శ్రీకంఠేశ్వరునికి రూ. 1.72 కోట్ల కానుకలు | - | Sakshi
Sakshi News home page

శ్రీకంఠేశ్వరునికి రూ. 1.72 కోట్ల కానుకలు

Published Thu, May 16 2024 3:05 PM | Last Updated on Thu, May 16 2024 3:05 PM

శ్రీక

శ్రీకంఠేశ్వరునికి రూ. 1.72 కోట్ల కానుకలు

మైసూరు: దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన జిల్లాలోని నంజనగూడులో శ్రీకంఠేశ్వర దేవస్థానంలో బుధవారం హుండీ లెక్కింపు జరిగింది. రూ. 1.72 కోట్ల విలువైన నగదు, బంగారు కానుకలను భక్తులు సమర్పించారు. దేవస్థాన దాసోహ భవనంలో మొత్తం 35 హుండీల్లోని కానుకలను లెక్కించారు. రూ. 1,72,85,296 నగదు, 33 దేశాల నోట్లు, 92 గ్రాముల బంగారం, 3.5 కేజీల వెండి హుండీలో లభ్యమైనట్లు ఈఓ జగదీశ్‌ కుమార్‌ తెలిపారు.

హుబ్లీ– విజయవాడ

రైళ్ల రద్దు

దొడ్డబళ్లాపురం: రైల్వే ట్రాక్‌ భద్రతా పనులు జరుగుతున్నందున నేటి నుంచి హుబ్లీ – విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల సంచారాన్ని రద్దు చేశారు. గుంటూరు విభాగం పరిధిలో రైల్వే భద్రతకు సంబంధించిన కొన్ని పనులు ఉన్నందున హుబ్లీ– విజయవాడ స్టేషన్‌ల మధ్య రోజూ సంచరించే 17329, 17330 నంబర్ల రైళ్లను ఈ నెల 16 నుంచి మే 31 వరకు రద్దు చేసినట్లు తెలిపారు.

ఎరువుల షాపుల్లో తనిఖీలు

మైసూరు: రసాయనాలు, విత్తనాలు, ఎరువుల దుకాణాలలో అధికారులు హఠాత్తుగా సోదాలు నిర్వహించారు. సహాయక వ్యవసాయ డైరెక్టర్‌, వ్యవసాయాధికారి, ఇతర పరిశీలకులు మైసూరు తాలూకాలోని ఎరువులు, పెస్టిసైడ్ల దుకాణలను తనిఖీలు చేశారు. కొన్ని రసాయనాలు, విత్తనాలు, ఎరువులను నాణ్యత పరీక్షల నిమిత్తం లేబోరేటరీకి తరలించారు. కొనుగోలు తర్వాత రైతులకు కచ్చితంగా రసీదులను అందివ్వాలని దుకాణాల యజమానులను ఆదేశించారు. అనేక ఎరువుల షాపుల్లో నాసిరకం ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అధిక రేట్లకు అమ్ముతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. వ్యవసాయ సీజన్‌ ఆరంభం కావడంతో అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఉత్తుత్తి తనిఖీలు కాకుండా నకిలీ ఎరువులు, పురుగుమందులను అమ్మకుండా వ్యాపారులను కట్టడి చేయాలని రైతులు కోరారు.

మహిళ హత్య కేసులో యువతి అరెస్టు

యశవంతపుర: కోనసంద్రలో ఈ నెల 10న జరిగిన దివ్య అనే మహిళ హత్య కేసును కెంగేరి పోలీసులు ఛేదించారు. ఇంటిలో అద్దెకు ఉన్న యువతి దివ్యను గొంతు పిసికి చంపేసినట్లు నిర్ధారించారు నిందితురాలిని అరెస్ట్‌ చేశారు. వివరాలు.. గురుమూర్తి, దివ్య దంపతులకు చెందిన ఇంటిలోని ఒక పోర్షన్‌లో కోలారు జిల్లాకు చెందిన మోనిక (24) అనే యువతి అద్దెకు ఉండేది. ప్రియుడినే భర్తగా చూపి ఇల్లు అద్దెకు తీసుకుంది. ప్రైవేట్‌ సంస్థలో డేటా ఎంట్రీ అపరేటర్‌గా పని చేస్తుంది. ప్రియుడు అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడు. విలాసాలకు అలవాటు పడిన మోనిక తన ప్రియుడికి క్యాంటర్‌ వాహనం కొనివ్వాలని డబ్బు కోసం ప్రయత్నించింది. ఇంటి యజమాని దివ్య మెడలో ఉన్న బంగారంపై మోనికాకు కన్నుపడింది.

దివ్య భర్త గురుమూర్తి కెంగేరి శివనపాళ్యంలో సెలూన్‌ నడుపుతుండగా, అత్తమామలు ఉదయం పనులకెళ్లి రాత్రికి వచ్చేవారు. దివ్య తన రెండేళ్ల చిన్నారితో ఇంటిలో ఉండేది. గమనించిన మోనిక.. ఈ నెల 10న ప్రియునితో కలసి దివ్యను గొంతుపిసికి హత్య చేసి ఆమె మెడలోని 36 గ్రాముల బంగారం చైన్‌ తీసుకొని ఉడాయించారు. పోలీసులు అనుమానంతో మోనికను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా అసలు విషయం బయట పడింది. ప్రియుడు పరారీలో ఉన్నట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
శ్రీకంఠేశ్వరునికి  రూ. 1.72 కోట్ల కానుకలు  1
1/1

శ్రీకంఠేశ్వరునికి రూ. 1.72 కోట్ల కానుకలు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement