సరస్వతీదేవిగా బాలాత్రిపుర సుందరి అమ్మవారు
సామర్లకోట: శరన్నవరాత్రుల్లో భాగంగా బుధవారం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని పంచారామ క్షేత్రంలోని బాలాత్రిపుర సుందరి అమ్మవారు సరస్వతిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈఓ బళ్ల నీలకంఠం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి సాయంత్రం దర్బారు సేవ, ప్రసాద వితరణ నిర్వహించారు.
15న అరుణాచలానికి బస్సు
తుని: ప్రజల విజ్ఞప్తి మేరకు తుని నుంచి అరుణాచలానికి సూపర్ లగ్జరీ బస్సును ఈ నెల 15న నడుపుతున్నట్టు డిపో మేనేజరు కిరణ్‌కుమార్ బుధవారం తెలిపారు. ఉదయం 10 గంటలకు తుని డిపో నుంచి బయలుదేరి, విజయవాడ, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీపురం, అరుణాచలం, కంచి యాత్రను పూర్తి చేసుకుని తుని వస్తుందన్నారు. టికెట్ ధర రూ.3,500గా నిర్ణయించామన్నారు. వివరాలకు 73829 13216, 80743 80569 సెల్ నంబర్లకు సంప్రదించాలని కోరారు.
పద్మభూషణ్
పాణింగిపల్లి ‘తూర్పు’ వాసే
రాజమహేంద్రవరం రూరల్: న్యూఢిల్లీలో మంగళవారం కన్నుమూసిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) మాజీ డైరెక్టర్ డాక్టర్ పాణింగిపల్లి వేణుగోపాల్ (82) రాజమహేంద్రవరం వాసే. భారతదేశపు మొట్టమొదటి గుండె మార్పిడిని నిర్వహించి కార్డియాక్ సర్జరీకి మార్గదర్శకుడిగా నిలిచిన ఆయన రాజమహేంద్రవరంలో జన్మించారు. ఎంబీబీఎస్‌లో మొదటి గోల్డ్‌మెడల్‌ను దేశమొదటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ నుంచి, ఎంఎస్‌లో మొదటి గోల్డ్‌మెడల్ మొదటి ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ నుంచి అందుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కార్డియోథొరాసిక్ విభాగాన్ని ప్రారంభించారు. ఎయిమ్స్ డైరెక్టర్‌గా బాధ్యతలను నిర్వర్తించారు. 1994లో కొద్దిరోజుల్లో చనిపోతాడన్న దేవీరామ్ అనే వ్యక్తికి బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి హార్ట్‌ను తీసి దేశంలోనే మొట్టమొదటిసారిగా హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. ఆయనను 1998లో పద్మభూషణ్‌తో పాటు, డాక్టర్ బీసీ రాయ్ అవార్డు, ఆల్‌ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లైఫ్‌టైమ్ అవార్డుతో పాటు అనేక అవార్డులు వరించాయి.
Comments
Please login to add a commentAdd a comment