గాంధారి మండలం గౌరారం కలాన్‌లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా జాబితా మొత్తం అనర్హులతో ఉందని, దాన్ని తిరస్కరిస్తున్నామని గ్రామస్తులు తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మాన పత్రంపై పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రత్యేకాధికారి సంతకాలు చేశారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళతామని పేర్కొన్నారు. రాజంపేట మండల కేంద్రంలో రేషన్ కార్డులు, ఇళ్ల మంజూరు విషయంలో గ్రామస్తులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అర్హులకు ఇవ్వడం లేదని ఆరోపించారు. తాడ్వాయి మండలం కృష్ణాజీవాడిలో అర్హుల జాబితాల్లో తమ పేర్లు లేవని కొందరు నిలదీయగా, జాబితాలో పేర్లు రాని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. అయితే ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలని పలువురు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సదాశివనగర్ మండలంలోని పలు గ్రామాల్లో అనర్హులను జాబితాలో చేర్చారని ప్రజలు అధికారులను నిలదీశారు. జాబితాలను రద్దుచేయాలని కోరుతూ తీర్మానం చేశారు. నస్రుల్లాబాద్ మండలం అంకోల్ గ్రామంలో ఉపాధి హామీ పనులు జరగలేదని, దీంతో తమకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సభను వాయిదా వేయాలంటే డిప్యూటీ తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు. బిచ్కుంద మండలం ఫత్లాపూర్‌లో రేషన్ కార్డుల జాబితాలో తమ పేర్లు ఎందుకు రాలేదంటూ పలువురు నిలదీశారు. బాన్సువాడ మండలం జక్కల్‌దాని తండాలో తమకు రుణమాఫీ కాలేదని కొందరు, రేషన్ కార్డుల జాబితాలో పేర్లు లేవని మరికొందరు నిరసన తెలిపారు. బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో ప్రజాపాలన సభలో మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ ఫ్లెక్సీలో తన ఫొటో పెట్టకపోవడంపై గొడవకు దిగారు. కామారెడ్డి పట్టణంలోని 41, 42, 43 వార్డులలో అలాగే 1 నుంచి 10 వార్డులలో గ్రామ సభలు నిర్వహించారు. రామేశ్వర్‌పల్లిలో సంక్షేమ పథకాల జాబితాలో తమ పేర్లు లేవని ప్రజలు అధికారులను నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment