అమ్మానాన్న కనిపించట్లేదని ఆత్మహత్యాయత్నం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నిద్ర లేవగానే అమ్మానాన్న కనిపించకపోవడంతో ఎనిమిదేళ్ల చిన్నారి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.. విషయాన్ని తమ్ముడికి చెప్పడంతో భయపడి, చుట్టుపక్కల వారిని పిలవడంతో ప్రాణాపాయం తప్పింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లి చెరువు తండాకు చెందిన సంతోష్–స్వర్ణ దంపతులకు ఇద్దరు కుమారులు రిత్విక్, రిక్షిత్ ఉన్నారు. సంతోష్ బంధువులు సోమవారం రాత్రి ఘర్షణ పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ వారిని స్వర్ణ ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. చికిత్స కొనసాగుతుండటంతో రాత్రి ఆస్పత్రిలోనే ఉంది. గ్రామ పంచాయతీ కార్యాలయంలో పని చేస్తున్న సంతోష్ మంగళవారం ఉదయం పిల్లలు నిద్ర లేవకముందే గ్రామసభపై ప్రచారం చేసేందుకు ఊళ్లోకి వెళ్లాడు. కాసేపటికి నిద్ర లేచిన పిల్లలు అమ్మానాన్న కనిపించకపోవడంతో భయపడ్డారు. అప్పటికే ఇంటి బయట ఆడుకుంటున్న చుట్టుపక్కల పిల్లలు మీ అమ్మ కనిపించడం లేదని తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఆందోళనకు గురయ్యారు. ఇంట్లోకి వెళ్లిన రిత్విక్.. అమ్మానాన్న కనిపించడం లేదని.. తాను ఉరివేసుకుంటున్నానని తమ్ముడికి చెప్పాడు. వెంటనే స్టూల్ పైకి ఎక్కి, చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. రిక్షిత్ భయపడి, చుట్టుపక్కల వారికి తెలుపడంతో వచ్చి, రిత్విక్‌ను కాపాడారు. మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారికి ప్రాణాపాయం తప్పింది. అయితే, ఇద్దరు పిల్లల వయసు పదేళ్లలోపే ఉండటం, ఉరేసుకునేందుకు ప్రయత్నించడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తన కొడుకు ఉరివేసుకోవడంపై అనుమానం ఉందని చిన్నారి తండ్రి సంతోష్ తెలిపాడు. బాబు పూర్తిగా కోలుకున్న తర్వాత అసలు విషయం తెలుస్తుందని చెప్పాడు.
తమ్ముడి అప్రమత్తతతో తప్పిన ప్రాణాపాయం
ఆస్పత్రిలో కోలుకుంటున్న చిన్నారి
ఘటనపై అనుమానాలు
Comments
Please login to add a commentAdd a comment