బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రైవేట్,అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 2023–24 ఏడాదికి 1వ తరగతి ఉచిత ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల రెండవ జాబితా విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు డీఇఓ అన్నపూర్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అడ్మిషన్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 9వ తేదిలోగా సంబంధిత పాఠశాలలో చేరాలన్నారు. లేనిపక్షంలో ఉచిత అడ్మిషన్ రద్దు చేస్తారన్నారు. సంబంధిత మండల విద్యాశాఖాధికారిని సంప్రదించాలని ఆమె సూచించారు.
బోటు ఇంజిన్
నిర్వహణపై శిక్షణ
కాకినాడ సిటీ: ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన పధకం(పీఎంఎంఎస్‌వై) కింద కాకినాడ ఎస్‌ఎఫ్‌టీబోటు ఇంజిన్ నిర్వహణ, ఫిషింగ్ ప్రాక్టీస్‌పై మూడు రోజులు పాటు నిర్వహించిన నైపుణ్యాభివృద్ది శిక్షణ బుధవారం ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో సీఐఎఫ్‌ఎన్‌ఈటీ(విశాఖపట్నం యూనిట్) ఆధ్వర్యంలో దీనిని నిర్వహించింది. పీఎంఎంఎస్‌వై ద్వారా మత్స్యకారులకు అందిస్తున్న సంక్షేమం వివరాలను తెలియజేశారు.శిక్షణలో 40 మంది పాల్గొన్నారు. బోటు ఇంజిన్ల నిర్వహణ, మరమ్మతుపై ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు. దీనిపై సమాచారమున్న పుస్తకాలను కూడా మత్స్యకారులకు అందజేశారు. మత్స్యశాఖ జిల్లా జేడీ పీవీ సత్యనారాయణ, మత్స్యశాఖ అధికారులు వి. పెద్దిబాబు, ఎస్‌బి రంగారి, టి.సుమలత, టి. హరినాధ్‌రావు, గంగార్జున పాల్గొన్నారు.
అరుణాచల గిరి ప్రదక్షణ
యాత్రకు ప్రత్యేక బస్సు
కాకినాడ: కాకినాడ నుంచి అరుణాచల గిరి ప్రదక్షణ యాత్ర కోసం వేసిన ప్రత్యేక బస్సును కాకినాడ జిల్లా ప్రజారవాణాధికారి ఎం.శ్రీనివాసరావు బుధవారం ప్రారంభించారు. మధ్యాహ్నం 2 గంటలకు బస్సు ఇక్కడి నుంచి బయలుదేరింది. కాణిపాకం, శ్రీపురం దర్శనం అనంతరం ఈ ప్రత్యేక బస్సు అరుణాచలం వెళ్తుంది. అక్కడ గిరి ప్రదక్షణ పూర్తి అయ్యాక తిరిగి కంచి, శ్రీకాళహస్తి దర్శనం అనంతరం కాకినాడ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక బస్సు ప్రతీ నెల 3వ తేదీన కాకినాడ నుంచి వెళ్తుందని, గిరి ప్రదక్షణకు వెళ్ళాలనుకునే భక్తులు ముందుగా ఆర్టీసీ డిపోను సందర్శించి టిక్కెట్లు రిజర్వు చేసుకోవచ్చునని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ఎంయువీ మనోహర్, అసిస్టెంట్ మేనేజర్ టి.బాలకృష్ణ, ఏఈ కె.ప్రభాకరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఎవరెస్టు శిఖరం
అధిరోహించిన శ్రీనివాస్
పిఠాపురం: గొల్లప్రోలు మండలం చెందుర్తి పాల డైరీలో పని చేస్తున్న కానూరి శ్రీనివాస్ ఇటీవల ఎవరెస్టు బేస్ క్యాంపులో 5364 మీటర్ల ట్రెక్కింగ్ చేసి జాతీయ జెండా ఎగురవేశాడు. గతనెల 16న నేపాల్‌లో లుక్ల ప్రాంతం నుంచి ట్రెక్కింగ్ ప్రారంభించాడు. వారం రోజులకు ఎవరెస్టు బేస్ క్యాంపునకు చేరుకున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. ఎప్పటి నుంచో ఎవరెస్టు శిఖరం అధిరోహించాలన్న ఆకాంక్ష నెరవేరిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ఏిపీ సీఎం కప్ సెమీస్‌లో తూర్పు జట్టు
నాగమల్లితోట జంక్షన్(కాకినాడ సిటీ): తిరుపతిలో జరుగుతున్న ఏిపీ సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పురుషులు, మహిళల బాస్కెట్‌బాల్ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయని డిఎస్‌ఏ ఛీఫ్‌కోచ్ శ్రీనివాస్ కుమార్ బుధవారం తెలిపారు. బాస్కెట్‌బాల్ కోచ్ రుద్ర ఆధ్వర్యంలో తర్ఫీదు పొందిన జట్టు క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రతిభ చూపిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment