విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి
కాకినాడ సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి సాధించేలా ప్రధానోపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. జిల్లా పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యాన కాకినాడ జేఎన్‌టీయూ అలుమ్ని ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన ఎంఈఓలు, హెచ్‌ఎంల సమీక్షలో ఆయన మాట్లాడారు. చిన్న పిల్లలు లైంగిక వేధింపులకు గురి కాకుండా ఉండేలా విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. మత్తు పదార్ధాలు చెడు వ్యసనాల బారిన పడకుండా విద్యార్థులను ఉపాధ్యాయులు రోజూ నిశిత పరిశీలన చేసి, సరైన మార్గదర్శనం చేయాలని సూచించారు. ఉపాధ్యాయుల హాజరు నూరు శాతం నమోదయ్యేలా చూడాలన్నారు. జిల్లాలో 49 అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశామన్నారు. విజ్ఞాన శాస్త్రాల పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించేలా ప్రాజెక్టులు రూపొందించాలన్నారు. ఈ ల్యాబ్‌ల సక్రమ నిర్వహణకు ఉపాధ్యాయులకు ఆరు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తామని చెప్పారు. జిల్లాలో అపార్ నమోదు వేగవంతం చేసి, సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. వచ్చే నెల 7న అన్ని పాఠశాలల్లో నిర్వహించే తల్లిదండ్రులు – ఉపాధ్యాయుల సమావేశాలను విజయవంతం చేయాలన్నారు. పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ షణ్మోహన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి కలెక్టర్, డీఈఓ పి.రమేష్ పూలమాలలు వేసి, నివాళులర్పించారు.
పింఛన్ల పంపిణీ
విధానంలో మార్పులు
కాకినాడ సిటీ: ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ విధానంలో ప్రభుత్వం మార్పులు చేసిందని కలెక్టర్ షణ్మోహన్ సగిలి శుక్రవారం విలేకర్లకు తెలిపారు. నూతన విధానం ప్రకారం ఏదైనా కారణంతో పింఛనుదారు ఒక నెలలో పింఛను తీసుకోకపోతే, రెండో నెలలో మొదటి నెల బకాయితో కలిపి చెల్లిస్తారన్నారు. రెండో నెలలో కూడా తీసుకోకపోతే మూడో నెలలో మొదటి రెండు నెలల బకాయితో పాటు చెల్లిస్తారని తెలిపారు. వరుసగా మూడు నెలల పాటు తీసుకోకపోతే ఆ పింఛనును రద్దు చేస్తామని వివరించారు. అలా రద్దయిన పింఛను పునరుద్ధరణకు లబ్ధిదారు సంబంధిత సచివాలయం, ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్‌కు తమ పింఛను ఆపివేసిన తేదీ నుంచి మూడు నెలలల్లోగా అభ్యర్థన సమర్పించాలన్నారు. పునరుద్ధరించిన లబ్ధిదారులకు ఎటువంటి బకాయిలూ చెల్లించబోరని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే, పింఛను పొందుతున్న పురుష లబ్ధిదారు ఈ నెల 1వ తేదీ తరువాత మరణిస్తే వారి జీవిత భాగస్వామికి డిసెంబర్ 1 నుంచి వితంతు పింఛను మంజూరుకు పరిశీలిస్తారని తెలిపారు. ప్రతి నెలా 15వ తేదీ లోగా మంజూరైన వారికి మరుసటి నెల నుంచి పింఛన్లు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment