విలీనమా.. విభజనా..!
గ్రామం జనాభా ఆదాయం
వాకలపూడి 13,861 3,00,00,000
ఇంద్రపాలెం 22,575 96,00,000
రమణయ్యపేట 28,369 2,80,00,000
చీడిగ 6,365 8,80,000
తూరంగి 25,001 1,34,98,463
వలసపాకల 9,975 79,89,675
మొత్తం 1,06,146 8,99,68,138
● తేలని గ్రామాల ‘పంచాయితీ’
● 14 ఏళ్లుగా పరిష్కారం కాని వివాదం
● వెనక్కు పోతున్న ఆర్థిక సంఘం నిధులు
● ఆదాయం ఉన్నా అభివృద్ధిలో తిరోగమనం
● ఆమ్యామ్యాలతో మోకాలడ్డుతున్న ఉద్యోగులు
● నాడు ‘బాబు’ పాలనలో వివాదానికి బీజం
● ఇప్పుడైనా పరిష్కరిస్తారా
‘బాబూ’ అంటున్న జనం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జిల్లా కేంద్రమైన కాకినాడ నగర పాలక సంస్థలో గ్రామాల విలీన వివాదానికి తెర దించే రోజు వస్తుందా.. గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు నిధులు విడుదలయ్యే మంచి రోజులు చూస్తామా.. అని ప్రజలు గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. గ్రామాల విలీన వివాదం మొదలై అప్పుడే 14 ఏళ్లు దాటిపోయింది. ప్రతిపాదిత విలీన గ్రామాల్లో ప్రగతికి ఈ వివాదం ప్రతిబంధకంగా మారింది. గ్రామాల విలీనంపై భిన్నాభిప్రాయాలున్నా విలీనానికే మొగ్గు కనిపిస్తోంది. మధ్యలో రాజకీయాలకు తోడు కొందరు పంచాయతీరాజ్ అధికారులు తమ ఆధిపత్యం కోల్పోకూడదని సాంకేతిక ప్రతిబంధకాలు సృష్టిస్తూ విలీనానికి తెర వెనుక మోకాలడ్డుతున్నారు. ఫలితంగా ఆయా గ్రామాల్లో అభివృద్ధి మందగించి, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పన్నుల భారం పడుతుందనే ఉద్దేశంతో విలీన ప్రతిపాదనను మొదట్లో కొంత మంది వ్యతిరేకించారు. వారు కూడా ఇప్పుడు ఆస్తి విలువ ఆధారంగానే పన్నుల విధానాన్ని కేంద్రం తీసుకు రావడంతో విలీనానికే మొగ్గు చూపుతున్నారు. నగర పాలక సంస్థలో విలీనమైతే ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కళ్లకు కనిపిస్తుందని మేధావి వర్గం అభిప్రాయపడుతోంది. మొత్తంగా చూస్తే విలీన గ్రామ పంచాయతీల్లో సుమారు లక్షన్నర మంది ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందా అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. ఈ వివాదం పుణ్యమా అంటూ గ్రామాల అభివృద్ధికి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు వెనక్కు పోతున్నాయనే ఆవేదన సర్వత్రా నెలకొంది.
ఏయే గ్రామాలంటే..
కాకినాడ నగర పాలక సంస్థకు సమీపాన ఉన్న ఎనిమిది గ్రామాలను విలీనం చేయాలని 2012లో నాటి రూరల్ ఎమ్మెల్యేగా కురసాల కన్నబాబు ప్రతిపాదించారు. తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, వలసపాకల, వాకలపూడి, రమణయ్యపేట, స్వామినగర్, ఎస్.అచ్యుతాపురం ప్రాంతాలను నగ ర పాలక సంస్థలో విలీనం చేసేందుకు ప్రయత్నించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కన్నబాబు ఈ ప్రతిపాదనను పట్టాలెక్కించేందుకు ప్రయత్నించారు. అయితే, న్యాయస్థానాల్లో కేసులతో ప్రతిష్టంభన ఏర్పడింది. తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా 2017లో కార్పొరేషన్‌లో గ్రామాల విలీనానికి పంచాయతీల తీర్మానాలు ద్వారా చేయించారు. దీనికి అనుగుణంగా గవర్నర్ ఆర్డినెన్స్ కూడా జారీ చేశారు. ఈ విషయాన్ని విలీనం కోసం ఆందోళన చేస్తున్న నగర పౌర సంక్షేమ సంఘం అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు స్పష్టం చేశారు. పంచాయతీలు తీర్మానాలు ఆమోదించగా వాటికి సంబంధించిన రికార్డులు పోలీసు బందోబస్తు మధ్య కార్పొరేషన్‌కు స్వాధీనమయ్యాయి. కొద్ది రోజుల తర్వాత ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులూ లేకుండా అప్పటి జిల్లా కలెక్టర్ నీతూకుమారి గ్రామ పంచాయతీలు కోరిన మేరకు రికార్డులు వెనక్కి ఇచ్చేయడమే కోర్టులో కేసులకు పరోక్ష కారణమైందని అంటున్నారు. అప్పట్లో అధికారంలో ఉన్న నేతల ప్రోద్బలంతో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆరు గ్రామాల విలీనం అంశం న్యాయస్థానంలో ఉండగా.. తమ ప్రాంతాలను మాత్రం ఎలా విలీనం చేస్తారంటూ స్వామినగర్, టీచర్స్ కాలనీల ప్రజలు కూడా కోర్టుకు వెళ్లారు. అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ ఈ ప్రక్రియను చిత్తశుద్ధితో పూర్తి చేయనందువల్లే వివాదానికి బీజం పడిందనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే విలీన ప్రక్రియ నిలిచిపోయి, కార్పొరేషన్ గత కౌన్సిల్ ఎన్నికలు 48 డివిజన్లకు మాత్రమే జరిగాయి. వాస్తవానికి కార్పొరేషన్ ఎన్నికలు 50 డివిజన్లతో నిర్వహించాల్సి ఉంది. కాకినాడ కార్పొరేషన్ పాలక వర్గ పదవీ కాలం ముగియడంతో రెండేళ్లుగా ప్రత్యేకాధికారి పాలన కొనసాగుతోంది.
వెనక్కు మళ్లుతున్న రూ.కోట్లు
నగర పాలక సంస్థకు ఎన్నికలు జరగకపోవడంతో రూ.20 కోట్ల ఆర్థిక సంఘం నిధులు రాకుండా పోయాయి. అంతకు ముందు 2010 – 17 మధ్య విలీన ప్రక్రియలో ప్రతిష్టంభన ఏర్పడటంతో ఏడేళ్ల కాలానికి కార్పొరేషన్ రూ.70 కోట్ల మేర ఆర్థిక సంఘం నిధులు నష్టపోయింది. అదే సమయంలో 8 గ్రామాలకు జనాభా ప్రాతిపదికన రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు, స్టాంప్ డ్యూటీ వాటా కలిపి సుమారు రూ.140 కోట్ల మేర నష్టపోయినట్టు అంచనాలున్నాయి. ఈ నిధులు రాకపోవడంతో గ్రామాల్లో సురక్షిత తాగునీరు, మురుగుపారుదల, కల్వర్టులు, రహదారుల నిర్మాణం, వీధి దీపాల నిర్వహణ వంటి కనీస మౌలిక సదుపాయాలకు ప్రజలు దూరమయ్యారు.
అధికారులకు కాసుల వర్షం
విలీన వివాదం గ్రామ పంచాయతీల్లోని పంచాయతీరాజ్ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. రమణయ్యపేట, వాకలపూడి, వలసపాకల వంటి గ్రామాల్లో భారీ పరిశ్రమలున్నాయి. ఈ పరిశ్రమల ద్వారా దండిగా సొమ్ము వస్తున్న క్రమంలోనే ఈ గ్రామాల్లో పని చేస్తున్న పంచాయతీరాజ్ ఉద్యోగులు విలీన వివాదం పరిష్కారం కాకుండా మోకాలడ్డుతున్నారనే విమర్శలున్నాయి. బదిలీల్లో సైతం వారు విలీన గ్రామాలు దాటి బయటకు వెళ్లకపోవడానికి కూడా ఇదే కారణమని అంటున్నారు.
పరిష్కారమెప్పుడో!
ఇటువంటి పరిస్థితుల్లో పులి మీద పుట్రలా కేంద్రం ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ పేరిట జమిలి ఎన్నికల నిర్వహిస్తామని చెబుతోంది. అదే జరిగితే వచ్చే మూడున్నరేళ్లూ నగర పాలక సంస్థకు ఎన్నికలు జరిగే అవకాశం ఉండకపోవచ్చని పరిశీలకులు అంటున్నారు. విలీన వివాదాన్ని పరిష్కరించి, ఎన్నికలు నిర్వహించాలని, ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలనే డిమాండుతో నగర పౌర సంక్షేమ సంఘం అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు ఇటీవల నిరవధిక దీక్ష చేపట్టారు. దీనిపై జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి స్పందించి ప్రభుత్వానికి నివేదించి సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఈ వివాదం ఎప్పటికి పరిష్కారమవుతుందో వేచి చూడాల్సిందే.
ప్రస్తుతం నగరంలో 4.50 లక్షలు, విలీన గ్రామాల్లో 1.50 లక్షల మేర జనాభా ఉంది. ఈ లెక్కల ఆధారంగా 2025–26లో ఆర్థిక సంఘం నిధులు రూ.50 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఇవి రావాలంటే ఎన్నికలు జరగాలి. అది జరగాలంటే విలీన ప్రక్రియ పూర్తి చేయాలి. గ్రామాల విలీనంతోనే డివిజన్ల విభజన చేయాలని మున్సిపల్ చట్టం చెబుతోంది. చంద్రబాబు సర్కార్‌లో విలీన వివాదానికి బీజం పడటంతో ఇప్పుడు అదే ప్రభుత్వం అధికారంలో ఉండటంతో పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
గ్రామాల ప్రగతికి విలీన సమస్యే అడ్డంకి
కాకినాడను ఆనుకుని ఉన్న గ్రామాల అభివృద్ధికి తొలిసారి రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే నా వంతు ప్రయత్నం చేశాను. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట, వాకలపూడి, వలసపాకల, ఇంద్రపాలెం, చీడిగ, తూరంగి గ్రామాలు, స్వామినగర్, ఎస్.అచ్యుతాపురాలను కార్పొరేషన్‌లో విలీనం చేయాలని అప్పట్లోనే ప్రతిపాదించాం. ఈ ప్రక్రియ దాదాపు పూర్తై తూరంగిలో నాలుగు నెలల పాటు కార్పొరేషన్ ఆధీనంలోనే పరిపాలన సాగింది. కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ ప్రభావం గ్రామాల అభివృద్ధిపై పడుతోంది. అటు కార్పొరేషన్ నిధులు రాక, ఇటు పంచాయతీలకు ఎన్నికలు లేక ఆర్థిక సంఘ నిధులు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
– కురసాల కన్నబాబు, మాజీ మంత్రి,
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, కాకినాడ
ప్రక్రియ పూర్తి చేయాలి
గ్రామాల విలీన ప్రక్రియ పూర్తి చేయాలి. చంద్రబాబు హయాంలోనే తలపెట్టిన ఈ ప్రక్రియ అప్పుడే వివాదంతో మూలన పడింది. దీనిని నాడు చిత్తశుద్ధితో పూర్తి చేసి ఉంటే ఈ సమస్య ఇన్నేళ్లు ఉండేది కాదు. తక్షణం న్యాయపరంగా ఎదుర్కొంటున్న ప్రతిబంధకాలను తొలగించాలి. కార్పొరేషన్ ఎన్నికలు జరిపించాలి. విలీన వివాదంతో గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయింది. 2025–26 ఆర్థిక సంఘం నిధులు వచ్చే ఏర్పాటు చేయించాలి.
– దూసర్లపూడి రమణరాజు,
పౌర సంక్షేమ సంఘం, కాకినాడ
గ్రామ పంచాయతీలోనే
అభివృద్ధి
చాలా చోట్ల మున్సిపాలిటీల కంటే గ్రామ పంచాయతీలే బాగున్నాయి. విలీనం వల్ల అభివృద్ధి జరుగుతుందనుకోవడం సరి కాదు. మంచి పరిపాలన కావాలి. గ్రామ పంచాయతీల్లో కూడా బహుముఖ ప్రగతిలో ఉన్నవి చాలా ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు నిధులు సమకూరిస్తే వాటంతట అవే ప్రగతి సాధిస్తాయి. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. పంచాయతీల్లో ఆదర్శ గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి.
– నిమ్మకాయల వెంకటేశ్వరరావు,
విశ్రాంత ఉపాధ్యాయుడు, రమణయ్యపేట
విలీనంతోనే ప్రగతి
తూరంగి ప్రాంతాన్ని కార్పొరేషన్‌లో విలీనం చేస్తేనే అభివృద్ధి జరుగుతుంది. గ్రామంలో ఎక్కువగా మురికివాడలు ఉన్నాయి. ఇవి అభివృద్ధి సాధించాలంటే గ్రామాలకు వచ్చే నిధులు ఎంత మాత్రం సరిపోవు. అందునా ప్రణాళికాబద్ధమైన ప్రగతి కావాలంటే కార్పొరేషన్ నిధుల విడుదల ద్వారానే సాధ్యమవుతుంది. విలీనం చేయకుండా ఎన్నికలు నిర్వహిస్తే కోర్టుకు వెళ్తాం.
– దాట్ల వీర వెంకట
సత్యనారాయణరాజు,
తూరంగి, కాకినాడ రూరల్
Comments
Please login to add a commentAdd a comment