రైతుల నిరాహార దీక్ష
రుణమాఫీ, రైతు భరోసా కోసం
కథలాపూర్: రుణమాఫీ చేయాలని, రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణరావుపేటలో అన్నదాతలు మంగళవారం నిరాహారదీక్ష చేపట్టారు. ముందుగా ప్రభుత్వ పాఠశాల నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామపంచాయతీ ఎదురుగా ఉన్న మహాత్మగాంధీ విగ్రహం వద్ద దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేయాలని, రైతు భరోసా నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నిరాహార దీక్షలో అన్ని పార్టీల రైతులు కూర్చోవడం విశేషం. దీక్ష శిబిరం వద్దకు తహసీల్దార్ వినోద్, ఏవో యోగితా, ఎస్సై నవీన్‌కుమార్ చేరుకున్నారు. దీక్ష విరమించాలని, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. దీనిపై రైతులు మాట్లాడుతూ.. ఇప్పటికే రైతుభరోసా మూడుసార్లు రావాల్సి ఉందని, ఇంకెప్పుడు ఇస్తారని అధికారులను ప్రశ్నించారు. వారు కొద్దిసేపు నచ్చజెప్పడంతో దీక్ష విరమించారు. రైతు నాయకులు లోక శశిధర్‌రెడ్డి, గడ్డం రాజేశ్వర్‌రెడ్డి, బద్దం మహేందర్‌రెడ్డి, గడ్డం రాజారెడ్డి, కొండ ఆంజనేయులు, కొత్తపెల్లి శ్రీనివాస్, గడ్డం శేఖర్‌రెడ్డి, ముస్కు శ్రీనివాస్, పుర్కుటపు నర్సారెడ్డి, తీట్ల శంకర్, రవినాయక్, కృష్ణారెడ్డి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment