మూడు ముక్కలాటకు ముమ్మర ఏర్పాట్లు
ఖలీల్‌వాడి: దీపావళి పండుగ నేపథ్యంలో జిల్లాలో మూడు ముక్కలాటకు ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. పేకాట గ్రూపుల నిర్వాహకులు ముందుగానే తమ ఫుల్ కోరంతో సిద్ధమవుతున్నారు. పేకాట ఆడేవారు ముందుగానే క్యాష్‌ను చూయిస్తేనే గ్రూపులకు ఎంట్రీ ఇస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి దీపావళి వచ్చిందంటే చాలు పండుగ ముందు నుంచి ఈ గ్రూప్‌ల నిర్వాహకులు పేకాట స్థావరాలను ఏర్పాటు చేస్తూ లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా త్రీకార్డ్స్, రమ్మీ, అందర్‌బాయర్, జోడీల పేరిట రహస్య ప్రాంతాల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకొని పోలీసులకు చిక్కకుండా పేకాటలను నిర్వహిస్తున్నారు. పండుగ ముగిసినా వారం రోజుల వరకు ఈ పేకాట స్థావరాలు కొనసాగుతాయి.
గతంలో పేకాటకు ‘క్యాట్’ ఏర్పాటు
గతంలో పేకాటను అడ్డుకట్ట వేసేందుకు నాటి ఎస్పీ మహేశ్ చంద్ర లడ్డా క్యాట్ అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం పేకాటను అరికట్టేందుకు విశేషంగా కృషి చేసేది. ఎస్పీకి అనుసంధానంగా ఈ బృందం ఉండేది. గ్రామాల్లో ఇన్‌ఫార్మర్లను ఏర్పాటు చేసుకొని దాడులు చేసి పేకాట ఆడేవారిని అదుపులోకి తీసుకునేవారు. దీనికి నాటి హెడ్‌కానిస్టేబుల్ జగదీశ్ నేతృత్యంలో పేకాటస్థావరాలు ఎక్కడ ఉన్నా పేకాట ఆడేవారిని అదుపులోకి తీసుకోవడంతో జిల్లాలో పేకాట ఆడేందుకు జంకేవారు. ఆర్మూర్ మండలంలోని గగ్గుపల్లిలో పేకాట స్థావరంపై దాడికి వెళ్లిన పోలీసు బృందాన్ని చూసి పేకాట ఆడేవారు పారిపోతుండగా కాల్పులు జరిపారు. దీంతో ఓ పేకాట ఆడే వ్యక్తికి బుల్లెట్ తగలడంతో అప్పుడు వివాస్పదంగా మారింది. ఆ తర్వాత ఎస్పీ లడ్డా బదిలీ కావడంతో క్యాట్ రద్దు అయ్యింది.
మహారాష్ట్రలోని పేకాట కేంద్రాలకు..
పెద్ద మొత్తంలో పేకాట ఆడేవారు మహారాష్ట్రలోని బోరి, దెగ్లూర్, పాపారావుపేట్ పేకాట కేంద్రాలకు ఇక్కడి నుంచి తరలివెళ్తున్నారు. ఈ ప్రాంతాల్లో పేకాట ఆడేవారిని తీసుకెళ్లే వారికి రూ.3 వేలతో పాటు భోజనం, మద్యాన్ని నిర్వాహకులు అందిస్తుంటారు. జిల్లాలోని పలు శాఖల్లో పని చేసే ఉద్యోగులు సైతం మహారాష్ట్రలోని పేకాట కేంద్రాలకు తరలివెళ్తున్నట్లు సమాచారం. ఇక్కడ పేకాట ఆడి పట్టుబడితే ఉద్యోగానికి ఇబ్బందులు వస్తాయని మహారాష్ట్రలోని పేకాట కేంద్రాలకు కొందరు ఉద్యోగులు వెళ్తున్నట్లు తెలిసింది.
ఆటను బట్టి సభ్యులు..
టాస్క్‌ఫోర్స్ నిర్వీర్యం
జిల్లాలో టాస్క్‌ఫోర్స్ సిబ్బందిపై అవినీతి ఆరోపణలు రావడంతో వారిని ఇటీవల బదిలీ అయిన సీపీ కల్మేశ్వర్ బదిలీ చేశారు. ఇక్కడ పని చేసిన ఏసీపీ విష్ణుమూర్తిని డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేయగా ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సస్పెషన్ చేశారు. అంతేకాకుండా అవినీతికి సహకరించిన ఇద్దరు టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుళ్లను సీపీ కల్మేశ్వర్ సస్పెండ్ చేశారు. దీంతో టాస్క్‌ఫోర్స్ సీఐ అంజయ్య సెలవులో ఉండగా మరో సీఐ పురుషోత్తం ఉన్నారు. టాస్క్‌ఫోర్స్‌లో సిబ్బంది లేకపోవడంతో టాస్క్‌ఫోర్స్ ఆఫీస్‌కు తాళం వేశారు. దీపావళి పండుగకు టాస్క్‌ఫోర్స్ పేకాట కేంద్రాలపై దాడులు చేయాల్సిన విభాగం ఇప్పుడు నిర్వీర్యంగా మారడంతో పేకాట ఆడేవారికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది.
చేతులు మారనున్న లక్షల రూపాయలు
దీపావళి నేపథ్యంలో పేకాటకు
సిద్ధమవుతున్న గ్రూపులు
జిల్లాతో పాటు మహారాష్ట్రలోని
పలు ప్రాంతాల్లో స్థావరాల ఏర్పాటు
పోలీసుల నిఘా కరువు
పేకాటలో రమ్మీకి త్రీకార్డ్స్, జోడీకి ఏడుగురు సభ్యులు, అందర్‌బాయర్‌కి 20 మంది సభ్యులు కలిసి పేకాట ఆడుతారు. పేకాట నిర్వాహకులు రూ.5 వేల నుంచి ప్రారంభించి రూ.లక్షల వరకు ఆడించడం జరుగుతుంది. ఒక ఆటలో పేకాట ఆడేవారు ఆడే ఆటను బట్టి పైసలు వసూలు చేస్తారు. రూ. 5 వేల ఆటకు రూ.5వేలను ఆట నిర్వాహకులు పేకాట ఆడేవారి నుంచి వసూలు చేస్తారు. ఇలా ఒకే రోజు నిర్వాహకులు రూ.లక్షలు సంపాదిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈత, తాటి వనాలు, వ్యవసాయ ప్రాంతాలతో పాటు అటవీ ప్రాంతాల్లో పేకాట ఆడుతున్నారు. నగరంలో అపార్ట్‌మెంట్లు, జిల్లా సరిహద్దు, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతల్లో పేకాట స్థావరాలను ఏర్పాటు చేసి రహస్యంగా పేకాట ఆడిస్తున్నట్లు సమాచారం. జిల్లాలోని 32 పోలీస్‌స్టేషన్లలో దీపావళి సందర్భంగా పోలీసులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తారు. కానీ పోలీసులు పేకాట ఆడేవారిని అరెస్టు చేసే సమయంలో స్థానిక ప్రజాప్రతినిధుల అండతో కేసులను మాఫీ చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment