మత్స్యకారుల జీవనోపాధి భద్రతకు ప్రాధాన్యం
కలెక్టర్ షణ్మోహన్
కాకినాడ సిటీ: తీరప్రాంత నియంత్రణ 2019 నోటిఫికేషన్ ప్రకారం రూపొందించిన నూతన కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ ప్రణాళికలో జిల్లా తీరప్రాంత పరిరక్షణ, అభివృద్ధితో పాటు స్థానిక మత్స్యకారుల జీవనోపాధి భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించినట్టు కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశపు హాలులో ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ, చైన్నె నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్‌మెంట్, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా తీరంలోని గ్రామాల ప్రజలతో కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ ప్రణాళికపై ప్రజాభిప్రాయ సేకరణపై నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. కార్యక్రమంలో నూతన కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ ప్లాన్ ముసాయిదాను సభికులకు వివరించి వారి అభిప్రాయాలను కలెక్టర్ సేకరించారు. సీఆర్‌జెడ్ నోటిఫికేషన్–2011తో పోల్చితే 2019 నోటిఫికేషన్‌లో స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని మరింత వెసులుబాటు కల్పించారన్నారు. తీర గ్రామాల్లో నివశించే ప్రజలు మత్స్యకారుల జీవనోపాధికి సీఆర్‌జెడ్ నిబంధనల వల్ల ఎటువంటి అవరోధాలు ఉండబోవన్నారు. అలాగే సముద్రంలో కలిసే క్రీక్‌లలో కూడా రెగ్యులేషన్ జోన్ పరిధిని ఇరువైపులా 50 మీటర్లకు కుదించారన్నారు. మడ అడవులను ఆనుకుని ఉన్న ప్రాంతంలో బఫర్ జోన్ నియమాలను కూడా సవరించినట్టు తెలిపారు. ముసాయిదాపై సమావేశానికి హాజరైన ప్రజల అభిప్రాయాలను స్వీకరించి ఇంకా ఎవరైనా తమ అభిప్రాయాలను చెప్పాలనుకుంటే 12వ తేదీ వరకు లిఖితపూర్వకంగా తమకు సమర్పించవచ్చని కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ, విజయవాడ ఈఈ మీరా సుభాన్ షేక్, శాస్త్రవేత్తలు సౌందరరాజన్, మాణిక్ మహాపాత్ర, జిల్లా పీసీబీ ఈఈ ఎంబీఎస్ శంకరరావు స్క్రీన్ ప్రజెంటేషన్ ద్వారా కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌లోని అంశాలను వివరించారు. అనంతరం పలువురు గ్రామస్తులు ఉప్పాడ వద్ద కోతకు గురౌతున్న తీరం, తీరంలో ఏర్పాటవుతున్న పరిశ్రమల వల్ల ఎదురుకాబోయే సమస్యలను వివరించారు. ముసాయిదా ప్రణాళికపై వచ్చిన అభిప్రాయాలను ఏపీ సీజెడ్‌ఎంఏకు నివేదించనున్నట్లు కలెక్టర్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment