నిబంధనలు తూచ్!
కామారెడ్డి టౌన్: జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్, డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. స్కానింగ్ కేంద్రాలలో యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. డయాగ్నోస్టిక్ సెంటర్‌లలో తప్పుడు ఫలితాలు ఇస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయినా ఆయా ఆస్పత్రులు, కేంద్రాలపై చర్యలు తీసుకోవడంలో వైద్యఆరోగ్య శాఖ అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలున్నాయి. రెగ్యులర్‌గా తనిఖీలు చేపట్టకపోవడంతో ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకుల ఇష్టారాజ్యానికి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన లింగ నిర్ధారణ, స్కానింగ్ యంత్రాల సీజ్ కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. 2011లో రాజంపేట ఆస్పత్రిలో ఓ వైద్యుడి పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉన్న స్కానింగ్ యంత్రాన్ని చాలాకాలంగా జిల్లా కేంద్రంలో వినియోగిస్తున్నారని విచారణలో తేలింది. మిగతా రెండు స్కానింగ్ యంత్రాలను సైతం నిబంధనలకు విరుద్ధంగానే వినియోగించారు. ఈ ఘటనలతో ఇన్నేళ్లుగా ఆ ఆస్పత్రి, స్కానింగ్ యంత్రాలపై వైద్యశాఖ పర్యవేక్షణ కరువైందని తేలిపోయింది. ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ కేంద్రాల రిజిస్ట్రేషన్‌లు, రెన్యువల్‌కు సంబంధించి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అనుమతుల మంజూరులో అధికారులు నిబంధనలను పట్టించుకోవడం లేదు. దీంతో ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్‌లలో నిర్వాహకుల ఇష్టారాజ్యం నడుస్తోంది. గోదాంరోడ్‌లోని రెండు స్కానింగ్ కేంద్రాలలో, ఓ మెటర్నిటీ ఆస్పత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయన్న ప్రచారం ఉంది. అలాగే ఎలాంటి అర్హతలు లేనివారు స్కానింగ్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఎలాంటి అర్హతలు లేనివారు పరీక్షలు చేస్తుండడంతో డయాగ్నోస్టిక్ సెంటర్‌లలో తప్పుడు ఫలితాలు వస్తున్నాయి. ఈ అంశాలపై ఫిర్యాదులు వస్తున్నా వైద్యశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి.
తనిఖీలు లేకుండానే..
జిల్లాలో 70కిపైగా ప్రైవేట్ ఆస్పత్రులున్నాయి. 18 స్కానింగ్ సెంటర్లు, 100కుపైగా డయాగ్నోస్టిక్ కేంద్రాలు నడుస్తున్నాయి. జిల్లాలో ఆస్పత్రులు, స్కానింగ్, డయాగ్నోస్టిక్స్, ఎక్స్‌రే సెంటర్‌ల రిజిస్ట్రేషన్‌లు, రెన్యువల్‌కు సంబంధించి ఏడాది కాలంలో గత డీఎంహెచ్‌వో 56 ఫైళ్లపై సంతకాలు చేసినట్లు తెలిసింది. ఆయా ఆస్పత్రులు, సెంటర్లను ఎలాంటి తనిఖీలు చేయకుండానే అనుమతులు ఇచ్చారని తెలుస్తోంది. అనుమతులకోసం భారీ మొత్తంలో చేతులు మారాయన్న ఆరోపణలు వచ్చాయి. లింగ నిర్ధారణ పరీక్షలకు కేరాఫ్‌గా నిలుస్తున్న ఆస్పత్రి, స్కానింగ్ కేంద్రాలకు అనుమతుల విషయంలోనూ భారీగా డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఓ ఉద్యోగి మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ఎలాంటి తనిఖీలు లేకుండానే అనుమతులు ఇప్పిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆస్పత్రులు, స్కానింగ్, డయాగ్నోస్టిక్ కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఆస్పత్రులు, స్కానింగ్, డయాగ్నోస్టిక్
కేంద్రాలలో తనిఖీలు కరువు
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న
నిర్వాహకులు
లింగ నిర్ధారణ పరీక్షలు
జరుగుతున్నా చర్యలు
నామమాత్రం
వైద్యశాఖపై విమర్శల వెల్లువ
తనిఖీలు చేస్తున్నాం
జిల్లాలోని ఆస్పత్రులు, స్కానింగ్, డయాగ్నోస్టిక్ కేంద్రాలను తరచూ తనిఖీ చేస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాటిపై చర్యలు తీసుకుంటున్నాం. అందరూ నిబంధనలు పాటించాల్సిందే. – చంద్రశేఖర్, డీఎంహెచ్‌వో
Comments
Please login to add a commentAdd a comment