ఆదుకోమంటే పోలీసులతో బెదిరిస్తారా?
● అధికారులపై పట్టు రైతుల ఆగ్రహం
● చేబ్రోలు పట్టు పరిశ్రమకు తాళాలువేసి
వంటావార్పుతో నిరసన
పిఠాపురం: నకిలీ గుడ్లతో నష్టపోయాం, న్యాయం చేయండని నెల రోజులుగా తిరుగుతుంటే పట్టించుకోవాల్సింది పోయి పోలీసులను తీసుకువచ్చి మాపై కేసులు పెట్టాలని చూస్తారా, మేమేమన్నా దొంగలమా అంటు పట్టు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో శుక్రవారం నకిలీ గుడ్లతో నష్టపోయిన పట్టు రైతులు నెల రోజులుగా ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టు తిరుగుతున్నారు. ఎవరూ పట్టించుకోపోవడంతో ఆందోళన చేసేందుకు శుక్రవారం చేబ్రోలు పట్టుపరిశ్రమ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ సైతం ఎవరూ స్పందించకపోవడంతో ఆ కేంద్రానికి తాళాలు వేసి రిలే నిరాహార దీక్షలకు దిగి వంటా వార్పు చేపట్టారు. పట్టు పరిశ్రమ జిల్లా అధికారి గీతా రాణి స్పందించి తక్షణం రాయితీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశం పెట్టి తమను ఆదుకుంటామని హామీ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోడం లేదని, తమను ప్రభుత్వ ఆదుకోకపోతే క్రాప్ హాలిడే ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
డీడీ గీతారాణి తీరుకు నిరసన
ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన డీడీ గీతారాణి వారితో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా నేరుగా పోలీసులను తీసుకురావడంతో ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం మేమేమన్నా దొంగలమా అని ప్రశ్నించారు. 40 ఏళ్లుగా ఎన్నో సార్లు ఆందోళన చేసినా మాకు న్యాయం చేయడానికి ప్రయత్నించారే తప్ప ఇలా పోలీసులను ప్రయోగించలేదని, కూటమి ప్రభుత్వంలో తమపైకి పోలీసులను తీసుకువచ్చి చరిత్ర తిరగరాసారని పట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ తమ సమస్య పరిష్కరించే వరకు కదిలేది లేదని భీష్మించారు. కాగా సోమవారం శాస్త్రవేత్తలను తీసుకువస్తామని డీడీ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. సోమవారం శాస్త్రవేత్తలను తీసుకురాకుంటే డిప్యూటీ సీఎం ఇంటి దగ్గర ధర్నా చేస్తామన్న హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment