టమాట.. రైతన్నకు కాసుల పంట | - | Sakshi
Sakshi News home page

టమాట.. రైతన్నకు కాసుల పంట

Published Wed, Jul 19 2023 12:36 AM | Last Updated on Thu, Jul 20 2023 5:58 PM

టమాటా పండించిన రైతన్న ఈరప్ప, సరుకును ట్రేలలో నింపి మార్కెట్‌కు తరలిస్తున్న దృశ్యం  - Sakshi

టమాటా పండించిన రైతన్న ఈరప్ప, సరుకును ట్రేలలో నింపి మార్కెట్‌కు తరలిస్తున్న దృశ్యం

హుబ్లీ: టమాటా అంటేనే భయపడే రోజులు వచ్చాయి. కారణంగా విపరీతంగా పెరిగిన టమాటా ధరలే. ఈ పంట వల్ల రైతులు చేతినిండా ఆదాయం పొందుతున్నారు. ధార్వాడలో కూడా ఒక ఎకరా పొలంలో టమాటా సాగు చేసి లక్షల రూపాయల ఆదాయం గడించారు. రాష్ట్రంలో ఖరీఫ్‌ వానలు నిరాశ పరచినా కొన్ని ప్రాంతాల్లోని రైతులు వివిధ పంటలను పండిస్తున్నారు. ఈ క్రమంలో ధార్వాడ తాలూకా గోవనకొప్ప గ్రామ రైతు ఈరప్ప సిద్దప్ప చిక్కన్నవర్‌ తనకున్న ఒక ఎకరా పొలంలో టమాటా పండించాడు. తమ పొలంలో బోరుబావి లేకపోయినా వాగులో ఉన్న నీటితోనే మొక్కలను రక్షించి మంచి దిగుబడిని సాధించారు. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో ఆయన సుమారు రూ.3 లక్షలకు పైగా ఆదాయం గడించారు. జిల్లాలో కేవలం కొందరు రైతులు మాత్రమే టమాటా సాగు చేశారు. టమాటాకు విపరీతంగా ధర రావడంతో మార్కెట్‌లో ఒక్క ట్రే టమాటా రూ.1800 నుంచి రూ.2000 వరకు ధర పలుకుతోంది. ఈ రైతు ఇప్పటి వరకు 15 సార్లు టమాటా కోత వేసి మార్కెట్‌కు పంపారు. రెండు, మూడు కోతలకు సుమారు 20 నుంచి 25 ట్రేల టమాటా లభిస్తోంది. వీటిని హుబ్లీ, ధార్వాడ మార్కెట్లలో విక్రయించారు. రైతు ఈరప్ప మాట్లాడుతూ ఎకరంలో టమాటాను పండించాను. ఈ సారి వానలు లేకపోవడంతో వాగు నీరు పెట్టాను. మంచి దిగుబడి వచ్చింది. ఇప్పటి వరకు సుమారు 30 ట్రేలు టమాటాలను మార్కెట్‌కు పంపించి రూ.3 లక్షలకు పైగా లాభం గడించానన్నారు. మరో రైతు కరియప్ప మాట్లాడుతూ తాను కూడా ఒక ఎకరంలో టమాటా పండించి మంచి దిగుబడి సాధించానన్నారు. రాత్రింబగళ్లు నీరు పెట్టాం. వాగు నీటితోనే సాగు చేశాం. తనకు కూడా రూ.3 లక్షలకు పైగా ఆదాయం లభించిందన్నారు. అలా మూడు రోజులకు ఒక్కసారి మార్కెట్‌లో విక్రయిస్తున్నామన్నారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది మంచి లాభాలు వచ్చాయన్నారు. గత ఏడాది కేవలం 1 ఎకరాకు రూ.50 వేల లాభం వచ్చిందన్నారు. ఈ సారి రూ.3 లక్షలకు పైగా ఆదాయం దక్కిందన్నారు. కాగా వర్షాభావ పరిస్థితులతోనే ఈసారి టమాటా రైతన్న పంట పండటం విధివైచిత్రి అని చెప్పవచ్చు.

ఒక ఎకరాలో రూ.3 లక్షలకు పైగా ఆదాయం గడించిన ధార్వాడ రైతన్నలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement