కార్తిక మాసోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
రత్నగిరి సిబ్బందితో ఈఓ సమీక్ష సమావేశం
అన్నవరం: హరి హరాదుల భేదం లేకుండా అందరూ పూజలు చేసే రత్నగిరిపై వెలసిన వీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయానికి కార్తిక శోభ సంతరించుకోనుంది. కార్తిక మాసంలో సత్యదేవుని ఆలయానికి లక్షలాదిగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో చేయాల్సిన ఏర్పాట్లపై ఈఓ కె.రామచంద్రమోహన్ శనివారం సమీక్షించారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులను ఆయన ఆదేశించారు. కార్తికమాసం ప్రారంభానికి ఇంకా 25 రోజుల సమయం ఉన్నందున విభాగాల వారీగా ప్రణాళికలు రూపొందించుకుని కార్యాచరణకు సంసిద్ధులై ఉండాలని ఆయన సూచించారు. ప్రధానంగా ఆలయ విభాగం, వ్రతాలు, వసతి గదుల కేటాయింపు, శానిటేషన్, సెక్యూరిటీ, ఇంజినీరింగ్ విభాగాల అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్తికమాసంలో శనివారం, ఆది, సోమవారాలు, దశమి, ఏకాదశి, పౌర్ణిమ, క్షీరాబ్ది ద్వాదశి, ఇతర పర్వదినాలలో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండే నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
27 నుంచి సత్యదీక్షలు
స్వామివారి జన్మనక్షత్రం ‘మఖ’ సందర్భంగా ఈ నెల 27వ తేదీ నుంచి నవంబర్ 23వ తేదీ వరకు సత్యదీక్షలు నిర్వహించనున్నందున ఆ మేరకు విస్తృత ప్రచారం చేయాలని ఈఓ ఆదేశించారు. గత ఏడాది లానే ఈ ఏడాది కూడా సత్యదీక్షల విజయవంతానికి చర్యలు తీసుకోవాలని ఈఓ ఆదేశించారు. సమావేశంలో వేదపండితులు గొల్లపల్లి ఘనపాఠీ, గంగాధరబట్ల గంగబాబు, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, కల్యాణ బ్రహ్మ, వ్రత పురోహిత సంఘం అధ్యక్షుడు చామర్తి కన్నబాబు, అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహనరావు, ఈఈ రామకృష్ణ, ఏఈఓలు కొండలరావు, జగ్గారావు, బ్రమరాంబ, ఎల్ శ్రీనివాసరావు, డీఈలు రాంబాబు, ఉదయ్, వివిద విభాగాల అధగికారులు పాల్గొన్నారు.
సత్యదేవుని దర్శించిన 40 వేల మంది భక్తులు
రత్నగిరి వాసుడు సత్యదేవుని ఆలయం శనివారం వేల సంఖ్యలో వచ్చిన భక్తులతో కిట కిటలాడింది. విద్యాసంస్థలకు దసరా సెలవులు కావడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, భక్తులు వచ్చి పూజలు చేసుకున్నారు. ఆలయ ప్రాంగణం, మంటపాలు భక్తులతో కిక్కిరిసాయి. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివాని దర్శించగా స్వామివారి వ్రతాలు రెండు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షలు ఆదాయం సమకూరింది. స్వామివారి నిత్యాన్నదానపఽథకంలో ఐదు వేల మంది భక్తులకు అన్న ప్రసాదం స్వీకరించారు. అనంతరంసత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి ప్రాకారసేవ శనివారం కన్నుల పండువగా జరిగింది. ఉదయం పది గంటలకు తిరుచ్చి వాహనంపై దేవేరులతో సత్యదేవుడి ఉత్సవ మూర్తులను ప్రతిష్ఠించి ప్రాకారసేవ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment