రైతులను అరిగోస పెట్టిందే కాంగ్రెస్
కాళేశ్వరం : రైతులను అరిగోస పెట్టే చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని మాజీ శాసన సభాధిపతి, శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. శనివారం మహదేవపూర్ మండలంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేపట్టిన కెనాల్ పనులతో తమకు అన్యాయం జరుగుతోందని ఆందోళన చేస్తున్న ఎలికేశ్వరం, సూరారం గ్రామాల్లోని భూ నిరాస్వితులను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌తో కలిసి పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విధులు నిర్వర్తిస్తున్న ఇరిగేషన్ డీఈఈ సూర్యప్రకాశ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భారీ ప్రాజెక్టుల నిర్మాణం, దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులు ఒక్కచోట కూర్చుండి చర్చించుకునేలా రైతు వేదికలకు శ్రీకారం చుట్టిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి ఏడాది కాలంలోనే రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో రైతుభరోసా, రుణమాఫీ పేరు చెప్పి మోసం చేశారని, ఇప్పుడు మహాదేవ్‌పూర్ ప్రాంత రైతులు ఏం పాపం చేశారని..అన్యాయం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తమకు నష్టపరిహరం అందలేదని, అన్యాయం జరుగుతుందని మొరపెట్టుకుంటే పోలీసులతో దౌర్జన్యం చేయిస్తరా అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత మంత్రిగా శ్రీధర్‌బాబుకు ఉందన్నారు. ఏడాదిలోనే ఇంత దిగజారి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రభుత్వాన్ని చరిత్రలో చూడలేదని, ప్రజలను అణిచివేయాలని చూస్తే తగినబుద్ధి చెప్తారని హెచ్చరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి, మంథని ఎమ్మెల్యే, మంత్రి ఆ విషయంలో విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. రైతుల సమస్యపై భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లా కేంద్రాల్లో ఎక్కడైనా రైతులను కలిసి సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం ఇప్పించిన తర్వాతనే పనులు చేయాలని సూచించారు. పోలీస్ పహారాలో పనులు కొనసాగిస్తామంటే సహించేది లేదని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు లింగంపల్లి శ్రీనివాసరావు, ప్రకాశ్, గీత, మహేష్, అలీంఖాన్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ స్పీకర్, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి
Comments
Please login to add a commentAdd a comment