పథకాల అమలుకు ఏర్పాట్లు చేయండి
కామారెడ్డి క్రైం: రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు భరోసా కోసం ఈనెల 15 నాటికి సన్నాహకాలు పూర్తిచేయాలన్నారు. గుట్టలు, రోడ్లు, నాలా కన్వర్షన్, భూసేకరణ, లే అవుట్, వ్యవసాయానికి యోగ్యంగా లేని భూములను పరిశీలించాలన్నారు. ఈనెల 16 నుంచి 20 వరకు క్షేత్ర పర్యటన చేసి డాటా సిద్ధం చేయాలని, దానిపై గ్రామ సభలో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలన్నారు. భూమిలేని వ్యవసాయ కూలీలు కనీసం 20 రోజుల పాటు ఉపాధి హామీ పథకం కింద పనిచేసిన డాటాను సిద్ధం చేయాలన్నారు. ఆధార్ నంబర్ మ్యాపింగ్ చేయాలన్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారు, గతంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి డాటాను సిద్ధం చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేను సోమవారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు సర్వేను సూపర్ చెక్ చేయాలని సూచించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు విక్టర్, శ్రీనివాస్‌రెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీవోలు రంగనాథ్‌రావు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
రేపటిలోగా ఇందిరమ్మ సర్వే
పూర్తి కావాలి
టెలీకాన్ఫరెన్స్‌లో కలెక్టర్
ఆశిష్ సంగ్వాన్
Comments
Please login to add a commentAdd a comment