ఎమ్మెల్సీ ఎన్నికలకు సహకరించాలి
కాకినాడ సిటీ: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్ర ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) జె వెంకట్రావు విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్ ఈ నెల 11న జారీ అవుతుందని, ఆ రోజు నుంచి 18వ తేదీ వరకూ కాకినాడ కలెక్టరేట్‌లోని కోర్టు హాలులో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్లు స్వీకరిస్తారనని తెలిపారు. ఈ నెల 19న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, ఉపసంహరణకు 21వ తేదీ వరకూ గడువు ఉందని వివరించారు. వచ్చే నెల 5న బ్యాలట్ పేపర్ విధానంలో పోలింగ్, అదే నెల 9న ఓట్ల లెక్కింపు జరుగుతాయని చెప్పారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందన్నారు. రిటర్నింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్, ఈఆర్‌ఓగా తాను వ్యవహరిస్తామన్నారు. ఈ ఎన్నికలకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని 113 మండలాల్లో పురుషులు 9,642 మంది, సీ్త్రలు 6,674 కలిపి మొత్తం 16,316 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. మొత్తం 116 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించిన తుది ఓటర్ల జాబితా ప్రచురించామని తెలిపారు.
గ్రాడ్యుయేట్ ఓటు నమోదుకు గడువు పొడిగింపు
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటు నమోదు గడువును వచ్చే నెల 9వ తేదీ వరకూ పొడిగించినట్లు డీఆర్‌ఓ వెంకట్రావు తెలిపారు. తొలుత ఈ నెల 6 చివరి తేదీగా ప్రకటించారని, అప్పటి వరకూ నమోదు చేసుకున్న వారి పేర్లు ఈ నెల 23న ప్రచురించే డ్రాఫ్ట్ పబ్లికేషన్‌లో ఉంటాయని వివరించారు. డ్రాఫ్ట్ పబ్లికేషన్‌లో పేరు లేని వారు ఈ నెల 23 నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకూ ఓటు నమోదు చేసుకోవచ్చని, వారి పేర్లు డిసెంబర్ 30న ప్రచురించే తుది జాబితాలో ఉంటాయని చెప్పారు. ఈ నెల ఒకటో తేదీకి మూడేళ్ల ముందు డిగ్రీ పూర్తి చేసిన వారు గ్రాడ్యుయేట్ ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటి వరకూ 2,34,152 మంది ఓటర్లు నమోదయ్యారని తెలిపారు.
ఓటు నమోదుకు అవకాశం
సాధారణ ఓటర్లకు సంబంధించి గత నెల 29 నాటికి జిల్లాలో 16,35,300 మంది ఓటర్లుగా నమోదయ్యారని, వీరిలో 8,04,834 మంది పురుషులు, 8,30,002 మంది మహిళలు, 190 మంది ఇతరులు ఉన్నారని డీఆర్‌ఓ వెంకట్రావు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు వీలుగా ఈ నెల 9, 10, 23, 24 తేదీల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఆ తేదీల్లో ఆయా పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవెల్ అధికారులు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ అందుబాటులో ఉంటారన్నారు. వచ్చే నెల 24న అభ్యంతరాలను పరిశీలించి, జనవరి 6న ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment