బీఆర్ నాయుడుకు టీటీడీ చైర్మన్ పదవి
సాక్షి, అమరావతి/హైదరాబాద్: టీవీ–5 అధినేత బీఆర్ నాయుడికి చంద్రబాబు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఆయనతోపాటు మరో 23 మందిని సభ్యులుగా నియమిస్తున్నట్లు బుధవారం టీడీపీ ప్రకటించింది. సభ్యులుగా జగ్గంపేట, కోవూరు, మడకశిర ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎంఎస్ రాజు, టీడీపీ నేత పనబాక లక్ష్మి, సాంబశివరావు (జాస్తి శివ), నన్నపనేని సదాశివరావు, కోటేశ్వరరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, జంగా కృష్ణమూర్తి, శాంతారాం, పి.రామ్మూర్తి, తమ్మిశెట్టి జానకీదేవి, నరేశ్ కుమార్ ని యమితులయ్యారు. తెలంగాణ నుంచి నల్లగొండకు చెంది న టీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి, జనసేన పార్టీ నేత బుంగునూరు మహేందర్‌రెడ్డి, సినీ ఆర్ట్ డైరెక్టర్, యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణంలో అర్కిటెక్ట్‌గా వ్యవహరించిన బురగపు ఆనంద్‌సాయి, భారత్ బయోటెక్ కో చైర్మన్ సుచి త్ర ఎల్లా, అనుగోలు రంగశ్రీకి అవకాశం ఇచ్చారు. కర్ణాటక నుంచి జస్టిస్ హెచ్‌ఎల్ దత్, దర్శన్ ఆర్‌ఎన్, గుజరాత్ నుంచి డాక్టర్ అదిత్ దేశాయ్, మహారాష్ట్ర నుంచి సౌరబ్ హెచ్ బోరా, తమిళనాడు నుంచి కృష్ణమూర్తిని నియమించారు. కాగా ఈ జాబితాపై టీడీపీలో చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తమకు కచ్చితంగా బోర్డులో అవకాశం దక్కుతుందని భావించిన చాలామందికి నిరాశే ఎదురవడంతో వారంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనేక వడపోతలు, సమీకరణలు పరిశీలించి చంద్రబాబు ఈ జాబితా రూపొందించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల తర్వాత టీటీడీ బోర్డును నియమిస్తుండడం విశేషం.
సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు
టీటీడీ చైర్మన్‌గా నియమితులైన బీఆర్ నాయుడు, ఇతర పాలకమండలి సభ్యులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు.
సుచిత్ర ఎల్లా : భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కో చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కోవిడ్ టీకా కోవాగ్జిన్ రూపొందించినందుకు గాను అమెకు, ఆమె భర్త, ఆ సంస్థ సీఎండీ కృష్ణా ఎల్లాకు భారత ప్రభుత్వం 2022లో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. సుచిత్ర స్వస్థలం తమిళనాడులోని తిరుత్తుణి. కానీ తెలంగాణ కోటాలో ఆమెను టీటీడీ బోర్డు మెంబర్ పదవి వరించింది.
ఆనంద్ సాయి
తెలుగు చలనచిత్ర రంగంలో కళాదర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించిన ఆనంద్‌సాయి జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుడు. పవన్‌కళ్యాణ్ నటించిన పలు చిత్రాలకు ఆయన కళాదర్శకుడిగా వ్యవహరించారు. రంగారెడ్డి జిల్లాలో చిన జీయర్‌స్వామి ఆశ్రమ రూపకల్పనలో పాల్గొన్నారు. అనంతరం యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణం కోసం ఆర్కిటెక్ట్‌గా నియమితులయ్యారు. పవన్‌కళ్యాణ్ సూచనతో టీటీడీ పాలక మండలి సభ్యుడిగా అవకాశం దక్కింది.
బొంగునూరి మహేందర్‌రెడ్డి
హైదరాబాద్ శివారులోని కొంపల్లికి చెందిన బొంగునూరి మహేందర్‌రెడ్డి కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు సన్నిహితుడు. ఆ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచే ఆయన పవన్‌తో కలిసి నడుస్తున్నారు. తొలుత ప్రజారాజ్యం పార్టీలో కొనసాగి, జనసేన ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. ఇప్పుడు పవన్ సూచన మేరకు ఆయనకు టీటీడీ పాలక మండలి సభ్యుడిగా అవకాశం దక్కింది.
నన్నూరి నర్సిరెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా సిరిపురం గ్రామానికి చెందిన నర్సిరెడ్డి ముందునుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా ఉంటూ చంద్రబాబుకు సన్నిహితుడిగా ముద్రపడ్డారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌తో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment