కాకినాడ రూరల్: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మ పురస్కారాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సెట్రాజ్ సీఈఓ షేక్ ఇమ్రాన్ తెలిపారు. , ఆసక్తి గల వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యరంగం, సామాజిక సేవ, సైన్స్, ఇంజినీరింగ్, ప్రజా వ్యవహారాలు, పౌర సేవలు, వృత్తి, పరిశ్రమలు వంటి రంగాలలో అత్యున్నతమైన ప్రతిభ కనబరిచిన వ్యక్తులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో ఆసక్తి గల అభ్యర్థులు రాష్ట్రీయ పురస్కార్ పోస్టర్ http://awardr.gov.in వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకుని, దరఖాస్తు, రెండు సెట్ల పత్రాలను జూలై 10లోగా కాకినాడ రమణయ్యపేటలోని సెట్రాజ్ కార్యాలయంలో అందజేయాలన్నారు. వివరాలకు సెల్ నంబర్లు 98499 13065, 98483 53260ను సంప్రదించాలన్నారు.
పాఠశాల బస్సులకు
ఫిట్‌నెస్ అవసరం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పాఠశాలలు తిరిగి పూర్తి స్థాయిలో ప్రారంభమైన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ కలిగి అనుమతి పొందిన వాహనాలకు మాత్రమే తిరగడానికి అనుమతి ఉందని కాకినాడ ఆర్‌టీఓ సాయి ప్రసాద్ సూచించారు. తన కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కాకినాడ, పెద్దాపురం, కత్తిపూడి పరిధిలో 1301 విద్యాసంస్థల బస్సులు ఉండగా 1050 బస్సులకు ఫిట్‌నెస్ జారీ చేశామని, 251 విద్యాసంస్థల బస్సులు ఫిట్‌నెస్ సరిగాలేవని గుర్తించి నిరాకరించామని, వీటిలో 38 బస్సులకు జీవితకాలం పూర్తయిందన్నారు. మిగిలిన బస్సులకు నిబంధనల ప్రకారం తగిన మరమ్మతులు నిర్వహిస్తే అనుమతి ఇస్తామని, విద్యాసంస్థల బస్సులకు ప్రమాణాలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు.
ఫుట్‌బాల్
అసోసియేషన్‌లో నమోదు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడసిటీ): ఆంఽధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని లైసెన్స్ కలిగిన రిఫరీలు, కోచ్‌లు, అన్ని వయస్సుల విభాగాల ఫుట్‌బాల్ ప్లేయర్లు, రిఫరీలు, కోచ్‌లు కావాలనుకునే వారు విధిగా తమ పేర్లు ఏపీఎఫ్‌ఏలో నమోదు చేసుకోవాలి. జిల్లా ఫుట్‌బాల్ సంఘ కార్యదర్శి కె.రాజేష్ మంగళవారం ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా జోనల్, రాష్ట్రస్థాయిలో జరిగే పోటీలలో పాల్గొనేవారు రిజిస్ట్రేషన్ చేయించుకోని పక్షంలో జిల్లా సంఘం తరఫున పరిగణించరన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకునే వారు 8328643876 నెంబరులో సంప్రదించాలని సంఘ అధ్యక్షుడు రేపాటి సంతోష్ కుమార్ కోరారు. జూలై, ఆగస్టులలో అండర్–14, 17 జిల్లాస్థాయి పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
జర్మనీలో నర్సింగ్ కోర్సులకు
దరఖాస్తుల ఆహ్వానం
కాకినాడ సిటీ: బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి రెండేళ్ల అనుభవం ఉన్న వారికి జర్మనీలో ఉపాధి అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ జిల్లా అధికారి డి.హరిశేషు మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థి జర్మనీలో పని చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. గుంటూరులోని కేఎల్ యూనివర్సిటీలో రెండు నెలల వ్యవధిలో జర్మన్ భాష నేర్పించి అనంతరం టెస్ట్‌లో బి–1 ఆఫర్ లెటర్‌తో ఉపాధి కల్పిస్తారన్నారు. జర్మన్ భాష కోసం నిర్బంధ ఉచిత ఆన్‌లైన్ తరగతులకు హాజరుకావాలన్నారు. అభ్యర్థి తప్పనిసరిగా నర్సింగ్ గ్రాడ్యుయేట్ బీఎస్సీ నర్సింగ్ అయి ఉండాలన్నారు. కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండి, 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలని, అవసరమైన పత్రాలు, రెజ్యూమ్, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు, చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్టు, అనుభవ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలన్నారు. విమాన చార్జీలు, ఆహారం, వసతి మొదటి 6 నెలలు ఉచితం అన్నారు. ప్రారంభంలో స్థూల జీతం నెలకు 1000 యూరోలు (రూ.89వేలు) తర్వాత 6 నెలల పాటు జర్మనీలో బి2 సర్టిఫికెట్ కోసం శిక్షణ ఇస్తారన్నారు. బి2 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత జీతం సుమారుగా 2500 యూరోలకు పెరుగుతుందన్నారు. కేఎల్ విశ్వ విద్యాలయంలో జులై ఒకటో తేదీన ప్రారంభమవుతాయన్నారు. వారానికి 48 గంటలు, రోజుకు 6 గంటల చొప్పున 2 నెలల పాటు శిక్షణ ఉంటుందన్నారు. అభ్యర్థులు డే స్కాలర్లుగా లేదా శిక్షణ కాలంలో హాస్టల్‌లో ఉండడానికి ఎంచుకోవచ్చని హరిశేషు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment