నేడు కేంద్ర మంత్రి పర్యటన
రేగొండ: మండలంలో నేడు (గురువారం) కేంద్ర సహాయ మంత్రి నిముబెన్ జయంతిబాయి బంబానియా పర్యటించనున్నారు. మండలంలోని రూపిరెడ్డి గ్రామంలో ఉదయం 8.30 గంటలకు భూసార పరీక్ష సేకరణ పద్ధతి, రైతు సంఘం సభ్యులతో చర్చించనున్నారు. రేగొండలో ఉదయం 10 గంటలకు పీహెచ్‌సీ సందర్శన, 10.30 గంటలకు జిల్లా పరిషత్ పాఠశాల, 11.30 గంటలకు అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి గర్భిణులకు అందిస్తున్న పౌష్టికాహరంపై చర్చించనున్నారు.
పగిలిన పైపులైన్..
ఎగిసిన నీరు
కాటారం: కాటారం మండల కేంద్రానికి సమీపంలో భూపాలపల్లి వైపుగా జాతీయ రహదారిని ఆనుకొని కేటీపీపీకి నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన పైపులైన్ గేట్ వాల్వ్ బుధవారం పగిలిపోవడంతో నీరు ఒక్కసారిగా ఎగిసిపడింది. కాళేశ్వరం సమీపంలోని గోదావరి నుంచి చెల్పూర్ సమీపంలోని కేటీపీపీకి నీటి సరఫరా కోసం గతంలో భారీ పైపులైన్ ఏర్పాటు చేసి అక్కడక్కడ పెద్ద గేట్‌వాల్స్ అమర్చారు. నీటి ప్రెషర్ కారణంగా మండల కేంద్రానికి సమీపంలో గేట్‌వాల్వ్ పగిలిపోవడంతో పెద్ద ఎత్తున నీరు బయటకు వచ్చింది. సుమారు గంటపాటు నీరు వృథాగా పారింది. సమాచారం అందుకున్న సిబ్బంది నీటి సరఫరాను నిలిపివేశారు.
ఉన్నట్టా.. లేనట్టా..?
పలిమెల : మండలంలోని కామన్‌పల్లి –ముకునూరు రహదారిలోని కిష్టాపురం పహాడ్ వద్ద పెద్ద పులి సంచరిస్తుందని మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి తెలిపిన సమాచారం మేరకు మంగళవారం ఉదయం నుంచి అటవీశాఖ అధికారులు గాలింపు చేపట్టారు. బుధవారం తిరిగి గాలింపు చేపట్టినట్లు ఎఫ్‌ఆర్‌ఓ నాగరాజు తెలిపారు. కాగా ఇప్పటి వరకు ఎలాంటి పెద్ద పులి అనవాళ్లు, పాదముద్రలు గుర్తించలేదని తెలిపారు. నేడు (గురువారం) కూడా గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అయితే అధికారులు ఎలాంటి నిర్ధారణ చేయకపోవడంతో పులి ఉందా.. లేదా అని స్థానికుల్లో సందిగ్ధం నెలకొంది.
రాష్ట్రస్థాయి బాక్సింగ్
పోటీలకు ఎంపిక
రేగొండ(కొత్తపల్లిగోరి): హనుమకొండ జేఎన్‌ఎస్‌లో నిర్వహించిన అండర్–17 బాలుర విభాగంలో కొత్తపల్లిగోరి జెడ్పీ పాఠశాల విద్యార్థి శశికుమార్ బాక్సింగ్‌లో గోల్డ్‌మెడల్ సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యా డు. ఈ సందర్భంగా విద్యార్థితోపాటు పీడీ రఘును ఎంఈఓ చంద్రశేఖర్, ప్రధానోపాధ్యాయురాలు మాధవిలత, ఉపాధ్యాయులు సంజీవ్, శ్రీనివాస్, సంపత్, షరీఫ్, దిలీప్, విద్యాసాగర్, రాజమౌళి, కరుణశ్రీ, వాణి, శ్రీలత అభినందించారు.
కాళేశ్వరాలయంలో పూజలు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని కాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో బుధవారం భక్తుల రద్దీ నెలకొంది. కార్తీకమాసం సందర్భంగా గర్భగుడిలో ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. అనంరతం ఉసిరి చెట్టు వద్ద ప్రత్యేకంగా దీపారాధనలు చేశారు. సామూహిక దీపాలంకరణ నిర్వహించారు.
బాలల హక్కుల రక్షణ
అందరి బాధ్యత
ములుగు : జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ బాలికల పాఠశాలలో ప్రపంచ బాలల హక్కుల దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమ అధికారి శిరీష, ఎంపీడీఓ రామకృష్ణ హాజరై మాట్లాడుతూ విద్యార్థులకు ప్రపంచ బాలల దినో త్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో వివిధ రంగాల్లో నిలిచిన చిన్నారులు జిల్లా బాలల పరిరక్షణ విభాగం ద్వారా పురస్కారాలు అందుకోవడం జరుగుతుందన్నారు. బాలలు సమాజానికి అమూల్యమైన సంపద అని వారందరు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. బాల బాలికలు ఎలాంటి వివక్షకు గురికా కుండా బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వద్వర్యంలో రూపొందించిన బాలల హక్కుల పరిరక్షణ చట్టాలపై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment