సమస్యల పరిష్కారానికి కృషిచేయండి
కాకినాడ సిటీ: ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదులపై జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన జేసీ రాహుల్‌మీనా, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడారు. గత 15 రోజులలో వచ్చిన దరఖాస్తులపై సమీక్షించి వాటి ప్రగతిని వివిధ శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో అందిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలన్నారు. జిల్లా స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు. ఈ కమిటీ సమావేశం ప్రతి శనివారం నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రతి ఫిర్యాదు గురించి సంబంధిత అధికారులకు పూర్తి అవగాహనతో సమావేశానికి హాజరుకావాలని కలెక్టర్ సూచించారు. 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జిల్లాలోని అన్ని పంచాయతీల్లో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు నిర్వహించనున్నామని, వీటిని విజయవంతం చేయాలని ఆయన వివరించారు. జిల్లాలో సీసీ డ్రైన్లు, సీసీ రోడ్లకు సంబంధించి ఇప్పటికే ప్రతిపాదించిన పనులకు ఆమోదించినట్టు ఆయన వివరించారు. ఆయా పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.
నీటి సంఘాల ఎన్నికలకు 14న నోటిఫికేషన్
నీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు ఈ నెల 14న ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుందని కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలో నీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్ అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. జిల్లాలో రెవెన్యూ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కారానికి కృషి చేయాలని ఆయన ఆదేశించారు. డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, జాతీయ రహదారులకు అవసరమైన భూమి గుర్తింపు పనులు వేగవంతం చేయాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment