ఇది ముంచే ప్రభుత్వం!
కాకినాడ రూరల్: ఇది మంచి ప్రభుత్వం కాదు.. ముంచే ప్రభుత్వమని, నాలుగు నెలల పాలనలో అన్నింటా వైఫల్యం చెందిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ వైద్య నగర్ క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో నిత్యావసర సరకులు విపరీతంగా పెరిగిపోయాయని, ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు పస్తులుంటున్నారని, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ బెంగతో 4 వేల మంది కార్మికులు రోడ్డెక్కారని కన్నబాబు ధ్వజమెత్తారు. ఆ అంశాలను పక్కన పెట్టి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌తో పబ్బం గడుపుతోందని ఆయన దుయ్యబట్టారు. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగి కూటమి ప్రభుత్వం రాజకీయం చేస్తోందన్నారు. తిరుమల లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని సాక్షాత్తు సీఎం స్వయంగా దుష్ప్రచారానికి తెరతీసి దుమారం సృష్టించారని, దీంతో ప్రపంచ వ్యాప్తంగా హిందువులు, వేంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు చెబుతున్నది నిజమైతే ఈ ప్రభుత్వం ఏర్పడిన తరువాతే జూలైలో సంఘటన జరిగితే దానిని గత ప్రభుత్వానికి, పూర్వ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఆపాదించేందుకు రచ్చ చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్‌ను పక్కన పెట్టి సుప్రీం కోర్టు సీబీఐ డైరెక్టర్‌తో ఒక స్వతంత్ర విచారణ వ్యవస్థను నియమించడం వల్ల నిజాలు నిగ్గుతేలతాయని కురసాల పేర్కొన్నారు. అయినప్పటికీ టీడీపీ శ్రేణులు, చంద్రబాబు, వారితో కలిసి ప్రయాణిస్తున్న వారు దుష్ప్రచారాన్ని ఆపడం లేదన్నారు. దుర్మార్గమైన అబద్దాలు చెప్తూ జగన్‌మోహన్‌రెడ్డిని కించపరుస్తున్నాం, తగ్గిస్తున్నామనుకుంటూ పరోక్షంగా వేంకటేశ్వరుని ఖ్యాతిని తగ్గిస్తున్నారని గ్రహించలేకపోతున్నారన్నారు. ఒక పక్క ఎన్‌డీడీబీ నివేదికపై కూడా తాము ఇచ్చింది పూర్తిగా నమ్మడానికి లేదని వాళ్లే చెప్పారని, మధురై కోర్టు ఈ మధ్యనే తీర్పు కూడా చెప్పిందన్నారు. ఒకే శాంపిల్‌ను కిమ్స్ ల్యాబ్ చైన్నెలోను, మరో ల్యాబ్‌లోను టెస్ట్ చేయిస్తే రెండు వేర్వేరు నివేదికలు ఎలా వచ్చాయని, ఒక చోట కల్తీ జరిగిందని, మరో చోట కల్తీ జరగలేదని ఎలా వచ్చిందన్నారు. కేంద్ర క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ పరిశోధన ఫలితాలు ఎందుకు విడుదల చేయడం లేదన్నారు. సుప్రీంకోర్టు నియమించిన ఇద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఒకరు ఫుడ్ సేఫ్టీ అథారిటీ అధికారి కలిపి ఐదుగురు కమిటీగా ముందు వెళ్లాలని సుప్రీం చెప్పిందన్నారు. లడ్డూలో కల్తీ జరగలేదని టీటీడీ ఈఓ చెబుతున్నా మరొక దేవుడిని రాజకీయాల్లోకి లాగవద్దని, పొలిటికల్ డ్రామాలు వద్దని సుప్రీం చెప్పడంతో ఇకనైనా లడ్డూ రాజకీయాలు మానాలని, డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరదించాలని కోరారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు గాలికి వదిలేశారన్నారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేయాలని కన్నబాబు ప్రభుత్వానికి సూచించారు. అతివృష్టి, అనావృష్టితో రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని, రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయన్నారు. పుంగనూరులో ఏడేళ్ల ముస్లిం బాలికను హత్య చేసినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదన్నారు. మంచి ప్రభుత్వం అని మనకు మనం బాజాలు వాయించుకుంటే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. తిరుమల లడ్డూ దుష్ప్రచారాన్ని తిప్పుకొడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాడుతుందన్నారు. ఉల్లి రేటు రైతు బజారులో కిలో రూ.60 ఉంటే బహిరంగ మార్కెట్‌లో రూ.75 పలుకుతోందని, బియ్యం 25 కిలోల మూటపై రూ.150 నుంచి రూ.200 వరకు పెరిగిందన్నారు. వంట నూనెలు, ఇతర నిత్యావసర సరకుల ధరలు విపరీతంగా పెరిగిపోయినా వాటివైపు ఈ ప్రభుత్వం కనీసం చూడడం లేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో పెరిగిన ధరలు తగ్గించేందుకు ధరల స్థిరీకరణ నిధులు వినియోగించుకునే వాళ్లమని, వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుకలో దారుణాలు జరిగిపోతున్నట్టు చిత్రీకరించారని, ఇప్పుడు ఇసుక అందుబాటులో లేక భవన నిర్మాణ కార్మికులు వీధిన పడుతున్నారన్నారు. సోషల్ మీడియాలో ఇసుకకు సంబంధించి వైరల్ అవుతున్న ఒక బిల్లును చూస్తే అందులో రూ.9,276 రవాణా చార్టీలుగాను మొత్తం విలువ రూ.16,640 చూపారన్నారు. రవాణా కాకుండా మిగిలినది ఏమిటని ప్రశ్నించారు. మిగిలిన బాపతు ఎవరికి వెళుతోందన్నారు. ఈ జిల్లాకు భద్రాచలం నుంచి, విశాాఖకు ఒడిశా నుంచి ఇసుక వస్తుందని చెబుతున్నారన్నారు. లోడు ఇసుకకు రూ.10 వేలు నుంచి రూ.15 వేల భారం పడుతోందన్నారు. ఉచిత ఇసుక పేరు చెప్పి వినియోగదారులపై భారం వేస్తున్నారన్నారు. టీటీడీలో రివర్స్ టెండరింగ్ రద్దు చేసినట్టు శనివారం ఉదయం నుంచి ప్రచారం చేసుకుంటన్నారని, మొన్ననే కదా క్యాబినెట్ సమావేశంలో రివర్స్ టెండరింగ్ రద్దుపై తీర్మానం చేశారన్నారు. సెప్టెంబరులో రివర్స్ టెండరింగ్ లేకుండానే టీటీడీలో టెండర్లు ఆమోదించడం గమనార్హమన్నారు. తిరుమలలో గోవింద నామస్మరణ జరగాలని ముఖ్యమంత్రి అంటున్నా చంద్రబాబు నామస్మరణతో టీటీడీ అఫీషియల్ ఎక్స్‌లో పెట్టిన పోస్టింగులు చూపుతూ కన్నబాబు ధ్వజమెత్తారు. జగన్‌మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఎక్స్‌లో ప్రచారం చేస్తున్నారని, స్వామిపై భక్తి కన్నా ఏదో జరిగిపోయిందన్నట్టు చూపే ప్రయత్నం చేస్తున్నారని కురసాల వివరించారు.
నాలుగు నెలల పాలనలో అన్నింటా వైఫల్యం
అందనంత ఎత్తులో
నిత్యావసర సర కులు
ఇసుక కొరతతో కార్మికుల పస్తులు
డైవర్షన్ పాలిటిక్స్‌తో
పబ్బం గడుపుతున్న వైనం
జగన్‌ను తగ్గించేందుకు లడ్డూ డ్రామా
సిట్ ఏర్పాటుతో వాస్తవాల వెల్లడి
మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ
కాకినాడ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
Comments
Please login to add a commentAdd a comment