అక్రమ కట్టడం తొలగింపులో ఉద్రిక్తత
తుని: ప్రభుత్వ స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాన్ని తొలగించేందుకు వెళ్లిన మున్సిపల్ అధికారులు, పోలీసులను బాధితులు ప్రతిఘటించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వీరవరపుపేట అంబేడ్కర్ కమ్యూనిటీ హాలు రోడ్డులో వై.రవణమ్మ అనధికారికంగా కట్టిన ఇంటిని తొలగించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు బుధవారం మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు, సీఐ చెన్న కేశవరావు వెళ్లారు. అయితే తమకు ఈ నెల 18వ తేదీ వరకు గడువు ఉందని రవణమ్మ తెలిపారు. పదేళ్లుగా కోర్టులో కేసు నడుస్తోందని, అన్ని అనుమతులు వచ్చాకే తొలగించేందుకు వెళ్లినట్టు కమిషనర్ వెంకట్రావు తెలిపారు. కోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు బందోబస్తు కావాలని కమిషనర్ కోరిన మేరకు వెళ్లినట్టు సీఐ చెన్న కేశవరావు చెప్పారు. దీంతో పోలీసులు, రవణమ్మ కుటుంబ సభ్యుల మధ్య వివాదం చోటు చేసుకుంది. కోర్టు నుంచి మీకు ఏవైనా ఆదేశాలు ఉంటే చూపించాలని అధికారులు అడిగారు. ఈ నెల 18 వరకు సమయం ఉన్నందున కూల్చివేతను తాత్కాలికంగా నిలిపివేయాలని రవణమ్మ అధికారులను కోరారు. పరిస్థితి అదుపు దాటడంతో అధికారులు వెనుదిరిగారు. ఇది ఇలా ఉండగా ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడానికి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలా అనుమతి ఇచ్చారని రవణమ్మ ప్రశ్నించారు. దీంతో అధికారులు తెల్లముఖం వేశారు. రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఇచ్చే అనాలోచిత ఆదేశాల వలన ఇటువంటి పరిస్థితులు నెలకొంటాయని, అధికారులు తూచా తప్పకుండా నిబంధనలు పాటించాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment