తుది దశకు సర్వే
సాక్షి, వరంగల్: పేదల సొంతింటి కల సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల యాప్ సర్వే వేగంగా జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో దరఖాస్తుదారులు ఉండకపోవడం, ఇంకొందరు ఉద్యోగం చేస్తున్న నగరాల నుంచి స్వగ్రామాలకు వెళ్లడం, కొన్ని సందర్భాల్లో గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో కొంతమంది వార్డు అధికారులు, ఇతర సిబ్బంది గైర్హాజరు కావడం, యాప్‌లో సాంకేతిక సమస్యల వంటి కారణాలతో సర్వే ఆలస్యమైంది. వారం రోజులుగా సర్వే వేగం పుంజుకుంది. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో 90 శాతానికిపైగా సర్వే పూర్తి చేశారు. సంక్రాంతిలోపు మొత్తం ముగుస్తుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా వరంగల్, హనుమకొండలో దరఖాస్తుదారులు సమయానికి అందుబాటులో లేకపోవడంతో కాస్త ఆలస్యమైంది. తమ ఇంటికి అధికారులు సర్వేకు రావడం లేదని, దరఖాస్తులు లేవని అధికారులు సమాధానం చెబుతున్నారంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
42 వేల మందికే..
ఉమ్మడి జిల్లాలో స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, పాలకుర్తి, నర్సంపేట, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలున్నాయి. ఈ 12 నియోజకవర్గాలకు 42,000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. మొదటి విడత ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించనున్నారు. తొలి విడత సొంత స్థలం ఉన్నవారికి, రెండో విడత స్థలం లేనివారికి ప్రభుత్వమే స్థలం ఇచ్చి ఇళ్లను మంజూరు చేయనుంది. ప్రజాపాలనలో మహిళల పేరుతో అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. వారి పేరు మీదనే ఇళ్లు ఎంపిక చేసేలా అధికారులు కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. గతంలో మాదిరిగానే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, నిర్మాణం, నిధుల విడుదలలో అక్రమాలు జరగకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన యాప్ ద్వారానే సమగ్ర వివరాలు పొందుపరిచే ప్రక్రియ పూర్తి కావొచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పది లక్షలకు పైగా దరఖాస్తులు వస్తే తొలుత భూమి ఉండి ఇళ్లు లేని వారికి ఇవ్వనున్నారు. వీరు దాదాపు నాలుగు లక్షలకుపైనే ఉండడంతో తొలి విడత 42,000 మందికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్ల కింద రూ.ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందనుంది. ఇదిలా ఉండగా సంక్రాంతి లోపు సర్వే పూర్తి కానుండడంతో యాప్‌లో వివరాలు వాస్తవంగా నమోదు చేశారా, ఏమైనా అవకతవకలకు పాల్పడ్డారా అని తెలుసుకునేందుకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ క్షేత్రస్థాయిలో సూపర్ చెక్ చేసేందుకు గ్రామాల్లో ఎంపీడీఓలు, మున్సిపాలిటీల్లో కమిషనర్ల లాగిన్‌లకు పంపుతోంది. వీరు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి సర్వేయర్లు యాప్‌లో నమోదు చేసిన వివరాలు సక్రమంగా ఉన్నాయా లేవా అని పరిశీలిస్తారు. ఏమైనా తప్పని తేలితే బాధ్యుడైన సర్వేయర్‌పై చర్యలు తీసుకునే అవకాశముంది. ఆ తర్వాత గ్రామసభలు ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ఆధ్వర్యంలో అర్హులను ఎంపిక చేయనున్నారు.
త్వరలో ఉమ్మడి జిల్లాలో
పూర్తికానున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే
సంక్రాంతి తర్వాత
దరఖాస్తుల పరిశీలన
అనంతరం గ్రామసభల్లో
అర్హుల ఎంపిక ప్రక్రియ
తొలి విడత భూమి ఉండి
ఇళ్లు లేని వారికే అవకాశం
ఉమ్మడి జిల్లాలో వచ్చిన దరఖాస్తులు, సర్వే పూర్తయిన వివరాలు..
జిల్లా వచ్చిన సర్వే శాతం
దరఖాస్తులు పూర్తయినవి
ములుగు 90,863 87,315 96
వరంగల్ 2,33,636 2,21,316 95.01
జనగామ 1,43,187 1,34, 696 94
భూపాలపల్లి 1,23,469 1,16,217 94
మహబూబాబాద్ 2,17,591 1,95,500 90
హనుమకొండ 1,96,703 1,82,228 92.64
10,05,449 9,37,272
Comments
Please login to add a commentAdd a comment