రాజధాని అతలాకుతలం | - | Sakshi
Sakshi News home page

రాజధాని అతలాకుతలం

Published Mon, Oct 21 2024 12:40 AM | Last Updated on Mon, Oct 21 2024 12:40 AM

రాజధా

బనశంకరి: గత రెండురోజులుగా బెంగళూరు నగరంలో కాస్త విరామం ఇచ్చిన వరుణుడు శనివారం నుంచి మళ్లీ జోరు చూపించాడు. బెంగళూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలుప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు జిల్లాల్లో పెద్ద మొత్తంలో పంటలు దెబ్బతినడంతో రైతులు నష్టపోయారు.

ఐటీ సిటీలో అవస్థలు

● శనివారం రాత్రి నుంచి వానకు బెంగళూరులో కుమారస్వామిలేఔట్‌ రోడ్డు జలమయమైంది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు జాగారం చేశారు.

● ఎలక్ట్రానిక్‌ సిటీ, సిల్క్‌ బోర్డు రోడ్లు మునిగిపోగా వాహనదారులు అలాగే ప్రయాణించారు. అనేక చోట్ల ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది.

● సర్జాపురలో కురిసిన వర్షంతో పరప్పన అగ్రహార, సర్జాపుర లింక్‌ రోడ్డు జలమయమైంది. నాగనాథపుర వద్ద రోడ్డు మునిగింది. ఎప్పుడు వర్షం వచ్చినా ఇదే పరిస్థితి అని స్థానికులు ఆరోపించారు.

● నగరంలో రోడ్లు గుంతలుమయం కావడంతో పాటు వాటిలో నీరు నిండి వాహనాలు నడపడం కష్టంగా మారింది.

● సాయి లేఔట్‌లో అనేక ఇళ్లలోకి నీరు చేరింది. కార్లు, బైక్‌లు సగం వరకూ మునిగాయి. 500 ఇళ్లు ఉన్న సాయిలేఔట్‌లో వర్షం వచ్చిందంటే ముంపునకు గురవుతోందని ప్రజలు తెలిపారు. ఇళ్లలోకి నీరు చొరబడి విలువైన వస్తువులు పాడయ్యాయి.

● మైసూరు రోడ్డు జయరామ సర్కిల్‌ వద్ద కారు షోరూంలోకి నీరుచేరడంతో కార్లు మునిగిపోయాయి.

● కెంగేరి, ఆర్‌ఆర్‌.నగర చుట్టుపక్కల ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ఉత్తరహళ్లిలో ఇళ్లలోకి నీరుచేరింది. మరోపక్క సిల్క్‌బోర్డు జంక్షన్‌ జలమయం కాగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. అక్కడ డ్రైనేజీ దెబ్బతిని నీరు రోడ్లపైకి వచ్చింది.

● ఇంకా చాలా ప్రాంతాల్లో కుండపోత కురిసింది. రాజాజీనగర శివనహళ్లి సిగ్నల్‌ వద్ద రోడ్డుకు అడ్డంగా చెట్టు విరిగిపడటంతో వాహనాల సంచారానికి ఇబ్బంది తలెత్తింది. పాలికె సిబ్బంది చెట్టును తొలగించారు.

రాత్రంతా కుండపోత వానలు

బెంగళూరులో పలు ప్రాంతాలు

జలమయం

అనేక జిల్లాల్లో వాన కష్టాలు

విమానాలకు అంతరాయం

దేవనహళ్లి చుట్టుపక్కల పెద్ద వర్షం పడడంతో కెంపేగౌడ విమానాశ్రయంలో అర్ధ గంటకు పైగా విమాన ప్రయాణాలు నిలిచిపోయాయి. టేకాఫ్‌, ల్యాండింగ్‌లకు అంతరాయం ఏర్పడింది. దేశంలోని వివిధ నగరాలకు వెళ్లాల్సిన విమానాలు ఆలస్యమయ్యాయి. సాంకేతిక లోపం పేరుతో వారణాసి– బెంగళూరు విమానం రద్దయింది.

మరో రెండురోజులు..

బెంగళూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మరో రెండురోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. సోమవారం బెళగావి, ధారవాడ, గదగ్‌, హావేరి, ఉత్తర కన్నడ, ఉడుపి, దక్షిణ కన్నడ, చిత్రదుర్గ, తుమకూరు, చిక్కబళ్లాపుర, కోలారు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ని ప్రకటించారు. బెంగళూరులోనూ వర్షం పడుతుందని వాతావరణ శాఖ డైరెక్టర్‌ సీఎస్‌.పాటిల్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
రాజధాని అతలాకుతలం1
1/1

రాజధాని అతలాకుతలం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement