బస్సు భారం.. రైలే నయం | - | Sakshi
Sakshi News home page

బస్సు భారం.. రైలే నయం

Published Sat, Aug 12 2023 1:24 AM | Last Updated on Sat, Aug 12 2023 1:24 AM

స్టేషన్‌లో రైలు ఎక్కుతున్న ప్రయాణికులు - Sakshi

స్టేషన్‌లో రైలు ఎక్కుతున్న ప్రయాణికులు

సాక్షి, కామారెడ్డి : రాష్ట్రంలో రెండేళ్లలో ఆర్టీసీ బస్సు చార్జీలు భారీగా పెరిగాయి. దీంతో బస్సు ప్రయాణం ప్రజలకు భారంగా మారింది. కామారెడ్డి నుంచి నిజామాబాద్‌కు నాన్‌స్టాప్‌ బస్సులో వెళ్లాలంటే చార్జీ రూ. 110 వసూలు చేస్తున్నారు. అదే రైలులో అయితే రూ. 35 చెల్లిస్తే సరిపోతుంది. అలాగే కామారెడ్డి నుంచి సికింద్రాబాద్‌, కాచిగూడలకు వెళ్లాలంటే రైలు చార్జీ రూ. 55 ఉంది. ఎక్స్‌ప్రెస్‌ బస్సులో వెళ్లాలంటే రూ. 180, డీలక్స్‌లో అయితే 220 చెల్లించాల్సిందే. కాగా కరోనా తర్వాత ప్యాసింజర్‌ రైలు చార్జీలు, ఎక్స్‌ప్రెస్‌ రైలు చార్జీలు ఒకేవిధంగా వసూలు చేస్తున్నారు. కరోనాకు ముందు ప్యాసింజర్‌ రైలు చార్జీలు మరీ చవకగా ఉండేవి. బస్సులలోచార్జీలు భారీగా ఉండడంతో సామాన్యులు ఇబ్బందిపడుతున్నారు. ప్రత్యామ్నాయం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే చాలామంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ప్రత్యామ్నాయం ఉన్నవారు మాత్రం బస్సు ప్రయాణాన్ని ఇష్టపడడం లేదు. ప్రధానంగా హైదరాబాద్‌, నిజామాబాద్‌ రూట్లలో రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు.

పెరిగిన తాకిడి.. స్టేషన్‌లో సందడి

కామారెడ్డి స్టేషన్‌ మీదుగా ఇటు ఉత్తర భారతం, అటు దక్షిణ భారతంలోని వివిధ రాష్ట్రాలకు రైలు సౌకర్యం ఉంది. రోజూ 55 నుంచి 60 రైళ్లు తిరుగుతున్నాయి. కొన్ని రైళ్లు సూపర్‌ఫాస్ట్‌వి ఉన్నాయి. రైల్వే లైన్‌ విద్యుదీకరణతో రైళ్ల వేగం కూడా పెరిగింది. డబ్లింగ్‌ చేస్తే రైళ్ల రాకపోకలు మరింత పెరిగే అవకాశం ఉంది. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలోని రైల్వే స్టేషన్‌ నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే నిజామాబాద్‌, బాసర, నాందేడ్‌ ప్రాంతాలకూ ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో వెళ్తుంటారు. ఇక్కడ రోజూ తక్కువలో తక్కువ 1,500 టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఇవే కాకుండా చాలామంది ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. వారి సంఖ్య కూడా ఎక్కువే.. ప్రయాణికుల తాకిడి పెరిగిపోవడంతో రైల్వే స్టేషన్‌ ఆవరణలో సందడి కనిపిస్తోంది. కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో రైలు వచ్చినపుడు స్టేషన్‌ అంతా రద్దీగా మారిపోతోంది. రైలు ఎక్కడానికి వచ్చిన వారు, రైలు దిగినవారితో హడావిడి ఉంటోంది.

తిరుపతి, షిరిడీ రూట్లలో...

కామారెడ్డి స్టేషన్‌ మీదుగా అటు తిరుపతికి, ఇటు షిరిడీకి రైళ్లు నడుస్తున్నాయి. రోజూ ఆయా ప్రాంతాలకు రైళ్లు వెళుతున్నాయి. దీంతో చాలామంది ఆన్‌లైన్‌లో రైలు టికెట్లు బుక్‌ చేసుకుని తీర్థయాత్రలు చేస్తున్నారు. నిత్యం వందలాది మంది ప్రముఖ ఆలయాల దర్శనాలకు వెళుతున్నారు. రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌, కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లు రోజూ తిరుపతికి వెళతాయి. అలాగే షిరిడీకి కూడా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లున్నాయి. ఇదే రూట్‌లో బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి భారీ సంఖ్యలో వెళుతున్నారు.

ముంబయికి వెళ్లేవారూ ఎక్కువే...

దేశ వాణిజ్య రాజధాని ముంబయికి నిత్యం వెళ్లేవారి సంఖ్య వందల్లో ఉంటోంది. కామారెడ్డి స్టేషన్‌ నుంచి కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, మెదక్‌ జిల్లాలకు చెందిన వారు ఎంతో మంది ముంబయికి వెళ్లడానికి కామారెడ్డి స్టేషన్‌కు వస్తుంటారు. రోజూ సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి ముంబయికి దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ నడుస్తోంది. దీంట్లో ముందుగా రిజర్వు చేసుకుని వెళుతుంటారు. జనరల్‌ బోగీలు రెండే రెండు ఉన్నాయి. వాటిలో ప్రయాణం ఇబ్బంది అయినా, తప్పనిసరి పరిస్థితుల్లో వాటిలోనూ ప్రయాణం చేస్తున్నారు.

ఆర్టీసీ సంస్థ ఎడాపెడా చార్జీలను పెంచడంతో ప్రయాణికులు బస్సెక్కాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్‌, నిజామాబాద్‌ రూట్లలో ప్రయాణించేవారిలో చాలామంది చార్జీల భారాన్ని తగ్గించుకోవడానికి రైళ్లను ఆశ్రయిస్తున్నారు. సీట్లు లేకపోతే నిల్చొని ప్రయాణిస్తున్నారు. దీంతో ఇటీవలి కాలంలో రైళ్లలో రద్దీ పెరిగింది.

ఆర్టీసీ చార్జీల మోతతో

ఇబ్బందిపడుతున్న సామాన్యులు

ప్రత్యామ్నాయంగా రైళ్లలో

ప్రయాణానికి మొగ్గు

హైదరాబాద్‌, నిజామాబాద్‌ రూట్లలో పెరిగిన రద్దీ

జనరల్‌ బోగీలు పెంచాలని కోరుతున్న ప్రయాణికులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement