23లోగా సర్వే పూర్తి చేయాలి
గద్వాల: ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వేను ఈనెల 23వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అఽధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కన్ఫరెన్స్ హాల్‌లో సమగ్ర కుటుంబ సర్వేపై తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటింటి సర్వేను త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సర్వే వివరాల నమోదు కోసం అవసరమైన కంప్యూటర్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌ట్యాప్ వంటి వసతులను సమకూర్చాలని అధికారులకు సూచించారు. సర్వే డాటాలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా ఒకే మెయిల్ ఐడీ ద్వారా డేటా నమోదు చేయాలన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లను సమన్వయం చేసి, సర్వేను వేగంగా పూర్తి చేయాలన్నారు. అనంతరం ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం పోస్టర్లను ఆవిష్కరించారు.
19 రోజులపాటు ప్రజా విజయోత్సవాలు..
ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం నుంచి వచ్చేనెల 7వ తేదీ వరకు 19 రోజులపాటు ప్రజాపాలన –ప్రజా విజయోత్సవాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలో కళాజాతా వాహనాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమలపై ప్రజల్లో చైతన్యం పరిచేలా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. జిల్లావ్యాప్తంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో పెద్దఎత్తున ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఏఓ వీరభద్రప్ప, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్, జెడ్పీ సీఈఓ కాంతమ్మ పాల్గొన్నారు.
పత్తి కొనుగోళ్లలో వేగం పెంచండి
ఉండవెల్లి: రైతులకు ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉండవెల్లి శివారులోని పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రం వద్ద పత్తి వాహనాలు బారులుదీరడానికి గల కారణాలను తెలుసుకున్నారు. రైతులకు జారీ చేసిన టోకెన్ల మేరకు రావడం లేదని.. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉండటంతో పత్తి వాహనాలు అధికంగా వచ్చాయని సంబంధిత అధికారులు కలెక్టర్‌కు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్తి కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేందుకు వ్యవసాయశాఖ, సీసీఐ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. రైతులు తీసుకువచ్చిన పత్తిలో తేమశాతం పరిశీలించి, త్వరగా కొనుగోలు ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. కొనుగోలు చేసిన పత్తి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. కాగా, దళారులు రైతుల పేరుతో పత్తిని తీసుకువస్తున్నారని మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డెప్ప కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై ఆయన స్పందిస్తూ.. అధికారులు పూర్తి వివరాలు సేకరించి, పత్తిని కొనుగోలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ అధికారి పుష్పమ్మ, ఏడీఏ సక్రియా నాయక్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ కుమార్, డైరెక్టర్ శ్రీకాంత్, మార్కెట్ కార్యదర్శి ఎల్లస్వామి, ఏఓ సుబ్బారెడ్డి, సీసీఐ ప్రతినిధి రాహుల్, ఎస్‌ఐ మహేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment