వివాహిత అదృశ్యం
గోదావరిఖని: స్థానిక శ్రీనగర్‌కాలనీకి చెందిన తోట వరలక్ష్మి తన కుమారుడు తోట ఆద్విక్‌తో కలిసి ఇంట్లో నుంచి ఎటో వెళ్లిపోయిందని పోలీసులు మంగళవారం తెలిపారు. ఇంట్లో గొడవ కావడంతో తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి బయకు వెళ్లిపోయిందన్నారు. ఆచూకీ తెలిసిన వారు గోదావరిఖని వన్‌టౌన్ సీఐ–1 నంబరు 87126 56516, సీఐ–2 నంబరు 87126 56517కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలని, లేదా డయల్ 100 నంబరుకు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు.
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
కరీంనగర్‌రూరల్: తీగలగుట్టపల్లి రైల్వేస్టేషన్ వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వయస్సు 28 నుంచి 30 సంవత్సరాలలోపు ఉంటుంది. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. సంబంధింకులు ఎవరైనా కరీంనగర్ రూరల్ పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలని సీఐ ప్రదీప్‌కుమార్ సూచించారు.
బీఫార్మసీ విద్యార్థిని మృతి
హుజూరాబాద్/వరంగల్ క్రైం: హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని నయీంనగర్‌లోని వాగ్దేవి బీఫార్మసీ కళాశాలలో చదువుతున్న సాయిచంద్రిక ఫ్యాన్‌కు ఉరేసుకొని అనుమానాస్పదంగా మృతిచెందినట్లు ఇన్‌స్పెక్టర్ వై.సతీశ్ తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్‌కు చెందిన బీపార్మసీ సెకండియర్ చదువుతున్న సాయి చంద్రిక (20) ఈనెల 26న హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకోగా ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మెరుగైనా చికిత్స కోసం ఈనెల 27న కరీంనగర్‌కు తరలిస్తుండగా చనిపోయినట్లు తెలిపారు. విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
భూ తగాదా కేసులో ఐదేళ్ల జైలు
ఇబ్రహీంపట్నం: భూతగాదాలతో ఓ వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడికి మెట్‌పల్లి అసిస్టెంట్ సెషన్స్ న్యాయమూర్తి నాగేశ్వర్‌రావు ఐదేళ్ల జైలు, రూ.2 వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పుచెప్పారు. సీఐ నిరంజన్‌రెడ్డి కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామానికి చెందిన సల్వాల రాజేందర్ వ్యవసాయం చేసుకుని జీవిస్తాడు. అదే గ్రామానికి చెందిన చిన్న లక్ష్మయ్య అలియాస్ లస్మయ్య మధ్య భూ హద్దుల విషయంలో గొడవలు జరిగాయి. 2017 సెప్టెంబర్ 2న రాజేందర్ పొలం పనులు చేసుకుంటుండగా చిన్న లక్ష్మయ్య గొడ్డలితో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై రామునాయక్ హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పోలీసులు కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టడంతో నిందితుడికి ఐదేళ్ల జైలు, రూ.2 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. అప్పటి ఎస్సై రాము, కోర్టు కానిస్టేబుల్ కవితను ఎస్పీ ఆశోక్ కుమార్, మెట్‌పల్లి డీఎస్పీ రాములు అభినందించినట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment