారం వరకు అందజేయాలని ఆదేశించారు. పనుల పురోగతిపై ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు నిరంతర పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనవు కలెక్టర్‌ కె.వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, ఆర్‌డబ్ల్యూఎస్‌, డీఆర్‌డీఓ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పాఠశాలల పనులు

త్వరగా పూర్తిచేయాలి

కలెక్టర్‌ భవేష్‌మిశ్రా

Advertisement
Advertisement