సమస్యలు పరిష్కరిస్తాం, ఆందోళన విరమించండి
కేజీఎఫ్ : బెమెల్ సీఎండీతో చర్చించి శుక్రవారం కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని తనపై విశ్వాసం ఉంచి ఆందోళన విరమించాలని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం నగరంలో బెమెల్ కార్మికులు ఆందోళన నిర్వహిస్తున్న ప్రాంతం వద్దకు వెళ్లి కార్మికుల నుద్దేశించి మాట్లాడారు. కార్మికుల డిమాండ్లు న్యాయ సమ్మతంగా ఉన్నాయి. అయితే దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు 60 శాతం ఇప్పటికే ప్రైవేటీకరణ చేయడం జరిగింది. మిగిలిన ఫ్యాక్టరీలను కాంట్రాక్టు కార్మికులతో నిర్వహిస్తున్నారు. గత నాలుగు నెలలలో పలు ప్రభుత్వ రంగ సంస్థలను సందర్శించాను, కార్మికుల సమస్యల పట్ల తనకు అవగాహన ఉండి వీరి సమస్య పరిష్కారానికి ప్రామాణిక ప్రయత్నం చేస్తానన్నారు. కార్మికుల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లాను ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందించారన్నారు. విశాఖపట్నం వద్ద ఉన్న, ప్రభుత్వ రంగ సంస్థలో కూడా కార్మికులను తొలగించాలనే నిర్ణయం తీసుకున్నా తాను అధికారులతో చర్చించి కార్మికులను ఉద్యోగాలలో కొనసాగేలా చేశానన్నారు. బెంగుళూరులోని హెచ్‌ఎంటీతో పాటు పలు ఫ్యాక్టరీలు నష్టాలలో ఉన్నాయి వాటిని పునురుజ్జీవింప చేయాలనే ఉద్దేశంతో పలు ప్రణాళికలను రూపొందిస్తున్నామని తెలిపారు. బెమెల్ కార్మికుల న్యాయ సమ్మతమైన డిమాండ్లను ఢిల్లీలో సంబంధిత మంత్రితో చర్చించి కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తానన్నారు. స్థానిక బెమెల్ కార్మికులు కొంతమంది బెంగుళూరులోని బెమెల్ కార్యాలయానికి రావాలని అక్కడ అధికారులతో సమస్యలకు పరిష్కారం కనుగొనవచ్చునని తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ ఎం మల్లేష్‌బాబు, ముళబాగిలు ఎమ్మెల్యే సమృద్ధి మంజునాథ్, శ్రీనివాసపురం ఎమ్మెల్యే వెంకటశివారెడ్డి, సీఎంఆర్ శ్రీనాథ్, మాజీ ఎమ్మెల్యే వై సంపంగి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment