శిక్షలు పడుతున్నా..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో హత్యలు పెరుగుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట గొడవలు జరగడం సర్వసాధారణమయ్యింది. కొన్ని సందర్భాల్లో ఇరు వర్గాలు దాడులు చేసుకుంటున్నారు. మరికొన్ని సంఘటనల్లో చంపుకోవడానికీ వెనుకాడడం లేదు. ఒక దారుణం జరిగి దానికి సంబంధించిన విచారణ పూర్తవకముందే మరో కేసు వెలుగులోకి వస్తోంది. 2023 సంవత్సరంలో జిల్లాలో 28 హత్యలు జరగ్గా.. 2024 సంవత్సరంలో 37 మర్డర్ కేసులు నమోదయ్యాయి. ఇది ఆందోళన ఆందోళన కలిగిస్తోంది.
కారణాలెన్నో..
గతేడాది జిల్లాలో 37 హత్య కేసులు నమోదయ్యాయి. ఇందులో పది హత్యలు కుటుంబ తగాదాల నేపథ్యంలో జరగ్గా.. ఆరు వివాహేతర సంబంధాలు, నాలుగు ఆస్తి తగాదాలు, రెండు భూ తగాదాలు, రెండు పాత కక్షలు, ఒకటి ప్రేమ వ్యవహారంలో, మరికొన్ని ఆకస్మికంగా చోటు చేసుకున్నాయి. ఆస్తుల విషయంలో కొందరు తోడబుట్టిన వారిని కాటికి పంపడానికీ వెనుకాడడం లేదు. అన్నదమ్ములు, తండ్రీకొడుకులు, దాయాదుల మధ్య కూడా గొడవలు జరిగి దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే వివాహేతర సంబంధాలూ హత్యలకు కారణమవుతున్నాయి. తమ సంబంధానికి ఉన్న అడ్డును తొలగించుకునే క్రమంలో భర్త/భార్యను చంపేస్తున్నారు. చాలా వరకు ఆవేశంలో హంతకులుగా మారుతున్నారు. దీంతో హత్యకు గురైన వ్యక్తి కుటుంబం, హత్య చేసిన వ్యక్తుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
పెద్ద దిక్కును కోల్పోయి..
హత్యకు గురైన వ్యక్తుల కుటుంబాలతో పాటు హత్య కేసుల్లో జైలుకు వెళ్లిన వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అరైస్టె జైలుకు వెళ్లిన వారిని బెయిల్‌పై బయటికి తీసుకు రావడానికి నెలల తరబడి కుటుంబ సభ్యులు అనేక కష్టాలు పడాల్సి వస్తోంది. హంతకులుగా సమాజం వారిని దగ్గరకు రానీయని పరిస్థితి ఉంటోంది. వారి మూలంగా కుటుంబ సభ్యులు కూడా బయట తిరగడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు హత్యకు గురైన కుటుంబాలు ప్రతీకార చర్యలకూ వెనుకాడడం లేదు. దీంతో భయంభయంగా బతకాల్సిన పరిస్థితి ఉంటోంది. చాలా వరకు హత్య కేసుల్లో బాధితులు, నిందితులు అందరూ పేద వారే ఉంటున్నారు. ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబం ఇబ్బందుల్లోకి నెట్టబడుతుండగా.. జైలుకు వెళ్లిన వారి కుటుంబం కూడా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది.
మానవత్వం మంటగలుస్తోంది. మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. భూములు, ఆస్తుల విషయంలో జరిగే గొడవలు, వివాహేతర సంబంధాలు హత్యలకు దారితీస్తున్నాయి. చాలా కేసుల్లో రక్త సంబంధీకులే నేరస్తులుగా తేలుతున్నారు. తండ్రిని కొడుకు, కొడుకును తండ్రి, భర్తను భార్య, భార్యను భర్త... ఇలా కుటుంబ సభ్యులే హతమారుస్తుండడం ఆందోళన
కలిగిస్తోంది.
కుటుంబ తగాదాలు, వివాహేతర
సంబంధాలతో హత్యలు
ఆస్తుల వివాదాల్లోనూ దారుణాలు
రోడ్డున పడుతున్న కుటుంబాలు
హత్య కేసుల్లో నేరస్తులకు శిక్షలు పడుతున్నాయి. హత్య జరిగి, కేసులో అరెస్టయిన నాటి నుంచి నిందితులను సమాజం హంతకులుగానే చూసి, దగ్గరకు రానీయకపోవడమూ పెద్ద శిక్ష అవుతోంది. కేసు నుంచి బయటపడేందుకు ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా ఆధారాలు దొరికి శిక్షలు పడుతున్నాయి. దీంతో మరికొన్నేళ్లు జైలు జీవితం అనుభవించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏటా నాలుగైదు కేసుల్లో జీవిత ఖైదు విధిస్తున్నారు. శిక్షలు చూసైనా కేసులు తగ్గకపోవడంతో ఆందోళన కలిగించే అంశం.
Comments
Please login to add a commentAdd a comment