కామారెడ్డి టౌన్: ఎన్నిసార్లు కేసులు నమోదుచేసినా కామారెడ్డిలోని సమన్విత ఆస్పత్రి యాజమాన్యం తీరు మారడం లేదు. లింగ నిర్ధారణ పరీక్షలను ఆపడం లేదు. ఈ విషయంలో ఇప్పటికే ఆస్పత్రిని రెండుసార్లు సీజ్ అయిన విషయం తెలిసిందే.. తాజాగా మహారాష్ట్ర పోలీసులు ఆస్పత్రి డాక్టర్ ప్రవీణ్‌ను అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. వివరాలిలా ఉన్నాయి.
గాంధారి సీహెచ్‌సీలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ప్రవీణ్.. కామారెడ్డిలో సమన్విత పేరుతో ప్రైవేట్ ఆస్పత్రి నిర్వహిస్తున్నాడు. మహారాష్ట్రలోని ఉద్గిర్ ప్రాంతానికి చెందిన ఓ ఐదు నెలల గర్భిణి, ఆమె భర్త కలిసి మూడు నెలల క్రితం ఈ ఆస్పత్రికి వచ్చారు. స్కానింగ్ చేసిన వైద్యుడు పుట్టబోయేది ఆడపిల్లని చెప్పాడు. రెండోసారి కూడా ఆడపిల్లే పుడుతుందని తెలియడంతో ఆ దంపతులు మహారాష్ట్రకు వెళ్లి అబార్షన్ చేయించుకున్నారు. ఇటీవల ఆ దంపతుల మధ్య గొడవలు జరిగి, విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. కేసు నమోదు చేసుకున్న ఉద్గిర్ రూరల్ పోలీసులు.. శుక్రవారం సాయంత్రం కామారెడ్డికి వచ్చారు. సమన్విత ఆస్పత్రిలో వైద్యుడిని విచారించి, పట్టణ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం వైద్యుడిని అరెస్ట్ చేసి మహారాష్ట్ర పోలీసులు వెంట తీసుకెళ్లారు.
బయటపడుతున్న సమన్విత
ఆస్పత్రి దారుణాలు
ఇప్పటికే రెండుసార్లు ఆస్పత్రి సీజ్
కేసులు నమోదు చేసినా
మారని యాజమాన్యం
తాజాగా లింగ నిర్ధారణ కేసులో
డాక్టర్ ప్రవీణ్ అరెస్ట్
అదుపులోకి తీసుకున్న మహారాష్ట్రలోని ఉద్గీర్ రూరల్ పోలీసులు
యథేచ్ఛగా నిర్వహణ
జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీలోగల కౌసల్య ఆస్పత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యలు జరుగుతున్నాయని అధికారులకు 2021లో ఫిర్యాదులు అందాయి. దీంతో ఆ ఏడాది జూలై 14న వైద్య ఆరోగ్యశాఖ డెకాయ్ ఆపరేషన్ నిర్వహించింది. అప్పట్లో డాక్టర్ ప్రవీణ్ తండ్రి సిద్దిరాములుతో పాటు మరికొందరిని అరెస్టు చేసి ఆస్పత్రిని సీజ్ చేశారు. కొన్నాళ్ల తర్వాత సదరు వైద్యుడు అదే కాలనీలో అద్దాల మేడ నిర్మించి, సమన్విత పేరుతో తిరిగి ఆస్పత్రిని ప్రారంభించాడు. ఇటీవల ఆస్పత్రిలో శిశువును విక్రయించినట్లు ఫిర్యాదు రావడంతో ఈ ఏడాది జూలై 7వ తేదీన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మరోసారి సీజ్ చేశారు. అయితే ఆస్పత్రి నిర్వాహకులు కోర్టునుంచి స్టే తెచ్చుకుని ఆస్పత్రిని మళ్లీ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో లింగ నిర్ధారణ కేసులో మహారాష్ట్ర పోలీసులు ఆస్పత్రి వైద్యుడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్లడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment