వరికి మొగి పురుగు, అగ్గి తెగులు
జగిత్యాల అగ్రికల్చర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగు చేసిన వరి పంటను తొలి దశలోనే మొగి పురుగు, అగ్గి తెగులు, జింక్, సల్ఫైడ్ సమస్యలు వేధిస్తున్నాయని రైతులు పొలాస శాస్త్రవేత్తల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు పొలాస వ్యవసాయ పరిశోధన స్థానానికి చెందిన శాస్త్రవేత్తలు బలరాం, రజనీకాంత్, సాయినాథ్, స్వాతి మంగళవారం జగిత్యాల, బుగ్గారం, ధర్మపురి మండలాల్లో పర్యటించి, పొలాలను పరిశీలించారు. రైతులకు పలు సూచనలు చేశారు. వరిలో మొగి పురుగు నివారణకు.. కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 4జి గుళికలను ఎకరానికి 8 కిలోలు లేదా క్లోరాంథ్రనిలిఫ్రోల్ 0.4జి గుళికలను 4 కిలోల చప్పున చల్లుకోవాలని సూచించారు. అలాగే, అగ్గి తెగులు నివారణకు ఇసోఫ్రోథియోలిన్ 0.6 గ్రాముల మందును లీటర్ నీటికి కలిపి, పిచికారీ చేయాలన్నారు. వరిలో జింక్ లోప నివారణకు 2 గ్రాముల జింక్ సల్ఫేట్‌ను లీటర్ నీటిలో కలిపి, పిచికారి చేయాలని పేర్కొన్నారు. సల్ఫైడ్ దుష్ప్రభావాన్ని తగ్గించేందుకు.. మొక్క వేర్లకు గాలి తగిలేలా మురుగు నీటిని తీసి, మళ్లీ నీరు పెట్టాలని సూచించారు. ఈ దశలో కాంప్లెక్స్, అమ్మోనియం సల్ఫేట్ వంటి ఎరువులు వాడొద్దని చెప్పారు.
పొలాలను పరిశీలించిన పొలాస వ్యవసాయ శాస్త్రవేత్తలు
Comments
Please login to add a commentAdd a comment