సాక్షి,బళ్లారి: బళ్లారి గ్రామీణ నియోజకవర్గం పోరు ఉత్కంఠ భరితంగా సాగుతోంది. బీజేపీ,కాంగ్రెస్ పార్టీల మధ్యనే గట్టి పోటీ నెలకొంది. బీజేపీ నుంచి జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీరాములు, కాంగ్రెస్‌నుంచి ఎమ్మెల్యే నాగేంద్ర బరిలో ఉన్నారు. ఇరువురు నేతలు బలమైన వారే కావడంతో గెలిచేందుకు నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. జిల్లా సరిహద్దులో కొలువైన శ్రీ చేళ్లగుర్కి ఎర్రితాత ఆశీస్సులు ఎవరికి ఉంటాయో..ఓటర్లు ఎవరిని గెలిపిస్తారో అనేది ఉత్కంఠగా మారింది. ఇక్కడ పోటీ చేసే వారేవరైనా చేళ్లగుర్కి ఎర్రితాత సమాధికి ప్రత్యేక పూజలు చేయించి ఎన్నికల ప్రచారం చేస్తారు. ఏపీలోని ఉరవకొండ నియోజకవర్గంలోని విడపకనకల్లు మండలంలో పలు గ్రామాలు, ఇంకో వైపు గుంతకల్లు సరిహద్దును గ్రామీణనియోజకవర్గం కలిగి ఉంది.
తెలుగు వారితో బళ్లారి గ్రామీణ ప్రజల సంబంధాలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా బళ్లారి గ్రామీణ నియోజకవర్గం ఎస్‌టీలకు రిజర్వ్ అయింది. తొలిసారిగా 2008లో మంత్రి శ్రీరాములు పోటీ చేసి గెలుపొందారు.అంతకు ముందు 2004లో బళ్లారి నగర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభన తర్వాత తొలిసారిగా నాగేంద్ర కూడ్లిగి నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు.శ్రీరాములు బళ్లారి గ్రామీణ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికతో కలిపి మూడుసార్లు వరసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా,లోక్‌సభ సభ్యుడుగా పనిచేశారు. మూడు పర్యాయాలు మంత్రిగా కూడా పనిచేశారు.
2008లో కూడ్లిగి ఎస్‌టీలకు రిజర్వ్ కావడంతో నాగేంద్ర బీజేపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. శ్రీరాములు,నాగేంద్ర స్నేహితులు. వీరిద్దరూ మాజీ మంత్రి,కేఆర్‌పీపీ వ్యవస్థాపకుడు గాలి జనార్దనరెడ్డి నీడలో రాజకీయంగా ఎదిగిన వారే. బీజేపీ నుంచే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. మారిన రాజకీయాలు నేపథ్యంలో 2013లో ఇద్దరూ నేతలు బీజేపీకి దూరం అయ్యారు. శ్రీరాములు ఏర్పాటు చేసిన బీఎస్‌ఆర్ పార్టీలోకి నాగేంద్ర చేరలేదు. 2013అసెంబ్లీ ఎన్నికల్లో నాగేంద్ర బీజేపీకి గుడ్‌బై చెప్పి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ గెలుపొందారు. శ్రీరాములు బీఎస్‌ఆర్ తరఫున బళ్లారి గ్రామీణ నియోజకవ్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. .2018 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలతో నాగేంద్ర కాంగ్రెస్ పార్టీలోకి చేరి,బళ్లారి గ్రామీణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.
ఆ ఎన్నికల్లో శ్రీరాములు చిత్రదుర్గం జిల్లా మొళకాల్మూరు నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం ఇరువురు నేతలు బళ్లారి రూరల్ నుంచి పోటీ చేస్తుండటంతో ఎన్నికల పోరు రసవత్తంగా మారనుంది. వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందిన నాగేంద్ర, ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒక పర్యాయం ఎంపీగా గెలిచి మూడు సార్లు మంత్రిగా పనిచేసిన శ్రీరాములు ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండటంతో రాష్ట్రంలోనే ఈ నియోజకవర్గంపై అందరు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో2,38,085 మంది ఓటర్లు ఉన్నారు.
పురుషులు 1,15,981 మంది, మహిళా ఓటర్లు 1,22,035 మంది ఉన్నారు. బళ్లారిజిల్లాకు పొరుగున ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ఉండటంతో తెలుగు వారి ఫ్రభావం కూడా అధికం. గ్రామీణ నియోజకవర్గపరిధిలో పల్లెల్లో కాంగ్రెస్ కన్నా బీజేపీకి కొంత సానుకూలంగా కనిపిస్తున్నప్పటికీ మైనార్టీ ఓట్లు దాదాపు 65వేలకు పైగా ఉండటంతో రూరల్ పరిధిలోకి వచ్చే కౌల్‌బజార్‌లోని మైనార్టీ ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేస్తుంటారు. కాంగ్రెస్ అభ్యర్థి నాగేంద్ర మైనార్టీ ఓట్లపై ఆశలుపెట్టుకుని గెలుస్తానని ధీమాతో ఉండగా కౌల్ బజార్‌లోని మైనార్టీ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు మంత్రి శ్రీరాములు వ్యూహాలు రచిస్తున్నారు. గెలుపు ఎవరిదో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment