కౌలురైతులను గుర్తించని ప్రభుత్వాలు
శుక్రవారం శ్రీ 10 శ్రీ జనవరి శ్రీ 2025
పథకాలు
వర్తింపుజేయాలి
ప్రతీ ఏడాది ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తితోపాటు పొలం సాగు చేస్తున్నాను. దిగుబడి పెట్టుబడికే సరిపోతుంది. ప్రభుత్వం అందజేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకమైన కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని కౌలు రైతులకు వర్తింపజేయాలి. ప్రభుత్వం ఆదుకుంటే కౌలు రైతులకు ప్రయోజనం ఉంటుంది.
– అమరేందర్, కొత్తపల్లి(ఎస్‌ఎం), భూపాలపల్లి
● అనేక పథకాలకు దూరం ● ప్రతి సీజన్‌లోనూ నష్టాలపాలు
● బ్యాంకు రుణాలు పొందలేని పరిస్థితి ● అప్పులతోనే సాగుతున్న వ్యవసాయం
భూపాలపల్లి రూరల్: సొంతంగా భూమి లేకపోవడంతో భూమిని కౌలుకు తీసుకుని ఎన్నో ఏళ్లుగా వ్యవసాయమే జీవనాధారంగా బతుకులు వెల్లదీస్తున్న కౌలు రైతుల పరిస్థితి జిల్లాలో దయనీయంగా మారింది. వాతావరణ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలతో కౌలు రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నా.. కౌలు రైతులపై దృష్టి సారించకపోవడంతో వీరు ఆర్థికంగా నష్టపోతూ కోలుకోలేని స్థితికి చేరాల్సిన దుస్థితి నెలకొంది. కనీసం కౌలు రైతులు అధికారిక గుర్తింపునకు కూడా నోచుకోకపోవడం శోచనీయం. జిల్లాలో అధికారికంగా వీరికి గుర్తింపు లేకపోయినా దాదాపు 25,000 మందికి పైగానే కౌలు రైతులు ఉంటారనేది ఓ అంచనా.
గుర్తించని ప్రభుత్వం
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు కౌలు రైతులను గుర్తిస్తామని హామీ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో వారికి రుణ అర్హత కార్డులు అందజేసి, బ్యాంకు రుణాలు అందజేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌తోపాటు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం వీరిపై దయ చూపడంలేదు. దీంతో కౌలు రైతులు అప్పులపాలవుతున్నారు. కౌలు రైతులకు ఇతర రంగాల్లో ప్రావీణ్యం లేకపోవడంతో లాభనష్టాలతో సంబంధం లేకుండా కౌలు చెల్లించి వ్యవసాయాన్నే కొనసాగిస్తున్నారు.
కౌలు రైతులను
గుర్తించాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకుముందు హామీ ఇచ్చినట్లు కౌలు రైతులను గుర్తించాలి. కౌలు రైతులకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు జారీచేయాలి. అతివృష్టి, అనావృష్టి సమయంలో పరిహారం అందించాలి. రైతు భరోసాను అందించాలి.
– సమ్మయ్య, రైతు స్వరాజ్యవేదిక
జిల్లా ప్రధాన కార్యదర్శి
ఎకరానికి
రూ.15 వేల పైమాటే..
జిల్లాలో ఎకరానికి కౌలు రూ.12వేల నుంచి రూ.15వేల వరకు పలుకుతుంది. భూమిని బట్టి రైతులు కౌలును చెల్లిస్తున్నారు. జిల్లాలో నేటికీ కొన్ని ప్రాంతాల్లో వర్షాధార పంటలను సాగు చేస్తున్నారు. వర్షాధారంగా పంటలను పండించే భూములకు ఎకరాకు సంవత్సరానికి దాదాపు రూ.10వేల వరకు చెల్లిస్తుండగా.. సాగు నీరు పారే భూములకు రూ.12వేల నుంచి రూ.15వేల వరకు కౌలు చెల్లిస్తున్నారు. అతివృష్టి, అనావృష్టి వల్ల పెట్టుబడులు రాక అప్పుల పాలవుతున్నారు.
అన్ని పథకాలకు దూరమే..
రౌలు రైతులకు అధికారిక గుర్తింపు లేకపోవడంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ఏ పథకానికి వీరు అర్హత పొందలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా, రైతుబీమా వంటి పథకాలకు సైతం వీరు దూరం కావాల్సిన పరిస్థితి. దీనికి తోడు బ్యాంకు రుణాలు కూడా పొందలేని పరిస్థితి. దీంతో వడ్డీ వ్యాపారుల వద్ద ఎక్కువ వడ్డీకి రుణాలు తెచ్చుకుని వ్యవసాయం చేస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment