పాల బిల్లులు వచ్చేదెప్పుడో?
లింగంపేట : విజయ డెయిరీలో పాలు విక్రయించిన పాడి రైతులకు రెండు నెలలుగా బిల్లులు రావడం లేదు. దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. విజయ డెయిరీ జిల్లాలో సుమారు 200 పాల కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఆయా కేంద్రాల ద్వారా సుమారు 20 వేల మంది పాడి రైతులనుంచి పాలు సేకరిస్తోంది. లింగంపేట, తాడ్వాయి, గాంధారి, దోమకొండ, భిక్కనూరు, రాజంపేట, బీబీపేట తదితర మండలాలనుంచి ఎక్కువగా పాల సేకరణ జరుగుతోంది. కేంద్రంలో పాలు విక్రయించే వారికి నిబంధనల ప్రకారం 15 రోజులకు ఒకసారి బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే రెండు నెలలుగా పాడి రైతులకు బిల్లులు రావడం లేదు. దీంతో జిల్లాలో రూ. 7.50 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. పాలు విక్రయించి రెండు నెలలు గడుస్తున్నా డబ్బులు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓవైపు యాసంగి పంటల సాగు పనులు జోరందుకోవడం, మరోవైపు పండుగ రావడం, ఇంకోవైపు పాల బిల్లులు రాకపోవడంతో చేతిలో డబ్బులు లేక ఇబ్బందిపడుతున్నామని పాడి రైతులు పేర్కొంటున్నారు. బిల్లులు రాకపోవడంతో పశువులకు దాణా, తవుడు, గడ్డి కొనుగోలు చేయడానికి అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి పాడి రైతులకు బిల్లులు చెల్లించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రెండు నెలలుగా పెండింగ్‌లో..
జిల్లాలో రూ. 7.50 కోట్లు బకాయి
ఇబ్బంది పడుతున్న పాడి రైతులు
Comments
Please login to add a commentAdd a comment