No Headline
నస్రుల్లాబాద్ మండలం అంకోల్‌లో గ్రామసభను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తోంది. మంగళవారం పంచాయతీలలో గ్రామ సభలు, బల్దియాలలో వార్డు సభలు ప్రారంభమయ్యాయి. అధికారులు ఆయా పథకాలకు సంబంధించి ఇటీవల నిర్వహించిన సర్వేల ద్వారా తయారు చేసిన అర్హుల జాబితాలను చదివి వినిపించారు. జాబితాల్లో పేర్లు లేని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో చాలా గ్రామాల్లో ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు. ప్రజాపాలనతోపాటు మీ సేవ కేంద్రాలలో పలుమార్లు దరఖాస్తు చేసుకున్నామని, అయినా తమను ఎందుకు ఎంపిక చేయలేదని అధికారులను నిలదీశారు. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలంటూ అధికారులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే తప్పించుకునేందుకే మళ్లీ దరఖాస్తులు అంటున్నారంటూ ప్రజలు మండిపడ్డారు. కొన్నిచోట్ల ఇల్లు ఉన్న వారి పేర్లే ఇందిరమ్మ పథకం జాబితాలో ఉండడం, భూమి ఉన్న వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా జాబితాలో చోటు దక్కడంతో నిరసన తెలిపారు.
జుక్కల్ మండలం చిన్నగుల్ల గ్రామసభలో రశ్రీపజలతో చర్చిస్తున్న అడిషనల్ కలెక్టర్ విక్టర్
జిల్లాలో తొలిరోజు 168 సభలు..
జిల్లాలో మంగళవారం తొలిరోజు 145 గ్రామ సభలు, మున్సిపాలిటీలకు సంబంధించి 23 వార్డు సభలు నిర్వహించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు నియోజకవర్గంలోని పలు మండలాల్లో ప్రజాపాలన సభలకు హాజరయ్యారు. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఆయన భరోసా ఇచ్చారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి విదేశీ పర్యటనలో ఉండడంతో వారు ప్రజాపాలన సభలకు హాజరుకాలేదు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కూడా స్థానికంగా లేరు. బాన్సువాడలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాల్‌రాజు వార్డు సభలలో పాల్గొన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ దోమకొండ, భిక్కనూరు మండలాల్లో, అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి ఎల్లారెడ్డి, లింగంపేట మండలాల్లో, అదనపు కలెక్టర్ వి.విక్టర్ బిచ్కుంద, బాన్సువాడ మండలాల్లో, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి బాన్సువాడ పట్టణంతో పాటు నిజాంసాగర్ తదితర మండలాల్లో పర్యటించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే సర్వే పూర్తి చేసిన అధికారులు.. మంగళవారంనుంచి గ్రామసభల బాటపట్టారు. అయితే అర్హుల జాబితాలో పేర్లు లేనివారు నిరాశకు గురై అధికారులను నిలదీస్తున్నారు. గ్రామ సభల తొలిరోజు జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment