ముందు దగా.. వెనుక దగా | - | Sakshi
Sakshi News home page

ముందు దగా.. వెనుక దగా

Published Sat, Nov 23 2024 3:59 AM | Last Updated on Sat, Nov 23 2024 3:59 AM

ముందు

ముందు దగా.. వెనుక దగా

‘వెనుక దగా.. ముందు దగా.. కుడి ఎడమల దగా దగా..’ అంటూ మహాకవి శ్రీశ్రీ పీడిత జనం కోసం ఏనాడో ఆక్రోశించాడు. ఆ మాటలు ఇప్పటికీ నిజమేనని కూటమి ప్రభుత్వం మరోసారి నిరూపిస్తోంది. ప్రజా సేవకులుగా మన్ననలు అందుకున్న వలంటీర్లకు.. ఎన్నికల ముందు లేనిపోని ఆశలు పెట్టి నమ్మించింది. ఓట్ల అవసరం తీరిన తర్వాత ఇప్పుడు వారి అవసరమేమీ లేదని వంచిస్తోంది. దీనిపై వలంటీర్లతో పాటు ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, కాకినాడ: సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి నేతలు చెప్పిన మాటలకు.. గద్దెనెక్కాక చేస్తున్న పనులకు అసలు పొంతన లేకుండా ఉంది. నాడు ఓట్ల కోసం తమను నమ్మించి, ఇప్పుడు దగా చేస్తున్నారని దాదాపు అన్ని వర్గాల నుంచీ ఆగ్రహం పెల్లుబుకుతోంది. సూపర్‌–6 హామీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లు తమను నమ్మించి, ఓట్లు వేయించుకున్నాక ఇప్పుడు ముంచేస్తున్నారంటూ రోడ్డెక్కుతున్నారు. ఆశా కార్యకర్తలు, 108 సిబ్బంది, డ్వాక్రా యానిమేటర్లు, ఉపాధి హామీ పథకం చిరుద్యోగులు, వివిధ శాఖల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఇప్పటికే కూటమి సర్కార్‌ వంచనపై ఆందోళన బాటలో పయనిస్తున్నారు. ఇచ్చిన హామీల అమలు కోసం ఆయా వర్గాలు ప్రతి రోజూ కలెక్టరేట్‌ను ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. వారికి ఇప్పుడు గ్రామ/వార్డు వలంటీర్లు కూడా తోడయ్యారు. కూటమి ప్రభుత్వం నమ్మించి తమ గొంతు కోసిందంటూ శుక్రవారం వారు కలెక్టరేట్‌ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.

నాడు చిరునవ్వుతో సేవలు

● దేశానికే ఆదర్శంగా నిలిచిన వలంటీర్‌ వ్యవస్థను గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రారంభించింది. దీని ద్వారా కులం, మతం, రాజకీయం వంటి వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సేవలు అందేవి. తద్వారా ప్రజలకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన బాధ తప్పింది.

● ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారకుండానే జిల్లాలోని 2,79,805 మంది సామాజిక భద్రత పింఛనుదార్ల ఇళ్ల తలుపులు తట్టి.. వలంటీర్లు చిరునవ్వుతో ఠంచనుగా పింఛన్లు అందించేవారు.

● దీంతో పాటు రేషన్‌ కార్డు, గృహ నిర్మాణానికి దరఖాస్తు చేయాలన్నా, ఓటు నమోదు చేయాలన్నా, కుల, ఆదాయ, ఇతర ఏ సర్టిఫికెట్‌ కావాలన్నా, ఊళ్లో వీధి దీపాలు వెలగడం లేదన్నా, మంచినీటి కుళాయిలు రావడం లేదన్నా, రేషన్‌ సక్రమంగా అందడం లేదన్నా.. ఇలా ప్రభుత్వ కార్యక్రమాలపై ఏ సమాచారం కావాలన్నా వలంటీర్లు క్షణాల్లో ప్రజల ముందుండేవారు.

● తమ సేవలతో రాజకీయాలు, వర్గాలకు అతీతంగా ప్రజల మన్ననలు అందుకున్నారు.

● ఇవన్నీ ఒక ఎత్తయితే కోవిడ్‌ సమయంలో బాధితులను పలకరించేందుకు రక్తసంబంధీకులు కూడా దరి చేరని దుర్భర పరిస్థితి. అటువంటి విపత్కర పరిస్థితుల్లో వలంటీర్లు తమ ప్రాణాలకు సైతం తెగించి మరీ కరోనా బాధితులకు ఆస్పత్రులు, ఇళ్ల వద్ద అందించిన సేవలకు వెలకట్టలేం.

విషం చిమ్మి.. నమ్మించి.. నేడు వంచించి..

సార్వత్రిక ఎన్నికల ముందు వరకూ ‘జగనన్న సైన్యం’ అంటూ వలంటీర్‌ వ్యవస్థపై కూటమి నేతలు విషం చిమ్మారు. ‘అదేం ఉద్యోగం? మూటలు మోసేది కూడా ఓ ఉద్యోగమేనా?’ అంటూ స్వయంగా చంద్రబాబే వెటకారం చేసేవారు. వలంటీర్‌ వ్యవస్థతో రాష్ట్రంలో 30 వేల మందికి పైగా అమ్మాయిలు అదృశ్యమైపోయారంటూ పవన్‌ కల్యాణ్‌ తప్పుడు ఆరోపణలు చేసేవారు. అయితే, ఎన్నికలు సమీపించేకొద్దీ వారు స్వరం మార్చారు. వలంటీర్‌ వ్యవస్థను కొనసాగిస్తామని, వారి వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని నమ్మించారు. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం ఆ హామీ అమలు చేసి, తమను తిరిగి విధుల్లోకి తీసుకుంటుందని వలంటీర్లు ఎదురు చూశారు. తీరా గద్దెనెక్కాక చంద్రబాబు, కూటమి నేతలు ప్లేటు ఫిరాయించేశారు. అసెంబ్లీ సాక్షిగా సంబంధిత మంత్రి అసలు వలంటీరు వ్యవస్థే లేదని ప్రకటించి, వారి ఆశలపై నీళ్లు జల్లి మరో మోసానికి ఒడిగట్టారు. గత ఏడాది ఆగస్టులోనే వలంటీర్‌ వ్యవస్థ రద్దయ్యిందని మంత్రి చెప్పారు. అటువంటప్పుడు ఈ ఏడాది మే నెల వరకూ తమకు జీతాలు ఎలా ఇచ్చారని వలంటీర్లు నిలదీస్తున్నారు. అసలు విధుల్లోనే లేనప్పుడు వలంటీర్లను ఎన్నికల విధులకు దూరం పెట్టాలంటూ ఏవిధంగా కోర్టుకు వెళ్లారని, కోర్టు మాత్రం స్టే ఎలా ఇచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. తమను నయవంచన చేసిన చంద్రబాబు అండ్‌ కోకు బుద్ధి వచ్చే వరకూ ఉద్యమిస్తామని వలంటీర్లు హెచ్చరిస్తున్నారు.

మంత్రి ప్రకటన హాస్యాస్పదం

ఎన్నికల సమయంలో అడగకుండానే వలంటీర్లకు రూ.10 వేల జీతం ఇస్తామన్నారు. ‘నన్ను నమ్మండి’ అంటూ చంద్రబాబు, కూటమి నాయకులు వలంటీర్లకు పదేపదే చెప్పారు. ఇప్పుడు వలంటీర్‌ వ్యవస్థ 2023లోనే రద్దయిపోయిందని మంత్రి చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. 2023లోనే ఈ వ్యవస్థ రద్దయితే ఈ ఏడాది మే నెల వరకూ మాకు జీతాలు ఎలా ఇచ్చారు? ఈ వ్యవస్థ రద్దయితే హైకోర్టుకు వెళ్లి ఎన్నికల విధుల్లో వలంటీర్లు ఉండకూడదంటూ స్టే ఎలా తెచ్చారు? హైకోర్టు ఎలా స్టే ఇచ్చింది? ఎన్నికల హామీలు అమలు చేయలేక ప్రజలను, వలంటీర్లను చంద్రబాబు, మంత్రులు మోసం చేస్తున్నారు.

– ఓరుగంటి సూర్య నందీశ్వరుడు, వలంటీర్ల

సంఘం జిల్లా కన్వీనింగ్‌ కమిటీ సభ్యుడు

నమ్మించి మోసం చేశారు

అప్పటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం మాకు ఇస్తున్న రూ.5 వేల గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని గత ఎన్నికల్లో కూటమి నేతలు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక వలంటీర్‌ వ్యవస్థే లేదంటూ కూటమి నేతలు ప్రకటనలు చేయడం దారుణం. ఇప్పటికై నా ప్రభుత్వం వలంటీర్‌ వ్యవస్థను కొనసాగించాలి. – గొర్ల రాంబాబు, వలంటీర్‌,

రాచపల్లి, ప్రత్తిపాడు రూరల్‌

గడప వద్ద సేవలు నిలిచిపోయాయి

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో వలంటీర్‌ వ్యవస్థ ద్వారా గడప వద్దనే ప్రభుత్వ సేవలు అందేవి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వలంటీర్‌ వ్యవస్థను వినియోగించడంలేదు. దీంతో ప్రభుత్వ పథకాల కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. ఇప్పటికై నా వలంటీర్‌ వ్యసవ్థను పునరుద్ధరించాలి.

– పసుపులేటి జీవ, ధర్మవరం, ప్రత్తిపాడు రూరల్‌

వలంటీర్లను వంచించిన కూటమి సర్కార్‌

ఎన్నికల ముందు వారి వేతనం

రూ.10 వేలు చేస్తామని హామీ

ఇప్పుడు ఏకంగా వారి

ఉద్యోగాలకే ఎసరు

జిల్లాలో 12 వేలకు పైగా

కుటుంబాలకు క్షోభ

కూటమి నేతల మోసంపై

వలంటీర్ల మండిపాటు

జిల్లాలో వలంటీర్ల వివరాలు

గ్రామ సచివాలయాలు 445

వలంటీర్లు 9,015

వార్డు సచివాలయాలు 175

వలంటీర్లు 3,257

మొత్తం వలంటీర్లు 12,272

No comments yet. Be the first to comment!
Add a comment
ముందు దగా.. వెనుక దగా1
1/4

ముందు దగా.. వెనుక దగా

ముందు దగా.. వెనుక దగా2
2/4

ముందు దగా.. వెనుక దగా

ముందు దగా.. వెనుక దగా3
3/4

ముందు దగా.. వెనుక దగా

ముందు దగా.. వెనుక దగా4
4/4

ముందు దగా.. వెనుక దగా

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement