కారు బుగ్గి
శివమొగ్గ: మారుతీ ఓమ్ని కారు ఆకస్మికంగా మంటలు అంటుకొని కాలిపోయిన ఘటన శివమొగ్గ తాలూకాలోని తీర్థహళ్లి రోడ్డులోని హోన్నాపుర గ్రామం వద్ద ఆదివారం ఉదయం జరిగింది. శివమొగ్గ నగరానికి చెందిన మహ్మద్ సనావుల్లా అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి మంగళూరు నుంచి ఇంటికి వస్తుండగా, హోన్నాపుర వద్ద కారు నిలిపిన సమయంలో ఒక్క సారిగా మంటలు వచ్చాయి. కారులోనివారు బయటకి పరుగులు పెట్టారు. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే కారు కారు పూర్తిగా కాలిపోయింది.
పెళ్లి పేరుతో యువతికి మోసం
బనశంకరి: డేటింగ్ యాప్‌లో పరిచయమైన యువకుడు వివాహం చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి నగరంలో మడివాళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాలు.... మార్చి నెలలో ఓ డేటింగ్ యాప్‌లో నిహాల్ హుసేన్ అనే యువకునితో ఆమెకు పరిచయమైంది. కొన్నిరోజుల పాటు చాటింగ్ చేసుకునేవారు. స్నేహంగా మారడంతో విందు కోసం ఓ హోటల్‌కు వెళ్లారు. అక్కడ జూస్‌లో మద్యం కలిపి తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడని, గర్భవతిగా ఉన్న తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అబార్షన్ చేయించాడని యువతి తెలిపింది. పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు దాడికి పాల్పడ్డాడని పేర్కొంది.
ఎట్టకేలకు చిరుత చిక్కింది
సాక్షి, బళ్లారి: గత కొన్ని రోజులుగా చిత్రదుర్గం జిల్లాలోని సిద్దాపురం కురుబరహళ్లి, కడ్లగుద్ద తదితర గ్రామాల్లో తిరుగుతూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్న చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. ఈ చిరుత తరచూ గ్రామాల్లో చొరబడి పశువులను బలితీసుకుంది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళన మధ్య బతుకుతున్నారు. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు పలుచోట్ల బోనులు ఏర్పాటు చేశారు. ఆహారం కోసం వచ్చిన చిరుత బోనులో చిక్కింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
దోపిడీ ముఠా పట్టివేత
దొడ్డబళ్లాపురం: పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడిచేసి నగదు బ్యాగ్ లాక్కెళ్లిన దొంగలను చెన్నపట్టణ పోలీసులు అరెస్టు చేసారు. బెంగళూరు నివాసులు మహమ్మద్ సూఫియాన్, ఉమ్రాజ్ బాషా, మహమ్మద్ అష్రా, సయ్యద్ సోహెబ్ అరైస్టెన నిందితులు. వారి నుంచి కత్తులు, ఒక కారు స్వాధీనం చేసుకొన్నారు. ఈ నెల 7వ తేదీన బెంగళూరు– మైసూరు రహదారి మార్గంలోని పెట్రోల్ బంక్‌కు వెళ్లిన దుండగులు సిబ్బందిని కత్తితో బెదిరించి నగదు ఉన్న బ్యాగ్ లాక్కుని పరారయ్యారు. పోలీసులు పెట్రోల్ బంక్‌లో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.
పేపర్ లీక్ ప్రచారం..
పరీక్ష హాల్ నుంచి ధర్నాకు
రాయచూరు రూరల్: రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ ఆధీనంలో నిర్వహిస్తున్న పీడీఓల ఉద్యోగాల రాత పరీక్షలో అవాంతరాలు ఎదురు కావడంతో అభ్యర్థులు రోడ్డెక్కారు. ఆదివారం సింధనూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్షలు చేపట్టారు. 20 శాతం మంది అభ్యర్థులకు ప్రశ్నపత్రాలు ఇచ్చారు. మిగతావారు ప్రశ్నాపత్రాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో లీకై నట్లు వార్తలు వచ్చాయి. దీంతో అభ్యర్థులు పరీక్ష రాయకుండా బయటకు వచ్చి ధర్నాకు దిగారు. మాజీ ఎంపీ విరుపాక్షప్ప, తహసీల్దార్ అరుణ్ దేశాయి, డీఎస్పీ తళవార్, సీఐ దురుగప్పలు అభ్యర్థులతో చర్చించి సమస్యను శాంతింపచేశారు.
Comments
Please login to add a commentAdd a comment