స్వల్పంగా తగ్గిన ‘ఏలేరు’
ఏలేశ్వరం: కొద్ది రోజులుగా వర్షాలు లేకపోవడంతో ఏలేరు జలాశయంలో నీటినిల్వలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. పరీవాహక ప్రాంతం నుంచి జలాశయంలోకి 800 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా శుక్రవారం 85.25 మీటర్లుగా నమోదైంది. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా, 21.47 టీఎంసీల మేర నీటి నిల్వలున్నాయి. ఆయకట్టుకు 600, విశాఖకు 200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. పంపా రిజర్వాయర్‌కు, తిమ్మరాజు చెరువుకు నీటి విడుదలను నిలిపివేశారు.
జెడ్పీ ‘స్థాయీ’ సమావేశాలకు
‘కోడ్’ అడ్డంకి
కాకినాడ సిటీ: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజాపరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు ఎటువంటి తీర్మానాలు, సమీక్షలు చేయకుండానే ముగిశాయి. జెడ్పీ 1 నుంచి 7 వరకూ స్థాయీ సంఘ సమావేశాలను జెడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించారు. 1, 2, 4, 7 స్థాయీ సంఘాలకు జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, 3వ స్థాయీ సంఘం సమావేశానికి వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, 5వ స్థాయీ సంఘ సమావేశానికి జెడ్పీటీసీ సభ్యురాలు రొంగల పద్మావతి, 6వ స్థాయీ సంఘ సమావేశానికి జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ మేరుగు పద్మలత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ విప్పర్తి మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ సమావేశాలను కేవలం పంచాయతీరాజ్ చట్ట పరిధిలో మాత్రమే నిర్వహించామని తెలిపారు. తదుపరి సమావేశంలో అన్ని అంశాలనూ కూలంకషంగా చర్చిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వీవీఎస్ లక్ష్మణరావు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో
జైలు, జరిమానా
కాకినాడ లీగల్: మద్యం తాగి వాహనాలు నడిపిన కేసుల్లో నిందితులకు జైలు, జరిమానా విఽధిస్తూ కాకినాడ మూడో స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ వి.నరసింహారావు తీర్పు చెప్పారు. కాకినాడ ట్రాఫిక్–1, 2 పోలీసు స్టేష న్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపర్చగా, ఇద్దరికి మూడు రోజుల చొప్పున, ఆరుగురికి రెండు రోజుల చొప్పున జైలు, 14 మందికి రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
సత్యదేవుని దర్శించిన
పాట్నా హైకోర్టు న్యాయమూర్తి
అన్నవరం: పాట్నా (బిహార్) హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.అనుపమ చక్రవర్తి శుక్రవారం కుటుంబ సభ్యులతో కలసి అన్నవరం సత్యదేవుని దర్శించుకున్నారు. రత్నగిరిపై స్వామివారికి పూజ లు చేశారు. వారికి పండితులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం వేదాశీస్సులు అందజేశారు. స్వామివారి ప్రసాదాలు, చిత్రపటాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ అందజేశారు.
ఉపాధ్యాయుడిపై వేటు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): తూరంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు మహ్మద్ తానీషా వలీబాబాపై వేటు పడింది. ఆయనను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వలీబాబాపై ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో అభియోగాలు రుజువు కావడంతో ఆయనను విధుల నుంచి తొలగించామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment