నామినేషన్ల జాతర.. | Sakshi
Sakshi News home page

నామినేషన్ల జాతర..

Published Fri, Apr 19 2024 1:45 AM

- - Sakshi

మహబూబ్‌నగర్‌ లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 16,80,417 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో మహిళలు 8,48,293, పురుష ఓటర్లు 8,32,080, ఇతరులు 44 మంది ఉన్నారు. ఈ మేరకు 1,937 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ పరిధిలో సైతం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 17,34,773 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో మహిళలు 8,70,694, పురుష ఓటర్లు 8,64,034, ఇతరులు 45 మంది ఉన్నారు. ఈ మేరకు 2,057 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

2 స్థానాల్లోనూ త్రిముఖమే..

మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ల పరిధిలో త్రిముఖ పోరు కొనసాగనుంది. మహబూబ్‌నగర్‌ (జనరల్‌)లో బీజేపీ నుంచి డీకే అరుణ, కాంగ్రెస్‌ నుంచి చల్లా వంశీచంద్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి బరిలో ఉన్నారు. నాగర్‌కర్నూల్‌ (ఎస్సీ రిజర్వ్‌డ్‌)లో బీజేపీ నుంచి సిట్టింగ్‌ ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు భరత్‌ ప్రసాద్‌, కాంగ్రెస్‌ నుంచి మల్లు రవి, బీఆర్‌ఎస్‌ నుంచి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ బరిలో ఉన్నారు. ఈ పార్లమెంట్‌ పరిధిలోని అలంపూర్‌కు చెందిన మాజీ ఎంపీ, సీనియర్‌ నేత మందా జగన్నాథం కాంగ్రెస్‌ను వీడి బీఎస్పీలో చేరగా.. ఆయన బరిలో నిల్చొన్న పక్షంలో ఈ స్థానంలో చతుర్మఖ పోటీ కొనసాగే అవకాశం ఉంది.

లోక్‌సభ ఎన్నికల గెజిట్‌

నోటిఫికేషన్‌ విడుదల

2 పార్లమెంట్‌ స్థానాల్లో

తొలిరోజు 4 దాఖలు

మహబూబ్‌నగర్‌లో బీజేపీ నుంచి

డీకే అరుణ, మరో స్వతంత్ర అభ్యర్థి..

నాగర్‌కర్నూల్‌లో బీజేపీ, కాంగ్రెస్‌

అభ్యర్థులు భరత్‌ప్రసాద్‌, మల్లు రవి..

25 వరకు నామినేషన్ల స్వీకరణ..

26న స్క్రూటినీ.. మే 13న పోలింగ్‌

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: లోక్‌సభ ఎన్నికల గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఉమ్మడి పాలమూరులోని రెండు పార్లమెంట్‌ స్థానాల్లో (మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌) తొలిరోజు మొత్తం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. మహబూబ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ రెండు సెట్లు, మరో స్వతంత్ర అభ్యర్థి మహ్మద్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ ఒక సెట్‌ నామినేషన్‌ పత్రాలను కలెక్టరేట్‌లోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి రవినాయక్‌కు సమర్పించారు. నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లురవి, బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్‌ ప్రసాద్‌ ఒక్కో సెట్‌ చొప్పున నామినేషన్‌ పత్రాలను కలెక్టరేట్‌లోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి ఉదయ్‌కుమార్‌కు అందజేశారు. ఈ నెల 25 వరకు నామినేషన్‌ పత్రాల స్వీకరణకు తుది గడువు కాగా.. 26న స్క్రూటినీ నిర్వహించనున్నారు. 29న ఉపసంహరణ అనంతరం బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. వచ్చే నెల 13న పోలింగ్‌ జరగనుండగా.. జూన్‌ 4న కౌంటింగ్‌ చేపట్టి అదే రోజున ఫలితాలు వెల్లడించనున్నారు.

మహబూబ్‌నగర్‌ కాషాయమయం..

మహబూబ్‌నగర్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్‌ సందర్భంగా పట్టణం అంతా కాషాయమయంగా మారింది. నామినేషన్‌ వేసేందుకు ఇంటి నుంచి బయలు దేరే క్రమంలో ముందుగా ఆమె గోమాతకు పాదపూజ చేశారు. కాటన్‌ మిల్లు వద్ద వెంకటేశ్వర ఆలయంలో స్వామి పాదాల వద్ద నామినేషన్‌ పత్రాలు ఉంచి పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్‌ వరకు కళాకారుల ఆటపాటల మధ్య రాజ్యసభ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఎమ్మెల్సీ రవీందర్‌రెడ్డితో కలిసి బైక్‌ ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఆ తర్వాత అన్నపూర్ణ గార్డెన్స్‌ నుంచి వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ మీదుగా క్లాక్‌టవర్‌ వరకు ర్యాలీ సాగింది.

నాగర్‌కర్నూల్‌లో సందడి లేకుండానే..

నాగర్‌కర్నూల్‌లో తొలిరోజు అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీ అభ్యర్థులు మల్లు రవి, భరత్‌ ప్రసాద్‌ ఎలాంటి సందడి లేకుండానే నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. వీరు ఆయా పార్టీల ముఖ్య నేతల సమక్షంలో మరో సెట్‌ దాఖలు చేయనున్నారు. అదే రోజున పార్టీ శ్రేణులతో కలిసి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడంతోపాటు కార్నర్‌ మీటింగ్‌లు, బహిరంగసభల ద్వారా ఎన్నికల ప్రచారం ముమ్మరం చేయనున్నారు.

23, 24, 25వ తేదీల్లో..

నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ పరిధిలో ఈ నెల 23న కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవి మరోసెట్‌ నామినేషన్‌ పత్రాలు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ 24న నామినేషన్‌ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు నామినేషన్‌ ర్యాలీలో పాల్గొననున్నారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి భరత్‌ ప్రసాద్‌ 25న మరో సెట్‌ దాఖలు చేయనుండగా.. ఈ కార్యక్రమానికి ఆ పార్టీకి చెందిన ముఖ్యనేత, గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ హాజరుకానున్నారు.

నేడు చల్లా వంశీకి మద్దతుగా సీఎం రాక..

మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి శుక్రవారం నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించనుండగా.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. క్లాక్‌టవర్‌ చౌరస్తాలో నిర్వహించనున్న కార్నర్‌ మీటింగ్‌లో ఆయన పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడనున్నారు. ఈ మేరకు పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు భారీ ఎత్తున శ్రేణులు తరలించేలా ఆయా నియోజకవర్గాల నేతలు ఏర్పాట్లు చేశారు.

నేడు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్‌..

బీఆర్‌ఎస్‌ మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌లో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా బీఫాం అందుకున్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేసేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. త్వరలో మంచి ముహూర్తం చూసుకుని పార్టీ ముఖ్యనేతల సమక్షంలో మరో సెట్‌ నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసేలా ముందుకు సాగుతున్నారు. అదే రోజున భారీ ర్యాలీతో పాటు కార్నర్‌ మీటింగ్‌కు సమాయత్తమవుతున్నారు.

1/2

2/2

Advertisement
Advertisement