సత్యదేవుని తెప్పోత్సవానికి ఏర్పాట్లు
అన్నవరం: కార్తిక శుద్ధ ద్వాదశి సందర్భంగా పంపా జలాశయంలో ఈ నెల 13వ తేదీ రాత్రి నిర్వహించే సత్యదేవుని తెప్పోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. హంస వాహనంపై సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ అమ్మవారు పంపా జలాశయంలో మూడుసార్లు విహరించనున్నారు. తెప్పోత్సవంలో ఉపయోగించే పంటుకు ధవళేశ్వరం నుంచి వచ్చిన జలవనరుల శాఖ సిబ్బంది మరమ్మతులు పూర్తి చేసి నదిలోకి దింపిన విషయం తెలిసిందే. కాగా కాకినాడ పోర్టు నుంచి వచ్చిన సిబ్బంది ఈ పంటుకు ఇంజిన్ బిగించి, పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. పంపాలో పంటు ట్రయల్ రన్ శుక్రవారం నిర్వహించారు. ఇది విజయవంతం కావడంతో దేవస్థానం అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. దేవస్థానం ఈఈ రామకృష్ణ, ఎలక్ట్రికల్ డీఈ సత్యనారాయణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. దేవస్థానం ఈఓ కె.రామచంద్ర మోహన్, పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో మరోసారి ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. కాగా ఈ పంటును శనివారం నుంచి హంస వాహనంగా అలంకరించనున్నారు. ముందు భాగంలో హంస తలభాగం, మధ్యలో ఇరువైపులా రెక్కలు, చివరన తోక అమర్చి, వాటిని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. దీనికి నాలుగు రోజులు పడుతుందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment