మొసలి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

మొసలి పట్టివేత

Published Mon, Sep 9 2024 1:18 AM | Last Updated on Mon, Sep 9 2024 1:18 AM

మొసలి

రాయచూరు రూరల్‌: రాయచూరు తాలూకా గంజల్లిలో రైతులు ఓ భారీ మొసలిని పట్టుకున్నారు. ఆదివారం కృష్ణానదికి నీరు పెద్ద ఎత్తున విడుదల చేశారు. పైభాగం నుంచి మొసలి కొట్టుకుని వచ్చిందని మత్స్యకారులు తెలిపారు. మొసలిని పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించారు.

క్షతగాత్రులకు పరామర్శ

రాయచూరు రూరల్‌: కప్పగల్‌ వద్ద ఆర్టీసీ బస్సును స్కూల్‌ బస్సు ఢీకొన్న ఘటనలో గాయపడిన విద్యార్థులను మంత్రి బోసురాజు ఆదివారం పరామర్శించారు. శుక్రవారం ఈ ఘటన జరిగిన విషయం తెల్సిందే. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా 32 మంది గాయపడ్డారు. ఉదయం మంత్రి బోసురాజ్‌ గాయపడిన విద్యార్థులను పరామర్శించి వారికి మెరుగైన వైద్య ఇవ్వాలని వైద్యులకు సూచించారు. అక్కడే ఉన్న బాధిత విద్యార్థుల తల్లిదండ్రులను ఓదార్చారు. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామని వెల్లడించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే హంపయ్య నాయక్‌, కలెక్టర్‌ నితీశ్‌, ఎస్పీ పుట్టమాదయ్య, సీఈఓ రాహుల్‌ తదితరులు ఉన్నారు.

డెంగీతో బాలిక మృతి

హొసపేటె: కొప్పళ జిల్లా కారటగి తాలూకా సిద్దాపూర్‌ గ్రామంలో డెంగీ జ్వరంతో బాలిక మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలిని సుఫియా (12)గా గుర్తించారు. 6వ తరగతి చదువుతున్న సుఫియాకు కొన్ని రోజులుగా జ్వరం రావడంతో తల్లిదండ్రులకు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం.

ఎత్తినహొళె నీటిపై హామీ ఇవ్వాలి

కోలారు: పశ్చిమ కనుమల నుంచి వృథాగా సముద్రంలోకి పోతున్న నీటిని ఎత్తినహొళె పథకం ద్వారా బయలుసీమ జిల్లాలకు అందించడానికి ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె నారాయణగౌడ డిమాండ్‌ చేశారు. ఆదివారం నగరంలోని ప్రభుత్వ అతిథి గృహం వద్ద విలేకరులతో మాట్లాడారు. ఎలాంటి నదీమూలాలు లేని కోలారు, చిక్కబళ్లాపురం ఉభయ జిల్లాలకు పరిశుధ్య తాగునీటిని అందించే ఎత్తినహోళె మొదటి దశను ప్రారంభించడం సంతోషించదగిన విష యం. అయినా రూ. 36 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పథకం నీరు కోలారు జిల్లాకు అందుతుందా అనేదానిపై ప్రభుత్వం జిల్లా ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. రెవెన్యూ మంత్రి కృష్ణభైరేగౌడ ఎత్తినహొళె నీరు కోలారు జిల్లాకు ప్రవహించడం అనుమానం అని చెప్పడం అనేక సందేహాలకు తావిస్తోందన్నారు. మంత్రి ప్రకటనపై ప్రభుత్వం సరైన స్పష్టత ఇవ్వాలన్నారు. ఎత్తినహొళె నీటిని 2027లోగా కోలారు జిల్లాకు అందించకుంటే తీవ్ర ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఘోర రోడ్డు ప్రమాదం

రెండు కార్లు ఢీకొని ఐదుగురు మృతి

మధుగిరి తాలూకాలో ఘటన

తుమకూరు/పావగడ: వినాయక చవితికి వచ్చి కుటుంబ సభ్యులు, బంధువులతో సంతోషంగా గడిపి తిరుగు ప్రయాణమైన వారిపై మృత్యువు పంజా విసిరింది. గణపతికి ఉండ్రాళ్లు సమర్పించి విఘ్నాలనుంచి కాపాడాలని దండాలు పెట్టుకున్నా వారు మృత్యువు నుంచి తప్పించుకోలేకపోయారు. రెండు కార్లు ఢీకొని ఐదుగురు మృత్యువాత పడిన విషాద ఘటన మధుగిరి తాలూకా కెరెగళపాళ్య గ్రామం వద్ద ఆదివారం జరిగింది. పావగడ తాలూకా ఎద్దులపల్లికి చెందిన జనార్దనరెడ్డి (50) బెంగళూరులో స్థిరపడ్డాడు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఎద్దులపల్లికి వచ్చారు. వినాయక చవితిని ఆనందంగా జరుపుకొని ఆదివారం కారులో బెంగళూరుకు బయల్దేరారు. కెరెగెళ పాళ్య వద్ద మరో కారు ఎదురైంది. రెండు కార్లు పరస్పరం ఢీకొనడంతో జనార్దనరెడ్డి, కుమారుడు దేవ(8), మరో మహిళ సింధు(40), కాలేనహళ్లికి చెందిన డ్రైవర్‌ సిద్దగంగప్ప(34),నాగరాజు(30)లు మృత్యువాత పడ్డారు. గీత, యోధ, ఆనంద్‌ గాయపడ్డారు. మధుగిరి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను, క్షతగాత్రులను మధుగిరి ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం విషయం తెలియడంతో ఎద్దులపల్లిలో రోదనలు మిన్నంటాయి. తమ కళ్లెదుటే సంబరాలు చేసుకొని వెళ్లిన వారు విగతజీవులుగా మారడాన్ని జీర్ణించుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు మధుగిరికి తరలి వెళ్లారు.

ప్రమాదానికి గురైన కార్లు

No comments yet. Be the first to comment!
Add a comment
మొసలి పట్టివేత 1
1/2

మొసలి పట్టివేత

మొసలి పట్టివేత 2
2/2

మొసలి పట్టివేత

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement