రత్నగిరిపై భక్తుల రద్దీ
అన్నవరం: వేలాదిగా తరలివచ్చిన భక్తులతో రత్నగిరి శుక్రవారం కిటకిటలాడింది. సత్యదేవుని ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, విశ్రాంతి మండపాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. దీంతో స్వామివారి వ్రత మండపాలతో పాటు నిత్య కల్యాణ మండపంలో సైతం వ్రతాలు నిర్వహించారు. స్వామివారి ఉచిత దర్శనానికి రెండు గంటలు, రూ.200 టికెట్టు దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామివారిని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. తూర్పు రాజగోపురం ముందు రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారి వ్రతాలు 2,100 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన పథకం వద్ద భక్తులకు పులిహోర, దద్దోజనం పంపిణీ చేశారు. శనివారం నుంచి బుధవారం వరకూ పర్వదినాలు కావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెల్లవారుజామున ఒంటి గంట నుంచి సత్యదేవుని వ్రతాలు, దర్శనాలకు భక్తులను అనుమతించేందుకు ఏర్పాట్లు చేశారు. శనివారం సుమారు 60 వేల మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. వ్రతాలు 4 వేలకు పైగా జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment