విధి వంచించింది..కంపెనీ చేతులెత్తేసింది
మోపాల్: మండలంలోని వడ్డెరకాలనీకి చెందిన కొమ్రె నర్సింహులు (వడ్డె నర్సింలు) కూలీ నాలీ చేసుకుంటూ జీవనం సాగించేవాడు. పిల్లలను మంచిగా చదివించడంతోపాటు ఇల్లు కట్టుకోవాలన్న ఆశతో నాలుగేళ్ల క్రితం దుబాయ్‌లోని డీ–టెక్ కంపెనీలో లేబర్ పనికి వెళ్లాడు. లేబర్‌గా డబ్బులు సరిపోవడం లేదని, రిగ్గర్ (క్రేన్) ఆపరేటరేటింగ్ నేర్చుకుని అక్కడే పని చేశాడు. ఈ ఏడాది జూలై 22న ట్రాలా (లారీ)లో పని ప్రదేశానికి వెళ్తుండగా, ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టారు. ప్రమాదంలో నర్సింహులుకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
కోమాలో ఉన్నా కంపెనీ పట్టించుకోలేదు..
ప్రమాదంలో తీవ్ర గాయాలుకావడంతో నర్సింహులు 45 రోజులపాటు కోమాలో ఉన్నాడు. అయి నా ఏనాడూ కంపెనీ పట్టించుకోలేదు. తమకేం సంబంధం లేదన్నట్లు చేతులెత్తేసింది. వైద్యులు బతుకుతాడనే గ్యారెంటీ ఇవ్వలేకపోయారు. చివరకు తెలిసిన వారి ద్వారా ఆయన భార్య లక్ష్మి కంపెనీపై కేసు పెట్టింది. లాయర్ ద్వారా అవుట్ పాస్‌పోర్టు పొంది సెప్టెంబర్ 23న నర్సింలు స్వగ్రామానికి చేరుకున్నాడు. ప్రస్తుతం కంపెనీపై కేసు వేసి, ఇన్సురెన్స్ డబ్బులు వచ్చేలా లాయర్ కృషి చేస్తున్నారని తెలిసింది.
పూట గడవడం కష్టంగా ఉంది
భర్త కాళ్లు కోల్పోవడం, అత్తమ్మకు వయస్సుపైబడడం, పిల్లలు చిన్నగా ఉండటంతో పూట గడవటం కష్టంగా ఉంది. ఇంటి వద్ద ఉండి సపర్యలు చేయడానికే సమయం సరిపోతోంది. పనికి వెళ్లడం కుదరకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దాతలు ముందుకు వచ్చి మా కుటుంబాన్ని ఆదుకోవాలి. నర్సింలుకు ప్లాస్టిక్ కాళ్లు అమర్చేందుకు సాయం చేస్తే రుణపడి ఉంటాం.
– లక్ష్మి, నర్సింలు భార్య
మంచానికే పరిమితం..
నర్సింహులు రెండు కాళ్లు కోల్పోయి స్వగ్రామానికి చేరగా, నెల రోజుల నుంచి మంచానికే పరిమితమయ్యాడు. అన్ని సపర్యలు భార్య లక్ష్మీ ఇంటి వద్దే ఉండి చేస్తోంది. ఎలాంటి ఆధారం లేకపోవడంతో కుటుంబం రోడ్డున పడింది. పెద్ద దిక్కు అయిన నర్సింలు మంచానికే పరిమితం కావడంతో భర్తతోపాటు పిల్లల చదువులు, అత్త బాగోగుల బాధ్యత అంతా లక్ష్మి చూసుకుంటోంది. కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాాఖ, ఎంబసీ అధికారులు, గల్ఫ్ సంక్షేమ సంఘం ప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని తనకు రావాల్సిన పరిహారం డీ–టెక్ కంపెనీ, ఇన్సురెన్స్ కంపెనీ ద్వారా వచ్చేలా చూడాలని బాధితుడు కోరుతున్నాడు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్ ఇవ్వడంతోపాటు పిల్లల చదువుల బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.
దుబాయిలో రెండు కాళ్లు కోల్పోయిన వడ్డెర కాలనీవాసి
ఆధారం లేక రోడ్డున పడిన
నర్సింలు కుటుంబం..
గల్ఫ్ వెళ్లి డబ్బులు సంపాదించుకుందామనుకున్న ఆయనను విధి చిన్నచూపు చూసింది. దుబాయ్‌లో జూలై 22న జరిగిన రోడ్డు ప్రమాదంతో తన ఆశలన్నీ అడియాశలు చేసింది. ప్రమాదంలో కోమాలోకి వెళ్లి నెలన్నర రోజులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడు. చివరకు రెండు కాళ్లను కోల్పోయి, స్వగ్రామానికి చేరుకున్నాడు. ఎన్నో ఆశల మధ్య దుబాయ్ వెళ్లిన మోపాల్ మండలం వడ్డెరకాలనీకి చెందిన కొమ్రె నర్సింలు గాథ ఇది..
Comments
Please login to add a commentAdd a comment