బస్సులో బంగారు నగలు చోరీ | Sakshi
Sakshi News home page

బస్సులో బంగారు నగలు చోరీ

Published Tue, May 7 2024 4:10 AM

-

మైసూరు: బస్సులో ఓ ప్రయాణికురాలి దృష్టి మళ్లించి ఆమె బ్యాగులో రూ. 1.80 లక్షల విలువైన బంగారు నగలు చోరీ జరిగిన ఘటన మైసూరులోని ఇలవాల వద్ద చోటుచేసుకుంది. జిల్లాలోని పిరియా పట్టణ తాలూకా నరళాపుర గ్రామానికి చెందిన దేవిరమ్మ బాధితురాలు. ఈమె తన కుమార్తెతో కలిసి బంగారు నగలను తీసుకుని బస్సులో వెళ్తున్న సమయంలో వీరి పక్కనే నిలబడి ఉన్న ఓ మహిళ చిల్లర కింద వేసి వీరి దృష్టిని మళ్లించింది. వారు కిందకు వంగి చిల్లర తీసుకుంటుండగా బ్యాగులో ఉన్న బంగారు తీసుకుని బస్సు దిగి సదరు మహిళ వెళ్లిపోయింది. విషయం గుర్తించని దేవీరమ్మ, సించనలు ఇంటికి వెళ్లి బ్యాగులో బంగారు నగలు కనిపించకపోవడంతో లబోదిబో మంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈతకు వెళ్లిన వ్యక్తి మృతి

మైసూరు: చెరువులో ఈతకు వెళ్లిన వ్యక్తి నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా కోణనూరు గ్రామంలో చోటు చేసుకుంది. చామరాజనగర పట్టణంలోని రామసముద్రంకు చెందిన దొడ్డబీది గుణశేఖర్‌ (22) మృతుడు. ఆటో డ్రైవర్‌ అయిన గుణశేఖర్‌ మరో తొమ్మిది మందితో కలిసి కోణనూరు చెరువులో ఈతకు వెళ్లాడు. ఈత కొడుతుండగా గుణశేఖర్‌ నీటిలో మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మృతదేహాన్ని వెలికి తీసి కేసు నమోదు చేశారు.

బస్సు డ్రైవర్‌పై దాడి

యశవంతపుర: కారుకు బస్సు సైడ్‌ ఇవ్వని కారణంగా ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి చేసిన ఘటన దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళ తాలూకా కల్లడ్క సమీపంలోని దాసకోడి వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కారులో వెళ్తుండగా ముందు వెళ్లతున్న బస్సు డ్రైవర్‌ కృష్ణప్ప కారుకు సైడ్‌ ఇవ్వకపోవటంతో కష్టం మీద బస్సును ఓవర్‌ టేక్‌ చేసి బస్సును ఆపి కారులోని వ్యక్తులు డ్రైవర్‌ కృష్ణప్పపై దాడి చేసి బస్సు అద్దాలు ధ్వంసం చేసి పారిపోయారు. బంట్వాళ నగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

మైసూరు: వ్యవసాయం కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మైసూరు జిల్లా హణుసూరు తాలుకా హరవెకల్లహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దేవెగౌడ (63) ఆత్మహత్య చేసుకున్న రైతు. ఈయనకు ఎకరా భూమి ఉంది. సాగు కోసం ఐఓబీ బ్యాంకులో రూ. 9 లక్షలు, మరో బ్యాంకులో రూ. 5 లక్షలు అప్పులు తెచ్చాడు. అయితే పంట సరిగా పండకపోవడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించక దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. హుణసురు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement