ఆత్మగౌరవం కోసం పోరాడిన ఓబన్న
భూపాలపల్లి రూరల్: బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలుగునాట ఉయ్యాలవాడ నరసింహరెడ్డితో కలిసి తెలుగువారి ఆత్మగౌరవం వడ్డె ఓబన్న వీరోచితంగా పోరాడారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ అధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌లోని ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్‌లో వడ్డె ఓబన్న జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఓబన్న చరిత్ర నేటి తరాలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అఽధికారిణి శైలజ, డీఆర్‌డీఓ నరేష్, వడ్డే సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ముంజాల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
టెక్నికల్ కోర్సు పరీక్షలు ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు డ్రాయింగ్ లోయర్ పరీక్షలు శనివారం ప్రారంభమైనట్లు ఏసీఈజీ రవీందర్‌రెడ్డి తెలిపారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉదయం, మధ్యాహ్నం నిర్వహించిన డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ హైయ్యర్, లోయర్‌లలో 478మంది విద్యార్థులకు గాను 309మంది హాజరుకాగా 169మంది గైర్హాజరైనట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అతిథిగా మంజుల
మొగుళ్లపల్లి: జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్ వేడుకలను తిలకించేందుకు అతిథులుగా మొగుళ్లపల్లి మండలకేంద్రానికి చెందిన బండారి మంజుల ఎంపికై ంది. మంజుల మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలిగా పనిచేస్తుంది. మహిళా సంఘాల బలోపేతానికి కృషిచేస్తుంది.
రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరికి తీవ్రగాయాలు
రేగొండ: ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొనడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడిన ఘటన మండలకేంద్రంలోని జగ్గయ్యపేట రోడ్డులో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిసిన వివరాల ప్రకారం.. కొత్తపల్లిగోరి మండలంలోని నిజాంపల్లి గ్రామానికి చెందిన కొమురాజు సందీప్ రేగొండ నుంచి నిజాంపల్లి వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో గణపురం మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన సాదు ప్రదీప్‌కుమార్ మరో బైక్‌పై అదే వైపు వెళ్తున్నాడు. జగ్గయ్యపేట వైపు వెళ్లే దారి వద్ద రెండు బైకులు వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై ఎస్సై సందీప్‌కుమార్‌ను వివరణ కోరగా ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలిపారు.
సమ్మక్క సాగర్ గేట్లు మూసివేత
కన్నాయిగూడెం: మండలంలోని తుపాకులగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గోదావరి పై ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీ గేట్లను అధికారులు మూసివేశారు. గత కొన్ని రోజుల నుంచి రెండు గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్న అధికారులు ఒక గేటును శనివారం మూసి ఒక గేటు ద్వారా 5,069క్యూసెక్కుల నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. బ్యారేజీలో 59 గేట్లకు 58 గేట్లను మూసి ఉంచారు. బ్యారేజీలోకి ఎగువ నుంచి 5,900క్యూసెక్కుల నీరు చేరుతుంది. ప్రస్తుతం బ్యారేజీలో 79.40 మీటర్ల నీటి మట్టం కొనసాగుతుంది. బ్యారేజీ సామర్థ్యం 6.94 టీఎంసీలకు 3.81 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఇంజనీరింగ్ అధికారులు వెల్లడించారు.
రామప్ప.. బ్యూటిఫుల్
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయ నిర్మాణం అద్భుతంగా ఉందని, కట్టడం బ్యూటీఫుల్‌గా ఉందని స్విట్జర్లాండ్ దేశానికి చెందిన టీనా దంపతులు కొనియాడారు. టీనా దంపతులు తమ కుమార్తెతో కలిసి రామప్ప రామలింగేశ్వరస్వామిని శనివారం దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప టెంపుల్ బాగుందని వారు కొనియాడారు. కాగా, టీనా భర్త స్వస్థలం హైదరాబాద్ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment