ఆగని రేషన్ బియ్యం దందా
దోమకొండ: దోమకొండ మండల కేంద్రంలోని ఓ రైస్‌మిల్లులో దాచిన 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు,విజిలెన్స్ అధికారులు నెల క్రితం పట్టు కున్నారు.సదరు వ్యాపారి గతంంలో పీడీఎస్ బి య్యం అమ్ముతూ పట్టుబడ్డాడు. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో పాటు పోలీసులు కలిసి దా డులు చేసి సదరు రైస్‌మిల్ నుంచి ఇప్పటికి మూడుసార్లు రేషన్ బియ్యం పట్టుకున్నారు. అయినప్పటికీ రేషన్ అక్రమ దందాలో మార్పు రావడం లేదు.
జిల్లా వ్యాప్తంగా..
జిల్లావ్యాప్తంగా రేషన్ బియ్యం అక్రమ దందా కొనసాగుతోంది. వ్యాపారులు లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి పక్కదారి పట్టిస్తున్నారు. కిలోల చొప్పున సేకరించి రహస్య ప్రాంతాలలో నిల్వ చేస్తున్నారు. కొందరు పట్టణాల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని అందులో బియ్యాన్ని డంప్ చేస్తున్నారని సమాచారం. అధికారులు నిఘా పెంచినా వారి కళ్లుగప్పి రవాణా చేస్తున్నారు. కొన్నిచోట్ల పోలీసులు దాడులు చేసి పట్టుకుంటున్నారు. ముఖ్యంగా నెలలో మొదటి 15 రోజుల పాటు బియ్యం సేకరిస్తున్నారు. తర్వాత 15 రోజుల్లో బియ్యాన్ని గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. వ్యాపారులు కిలోకు రూ.12 నుంచి రూ. 15 వరకు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే బియ్యాన్ని రూ. 25 నుంచి రూ. 28 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం.
ప్రోత్సహిస్తున్న మిల్లర్లు...
జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మిల్లర్లు అక్రమ రేషన్ బియ్యం దందాను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. చాలాచోట్ల అక్రమంగా తరలిస్తున్న, నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టుబడుతున్నా దందా మాత్రం ఆగడం లేదు. పోలీసులు, పౌరసరఫరాలశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో నిఘా పెంచి దాడులు చేసినా పరిస్థితిలో మార్పురావడం లేదు.
తనిఖీలలో పట్టుబడుతున్నా
మారని తీరు
కేసులు నమోదు చేస్తాం..
అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేయడం నేరం. ఎవరైనా పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గాని లేదా నిల్వ చేసినట్లుగాని తెలిస్తే మాకు సమాచారం ఇవ్వాలి. దాడులు చేసి నిందితులను పట్టుకుంటాం.
– ఆంజనేయులు, ఎస్సై, దోమకొండ
Comments
Please login to add a commentAdd a comment