విజయాల విద్యాలయం | Sakshi
Sakshi News home page

విజయాల విద్యాలయం

Published Tue, May 7 2024 11:35 AM

విజయా

ఐదేళ్లలో జేఎన్‌టీయూకేలో గణనీయమైన అభివృద్ధి

న్యాక్‌ ఎ+ హోదాతో మరింత ఖ్యాతి

రూ.వందల కోట్లతో భవనాలు, రోడ్ల నిర్మాణం

భారీ ప్యాకేజీలతో పలువురికి కొలువులు

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): వాణిజ్య, వ్యాపార పరంగా అభివృద్ధి చెందడంతో పాటు అన్ని వనరులూ ఉన్నందున కాకినాడ నగరంలో విద్యారంగాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని నాటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి తపించారు. నాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కాకినాడ నగరం నడి మధ్యన 1946లో దాదాపు 100 ఎకరాలకు పైబడిన విస్తీర్ణంలో జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి (జేఎన్‌టీయూ) అనుబంధంగా ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం 1972లో జేఎన్‌టీయూ హైదరాబాద్‌ యూనివర్సిటీ ఏర్పడింది. దానికి కాకినాడ, అనంతపురం, హైదరాబాద్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలు అనుబంధంగా ఉండేవి. 2004లో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2008 ఆగస్టు 20న కాకినాడ ఇంజినీరింగ్‌ కళాశాలను జేఎన్‌టీయూ–కాకినాడగా (జేఎన్‌టీయూకే) ఏర్పాటు చేశారు. దీని పరిధిలోకి నాటి ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 264 ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలను చేర్చారు. వీటితో పాటు విజయనగరం, నరసరావుపేట, కాకినాడల్లోని ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలను ఈ వర్సిటీకి అనుసంధానం చేశారు. ప్రస్తుతం ఈ వర్సిటీ పరిధిలోని ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు 2021 నుంచి విజయనగరం యూనివర్సిటీ పరిధిలోకి మారిపోయాయి.

విదేశీ వర్సిటీలతో ఒప్పందాలు

గడచిన ఐదేళ్లుగా విద్య, వసతుల పరంగా జేఎన్‌టీయూకే ఎన్నో మెట్లు అధిరోహించింది. నేషనల్‌ అసెస్‌మెంట్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) గత ఏడాది మే నెలలో 3.4 స్కోర్‌తో ఎ+ హోదా కల్పించింది. తద్వారా రాష్ట్రంలో ఎ+ హోదా సాధించిన తొలి సాంకేతిక వర్సిటీగా జేఎన్‌టీయూకే గుర్తింపు పొందింది. ఫలితంగా విదేశీ వర్సిటీలతో వివిధ కోర్సులు ఉపాధి కల్పన, పరిశోధన ఒప్పందాలకు మార్గం సుగమమైంది. అంతర్జాతీయ యూనివర్సిటీల జాబితాలో జేఎన్‌టీయూకేకి స్థానం లభించింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల విడుదలకు మార్గం ఏర్పడింది. స్విట్జర్లాండ్‌, స్వీడన్‌ వర్సిటీలు ఇప్పటికే పలు ఒప్పందాలకు ముందుకు వచ్చాయి.

క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో సత్తా

జేఎన్‌టీయూకే విద్యార్థులు మంచి ప్యాకేజీలతో అనేక బహుళజాతి సంస్థల్లో కొలువులు దక్కించుకున్నారు. కళాశాల 75 ఏళ్ల చరిత్రలో అత్యధిక వేతనం పొందిన విద్యార్థులుగా నిలిచారు. గత ఏడాది నవంబర్‌లో నిర్వహించిన ఇంటర్వ్యూల్లో నలుగురు విద్యార్థులు అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించారు. సీఎస్‌ఈ విద్యార్థిని మన్యం శ్రీదేవి, ఈసీఈ విద్యార్థి బోడపాటి నివాస్‌ ఏడాదికి రూ.35 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు పొందారు. అలాగే, సీఎస్‌ఈ విద్యార్థులు మార్ని యశ్వంత్‌, అల్లాడి సంధ్యలు ఏడాదికి రూ.16.30 లక్షల ప్యాకేజీలతో కొలువులు సాధించారు. గడచిన ఐదేళ్లలో ఏకంగా 2,400 మంది విద్యార్థులు రూ.3.50 లక్షల ప్రారంభ వార్షిక వేతనంతో ఉద్యోగాలు పొందారు. వీరిలో అధిక శాతం మంది జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా లబ్ధి పొందిన వారు ఉండటం విశేషం.

గేట్‌లో ప్రతిభ

జేఎన్‌టీయూకే విద్యార్థులు గడచిన ఐదేళ్ల కాలంలో గేట్‌లో ప్రతిభ చూపి, మంచి ర్యాంకులు సాధించారు. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్షకు జేఎన్‌టీయూకే ద్వారా ఏటా 60 నుంచి 80 మంది వరకూ మంచి ర్యాంకులు సాధించారు. ఈ ఏడాది అత్యధికంగా 110 మంది విద్యార్థులు మంది అర్హత సాధించడం విశేషం.

ఐఎఫ్‌టీ ఏర్పాటు

కేంద్ర విద్యా సంస్థ ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (ఐఎఫ్‌టీ) కోర్సును 2022లో జేఎన్‌టీయూకేలో ప్రారంభించారు. వాస్తవానికి దీనిని 2017లోనే జేఎన్‌టీయూకేకు మంజూరు చేసినా గత ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అది సాకారమైంది. రెండేళ్ల క్రితం తరగతులు ప్రారంభమయ్యాయి.

ఫ్యూచర్‌ స్కిల్‌ ఎక్స్‌పర్ట్‌ ప్రోగ్రాం

ప్రభుత్వ పాఠశాలల్లో బోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఫ్యూచర్‌ స్కిల్‌ ఎక్స్‌పర్ట్‌ పోగ్రాం సీఎస్‌ఈ, ఈసీఈ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఎంతో ఉపయోగపడింది. దీనిని ఇంటర్న్‌షిప్‌గా పరిగణించి ప్రతి నెలా రూ.12 వేల చొప్పున చెల్లించారు. కాకినాడ జిల్లాలో 65, కోనసీమలో 75, తూర్పు గోదావరి జిల్లాలో 67 మంది విద్యార్థులను ఫ్యూచర్‌ స్కిల్‌ ఎక్స్‌పర్ట్‌లుగా నియమించారు.

రూ.వందల కోట్లతో మౌలిక సదుపాయాలు

వర్సిటీ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మౌలిక సదుపాయాలను ఈ ఐదేళ్ల కాలంలో సమకూర్చారు. పీజీ హాస్టల్‌ భవనం నిర్మాణం, రోడ్లు, సీసీ రోడ్లు, స్నాతకోత్సవ భవనంతో పాటు సెంట్రలైజ్డ్‌ కంప్యూటర్‌ సిస్టమ్‌ వంటి మౌలిక సదుపాయాలు కల్పించారు. ఇవే కాకుండా గ్రీనరీ కోసం సీఎస్‌ఆర్‌ ఫండ్‌లో భాగంగా సునీల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ రూ.5 కోట్లు అందించేలా ఉప కులపతి డాక్టర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు కృషి చేశారు.

రూ.35 లక్షల వార్షిక వేతనంతో..

సామర్లకోట పట్టణానికి చెందిన మన్యం శ్రీదేవి సీఎస్‌ఈ నాలుగో సంవత్సరం ఈ ఏడాది పూర్తయింది. బీటెక్‌ పూర్తవ్వగానే ఈ విద్యార్థి ని ఏకంగా రూ.35 లక్షల ప్యాకేజీతో కామ్‌వాల్ట్‌ సంస్థలో ఉద్యోగం సాధించింది. తండ్రి శ్రీనివాసరావు వ్యవసాయం చేస్తుండగా తల్లి ధనలక్ష్మి గృహిణి. తన చదువుకు జగనన్న విద్యా దీవెన పథకం ఎంతో దోహదపడిందని శ్రీదేవి చెప్పింది.

వర్సిటీలో నిర్మించిన సీసీ రోడ్లు

విజయాల విద్యాలయం
1/2

విజయాల విద్యాలయం

విజయాల విద్యాలయం
2/2

విజయాల విద్యాలయం

Advertisement
 
Advertisement