కార్తికం.. భక్తోత్సవ సంరంభం..
దేవదాయశాఖ అధికారులు జారీచేసిన ప్రత్యేక సూచనలివే
1. అన్ని శైవక్షేత్రాల్లో ఆయా దేవాలయ ఆచారాలు, ఆగమాల ప్రకారం అలంకణలు ఉండాలి. ప్రత్యేక పర్వదినాల్లో విశిష్ట అలంకారాలను సాంప్రదాయం ప్రకారం చేయాలి.
2. పంచారామాలు, ముఖ్యమైన శివాలయాల్లో ప్రాతఃకాల దర్శనం, అభిషేకాలు తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రారంభించాలి.
3. కార్తికమాసంలో దీపారాధన ప్రత్యేక ఫలాన్ని అందిస్తుంది. సూర్యాస్తమయం, సూర్యదోయం ఆలయాల్లో దీపాలను ఉంచాలి. ఆకాశదీపాలు వెలిగించాలి.
4. కార్తీక మాసంలో పర్వదినాలు, వాటి విశిష్టతలు భక్తులకు తెలిసేలా ఏర్పాట్లు చేయాలి.
5. పర్వదినాలు, సోమవారాల్లో క్యూలైన్ త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలి.
6. దేవాలయాల్లో విద్యుత్ విభాగం పటిష్ట తనిఖీచేసి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలి.
7. ఉచిత దర్శనం, ఉచిత ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలి
8. వీఐపీ దర్శనాలకు ప్రత్యేక సమయాలు కేటాయించాలి.
9. ఆలయాలు పరిశుభ్రంగా ఉండేలా స్వీపర్లను ఏర్పాటు చేసుకోవాలి. చెత్తబుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచి బ్లీచింగ్ చల్లి, ఫినాయిల్ పిచికారీ చేయాలి.
10. ఆలయాలకు ప్రతీరోజు మామిడి తోరణాలు అలకరించాలి.
11. వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లలకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేసి స్వామి వారి దర్శనం సులువుగా అయ్యేలా చూడాలి తీసుకోవాలి.
12. అభిషేకం సమయాల్లో అంతరాలయం లోనికి ఒకేసారి ఎక్కువ మంది అర్చకులను అనుమతించడం వల్ల దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆటంకం కలుగుతుంది. ఆ సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి.
13. అభిషేక జలం వృథాపోకుండా అర్చకులు శ్రద్ధ వహించాలి.
14. అవసరం మేరకు అదనపు సిబ్బందిని డిప్యూటేషన్‌పై తీసుకోవాలి.
15. భక్తులతో సిబ్బంది మర్యాద పూర్వకంగా ప్రవర్తించాలి.
16. కార్తీక దీపం ఉంచే సమయంలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి
17. సాంస్కృతిక కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి.
18. ఆలయంలో సమాచార కేంద్రం ఏర్పాటు చేసుకోవాలి.
19. దర్శనానికి వచ్చే భక్తులు అనారోగ్యానికి గురైతే వారికి చికిత్స అందించేందుకు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలి.
● అన్నవరంలో ఆకాశదీపం వెలిగించిన
అర్చకులు
● తెప్పోత్సవం, గిరిప్రదక్షిణలకు విస్తృత ఏర్పాట్లు
అన్నవరం: హరిహరాదులకు ప్రీతికరమైన కార్తికమాసం ప్రారంభమైంది. శుక్రవారం రాత్రి అర్చకస్వాములు ఈ మేరకు ధ్వజస్తంభం వద్ద శ్రీఆకాశ దీపంశ్రీ ఏర్పాటు చేశారు.
పర్వదినాలలో అర్ధరాత్రి ఒంటిగంట నుంచే..
కార్తికమాసంలో శని, ఆది, సోమ వారాలతో పాటు, దశమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి తదితర 16 పర్వదినాల్లో స్వామివారి దర్శనానికి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున తెల్లవారుజాము ఒంటి గంట నుంచే స్వామివారి వ్రతాలు, రెండు గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. ఈ మేరకు ముందు రోజే వ్రతాలకు టిక్కెట్లు ఇచ్చేలా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. పర్వదినాల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పశ్చిమ రాజగోపురం వద్ద రోప్ పార్టీని ఏర్పాటు చేశారు.
కాగా క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా 13వ తేదీన తెప్పోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని 15వ తేదీన గిరి ప్రదక్షిణకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెలంతా చిన్నకార్లు, ఆటోలు మినహా మరే ఇతర వాహనాలను కొండ మీదకు అనుమతించడం లేదు. పెద్ద వాహనాలను కళాశాల మైదానంలో నిలిపి, బస్‌లు, ఆటోల ద్వారా కొండమీదకు రావల్సి ఉంటుంది. రత్నగిరిపై రెండు వేల మంది సేద తీరేలా రత్నగిరి డార్మెట్రీ, విష్ణుసదన్‌లోని 36 హాళ్లు ఏర్పాటు చేశారు.
రత్నగిరిపై ఏర్పాట్ల పరిశీలన
కాగా, దేవస్థానంలో ఏర్పాట్లను ఈఓ కె.రామచంద్రమోహన్ శుక్రవారం పరిశీలించి అసిస్టెంట్ కమిషనర్ రామ్మొహన్‌రావు, ఈఈ వి.రామకృష్ణ, డీఈలు రాంబాబు, సత్యనారాయణలకు పలు సూచనలిచ్చారు.
రూ.3 కోట్లతో విస్తృత ఏర్పాట్లు :
ఈఓ రామచంద్ర మోహన్
కార్తికమాసంలో వచ్చే లక్షలాది మంది భక్తుల కోసం దాదాపు రూ.మూడు కోట్లతో వివిధ నిర్మాణాలు చేపట్టాం. రూ.80 లక్షలతో రెండు ఘాట్‌రోడ్లపై గోతులు పూడ్చి బీడీరోడ్డు నిర్మించాం. రూ.55 లక్షలతో స్టెయిన్‌లెస్ స్టీల్ క్యూ లైన్లు, రూ.12.05 లక్షలతో వాటర్ ప్రూఫ్ షామియానాలు తదితర ఏర్పాట్లు చేశాం.
శైవ క్షేత్రాల్లో భారీ ఏర్పాట్లు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): పరమశివునికి ప్రీతిపాత్రమైన కార్తికమాసంలో శైవక్షేత్రాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. కాకినాడ జిల్లాలోని అన్ని క్షేత్రాల్లో ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీ క్యూలైన్లతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పంచారామక్షేత్రం సామర్లకోట చాణుక్య కుమారరామ భీమేశ్వర ఆలయానికి వేలాది సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ నేపథ్యంలో ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా దేవదాయశాఖతో పాటు, స్థానిక స్వచ్ఛంద సంస్థల సహకారంతో భారీ ఏర్పాట్లు చేశారు. దక్షిణకాశీగా పేరొందిన పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి దేవస్థానంలోను భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో పాటు జిల్లా కేంద్రం కాకినాడలో పలు ఆలయాల్లో కార్తికమాసం కోసం భారీ ఏర్పాట్లు చేశారు. దేవాయంవీధిలోని బాలాత్రిపుర సుందరి సమేత రామలింగేశ్వరస్వామి దేవస్థానం, గాంధీనగర్‌లోని అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామి ఆలయం, భానుగుడి భానులింగేశ్వరస్వామి ఆలయంతో పాటు పలు ఆలయాల్లో ఏర్పాట్లు చేశారు.
కార్తికానికి ప్రత్యేక ఏర్పాట్లు
కార్తికమాసం సందర్భంగా జిల్లాలోని అన్ని శైవ క్షేత్రాల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. ప్రముఖ ఆలయాల్లోని ఏర్పాట్లను ఇప్పటికే స్వయంగా వెళ్లి పరిశీలించాం.
– డీఎల్‌వీ రమేష్‌బాబు, దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment